సామ్సన్‌ తప్పు లేదు.. అతను చేసింది కరెక్టే

13 Apr, 2021 19:51 IST|Sakshi

ముంబై: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో సోమవారం రాజస్తాన్‌ రాయల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదైన సంగతి తెలిసిందే. తొలుత పంజాబ్‌ ఫోర్లు, సిక్సర్లతో బ్యాటింగ్‌లో దూకుడు ప్రదర్శించగా.. తామేం తక్కువ తినలేదన్నట్లు రాజస్తాన్‌ కూడా అంతే ధీటుగా బదులిచ్చింది. అయితే అర్షదీప్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో రాజస్తాన్‌ విజయానికి 13 పరుగులు అవసరం కాగా,  తొలి నాలుగు బంతులకు 8 పరుగులు వచ్చాయి. అందులో నాల్గో బంతిని సంజూ సామ్సన్‌ సిక్స్‌గా కొట్టడంతో  ఇంకా రెండు బంతుల్లో 5 పరుగులు మాత్రమే అవసరం. కానీ ఐదో బంతికి పరుగు రాలేదు.  డీప్‌ ఎక్స్‌ట్రా కవర్‌లో షాట్‌ కొట్టినా సామ్సన్‌ కనీసం పరుగు కోసం కూడా ప్రయత్నం చేయలేదు. చివరి బంతికి సిక్స్‌ కొడితేనే గెలుస్తారు. సామ్సన్‌ ప్రయత్నించాడు.. కానీ సిక్స్‌ రాలేదు.. ఇంచుమించు బౌండరీ లైన్‌ వద్దే దీపక్‌ హుడా క్యాచ్‌ పట్డడంతో సామ్సన్‌ ఓటయ్యాడు. రాజస్తాన్‌ నాలుగు పరుగుల తేడాతో ఓటమి చెందింది.

అయితే కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో మెరిసిన సామ్సన్‌పై ప్రశంసల జల్లు కురిపించినా.. అతను సింగిల్‌ తీయకపోవడంపై పలువురు నుంచి బిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో విండీస్‌ దిగ్గజం బ్రియాన్‌ లారా సామ్సన్‌కు మద్దతుగా నిలిచాడు. క్లిష్ట సమయంలో సామ్సన్‌ తీసుకున్న నిర్ణయాన్ని నేను సమర్థిస్తున్నా. అప్పటికే కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో క్రీజులో పాతుకుపోయిన సంజూ సిక్స్‌ కొడితే విజయం సాధిస్తామని భావించి సింగిల్‌కు అవకాశమున్నా ఆ ప్రయత్నం చేయలేదు. ఐదో బంతికి ఫోర్‌ కొడుదామని భావించిన సామ్సన్‌ వ్యూహం ఫలించలేదు. అలా అని మోరిస్‌కు స్ట్రైక్‌ వచ్చి ఉంటే అతను కొడుతాడో లేదో అనుమానం కూడా ఉంటుంది. అందుకే సామ్సన్‌ ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయంలో కచ్చితంగా సామ్సన్‌ తప్పులేదు అంటూ చెప్పుకొచ్చాడు.

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీస్కోరు చేసింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (50 బంతుల్లో 91; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగగా... దీపక్‌ హుడా (28 బంతుల్లో 64; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) హైలైట్స్‌ చూపించాడు. ఆ తర్వాత కొండంత లక్ష్యాన్ని చూసి రాజస్తాన్‌ రాయల్స్‌ జడిసిపోలేదు. హిట్టర్‌ స్టోక్స్‌ (0) తొలి ఓవర్లో డకౌటైనా కంగారు పడిపోలేదు. దిమ్మదిరిగే బదులిచ్చేందుకు రాజస్తాన్‌ పరుగూ పరుగూ పోగేసింది. బౌండరీలనూ జతచేసింది. సిక్సర్లతో వేగం పెంచుకుంది. పంజాబ్‌ కింగ్స్‌కు దడపుట్టించింది.  కేవలం నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయి రాజస్తాన్‌ పరాజయం చెందింది.
చదవండి: సామ్సన్‌ చేసింది కరెక్టే  కదా..!

ఇంకేం చేయగలను: సంజూ సామ్సన్‌ భావోద్వేగం

మరిన్ని వార్తలు