వార్నర్‌ హ్యాపీగా లేడు.. ఉండడు కూడా

3 May, 2021 11:08 IST|Sakshi
Photo Courtesy: BCCI

ఢిల్లీ: ఐపీఎల్‌లో ఎంతో ఘనమైన రికార్డు ఉన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మాజీ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌కు తుది జట్టులో కూడా చోటివ్వకపోవడం తీవ్రంగా అవమానించినట్లేనని ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ బ్రెట్‌ లీ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగుల సాధించిన ఆటగాళ్ల జాబితాలో టాప్‌-5లో ఉన్న వార్నర్‌ను తప్పించడం వెనుక కచ్చితంగా బలమైన కారణమే ఉంటుందని బ్రెట్‌ లీ పేర్కొన్నాడు.

అలా కాకపోతే కెప్టెన్సీ పదవి నుంచి తొలగించిన వెంటనే ఆటగాడిగా కూడా తొలగించడం ఏంటని ప్రశ్నించాడు. ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌స్పోర్ట్స్‌తో మాట్లాడిన బ్రెట్‌ లీ.. వార్నర్‌కు వరుసగా రెండు షాక్‌లు ఇవ్వడంపై విస్మయం వ్యక్తం చేశాడు. ‘వార్నర్‌ ప్లేయింగ్‌ ఎలెవన్‌ నుంచి తప్పించడం నన్ను షాక్‌కు గురిచేసింది. ఈ సీజన్‌లో అతను అత్యుత్తమ ఫామ్‌లో ఉండకపోవచ్చు. కానీ వార్నర్‌ జట్టులో ఉన్న భరోసా వేరు. కచ్చితంగా వార్నర్‌ తుది జట్టులో ఉండాలి.

వార్నర్‌ అత్యుత్తమ ఆటగాడు.ఐపీఎల్‌లో 5,447 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక్కడ విదేశీ ఆటగాళ్ల జాబితాలో వార్నర్‌ తొలి స్థానంలో ఉన్నాడు. ఇంతటి ఘనమైన రికార్డు ఉన్న వార్నర్‌పై వేటా. మూడుసార్లు(2015, 2017,2019) ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్న ఏకైక ఆటగాడు వార్నర్‌.ఐపీఎల్‌లో అత్యధిక హాఫ్‌ సెంచరీలు(50) చేసిన రికార్డు కూడా వార్నర్‌ పేరిటే ఉంది. ఓవరాల్‌ ఐపీఎల్‌ అంతా పరుగులు చేస్తూనే ఉన్నాడు. నేను ఒకటే చెబుతున్నా. ఈ నిర్ణయంతో వార్నర్‌ హ్యాపీగా లేడు.. ఉండడు కూడా. ఒక మంచి ఆటగాడు కాబట్టి జట్టుకు సపోర్ట్‌ చేయడంలో కూడా ముందే ఉంటాడు’ అని లీ పేర్కొన్నాడు. 

ఇక్కడ చదవండి: వార్నర్‌ వద్దా.. ఒక్క ఓవర్‌ బౌలర్‌ కావాలా?
‘నేను 30-40 పరుగులు చేశానా అనేది మ్యాటర్‌ కాదు’

మరిన్ని వార్తలు