ఇప్పటికే ఎన్నో రికార్డులు.. ఊరిస్తున్న మరిన్ని ఘనతలు

5 Apr, 2021 19:17 IST|Sakshi

చెన్నై:  ఈ ఐపీఎల్‌ సీజన్‌ ఏప్రిల్‌9వ తేదీన ఆర్సీబీ-ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఐపీఎల్‌ సందడి అభిమానుల్లో కనిపిస్తుండగా, అది సీజన్‌ ఆరంభమైన తర్వాత మరింత తారాస్థాయికి చేరడం ఖాయం. ఇప్పటివరకూ జరిగిన ఐపీఎల్‌ సీజన్లే అందుకు ఉదాహరణ. ఇదిలా ఉంచితే, ఒక ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో రన్‌ మెషీన్‌, ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి టాప్‌లో ఉన్నాడు.  2016 సీజన్‌లో 973 పరుగులు సాధించడం ద్వారా సింగిల్‌ ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును కోహ్లి లిఖించాడు.

అది నేటికి పదిలంగానే ఉంది. ఆ సీజన్‌లో కోహ్లి నాలుగు  సెంచరీలతో ఆ మార్కును చేరడమే కాకుండా జట్టును ఫైనల్‌కు చేర్చాడు. కానీ టైటిల్‌ను మాత్రం అందించలేకపోయాడు. ఒక సీజన్‌లో అత్యథిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లి తర్వాత స్థానంలో డేవిడ్‌ వార్నర్‌(848 పరుగులు 2016 సీజన్‌లో) రెండో స్థానంలో ఉండగా,  కేన్‌ విలియమ్సన్‌(735-2018 సీజన్‌లో) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంచితే, ఈ టోర్నమెంట్‌లో ఆల్‌టైమ్‌ అత్యధిక పరుగులు రికార్డు కూడా కోహ్లి పేరిటే ఉంది.

మొత్తంగా ఇప్పటివరకూ కోహ్లి 5878 ఐపీఎల్‌ పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌ ప్రారంభమైన ఆరంభం నుంచే ఆర్సీబీకే ఆడుతున్న కోహ్లి.. ఆ జట్టు చేరిన మూడు ఫైనల్లోనూ భాగమయ్యాడు. అయితే ఐపీఎల్‌లో ఓపెనర్‌గా కోహ్లి యావరేజ్‌ 46.90గా ఉంది. ఇది కోహ్లి మిగతా పొజిషన్ల యావరేజ్‌ కంటే ఎక్కువ కావడం విశేషం. మిగతా పొజిషన్లలో కోహ్లి యావరేజ్‌ 34.0 గా మాత్రమే ఉంది.  ఐపీఎల్‌లో సందీప్‌ శర్మ బౌలింగ్‌లో కోహ్లి అత్యధికంగా ఏడుసార్లు ఔటయ్యాడు. ఐపీఎల్‌లో ఇది ఒక బౌలర్‌కు వికెట్‌ సమర్పించుకునే క్రమంలో కోహ్లికి ఉన్న చెత్త రికార్డుగా నమోదైంది.  కాగా, ఈ సీజన్‌లో కోహ్లిని ఊరిస్తున్న పలు రికార్డులు ఏమిటో చూద్దాం.

ఆర్సీబీ(చాంపియన్స్‌ లీగ్‌ టీ20, ఐపీఎల్‌ కలుపుకుని) తరఫున 50 ఫిఫ్టీ ప్లస్‌ స్కోర్లు సాధించిన ఘనతను సాధించడానికి కోహ్లికి ఇంకా నాలుగు హాఫ్‌ సెంచరీలు అవసరం.

టీ20 ఫార్మాట్‌లో పదివేల పరుగులు పూర్తి చేసుకోవడానికి కోహ్లికి ఇంకా 269 పరుగులు అవసరం. 

ఐపీఎల్‌లో 200 మ్యాచ్‌ల మార్కును చేరడానికి కోహ్లి ఇంకా 8 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.  ఇప్పటికు వరకూ కోహ్లి 192 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడాడు.

ఐపీఎల్‌లో 6వేల పరుగులు చేరడానికి కోహ్లి ఇంకా 122 పరుగులు అవసరం. 

ఐపీఎల్‌లో 50 ఫిఫ్టీ ప్లస్‌ స్కోర్లు సాధించడానికి కోహ్లి ఇంకా ఆరు హాప్‌ సెంచరీలు దూరంలో ఉన్నాడు. 

ఆర్సీబీ పూర్తి స్వ్కాడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు