ఐపీఎల్‌లో ఆ రికార్డే నా టార్గెట్‌: కేకేఆర్‌ ఆల్‌రౌండర్‌‌

6 Apr, 2021 17:45 IST|Sakshi

చెన్నై: ఐపీఎల్‌ 14వ ఎడిషన్‌లో ఒకే మ్యాచ్‌లో సెంచరీతో పాటు 5 వికెట్లు సాధించడమే తన లక్ష్యమని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ పేర్కొన్నాడు. బుకీలతో సంప్రదింపులు జరిపి, ఆ విషయాన్ని దాచాడన్న కారణంగా తాత్కాలిక నిషేదానికి గురై గతేడాది ఐపీఎల్‌కు దూరంగా ఉన్న ఈ బంగ్లా ఆల్‌రౌండర్‌.. ఇటీవలే ఐపీఎల్‌ క్వారంటైన్‌ పూర్తి చేసుకొని జట్టుతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నాడు. క్వారంటైన్‌ సందర్భంగా నిర్ధేశించుకున్న కొన్ని లక్ష్యాలపై ఆయన మాట్లాడుతూ..

2021 ఐపీఎల్‌ సీజన్‌లో ఎలాగైనా ఆ రికార్డును(ఒకే మ్యాచ్‌లో సెంచరీ, 5 వికెట్లు) సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నానని వెల్లడించాడు. అలాగే రాజస్థాన్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ను ఎదుర్కొనేందుకు ఆసక్తిగా ఉన్నానని, సహచరుడు పాట్‌ కమిన్స్‌ను నెట్స్‌లో ఎదుర్కొనేందుకు ఉత్సాహంగా ఉన్నానని తెలిపాడు. కాగా, 2014లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టైటిల్‌ ఎగురేసుకుపోవడంలో కీలకంగా వ్యవహరించిన షకీబ్‌.. ప్రస్తుత సీజన్‌లో సైతం తన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. 7 ఏళ్ల కిందట జరిగిన ఆ లీగ్‌లో గౌతమ్‌ గంభీర్‌ సారధ్యంలోని కేకేఆర్‌ జట్టు కింగ్స్‌ పంజాబ్‌పై విజయం సాధించి రెండోసారి ఐపీఎల్‌ ఛాంపియన్‌గా అవతరించింది.

ఆ సీజన్‌లో షకీబ్‌.. 227 పరుగులతో పాటు 11 వికెట్లు పడగొట్టాడు. ఆతరువాత 2018, 2019 సీజన్లలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించిన షకీబ్‌ను 2020లో కేకేఆర్‌ తిరిగి దక్కించుకున్నప్పటికీ ఆ సీజన్‌లో అతను ఆడలేకపోయాడు. దీంతో త్వరలో ప్రారంభంకానున్న 14 ఐపీఎల్‌ ఎడిషన్‌ కోసం అతను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఏప్రిల్‌ 11న చెన్నై వేదికగా జరిగే మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది.
చదవండి: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌.. కీలక సభ్యుడికి కరోనా

మరిన్ని వార్తలు