సాహోరే చహర్‌ బ్రదర్స్‌.. ఇద్దరూ సేమ్‌ టూ సేమ్‌‌‌‌‌

17 Apr, 2021 14:47 IST|Sakshi

చెన్నై:  మొన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ముంబై ఇండియన్స్‌ అద్భుతమైన విజయం.. నిన్న పంజాబ్‌ కింగ్స్‌పై చెన్నై సూపర్‌ కింగ్స్ సూపర్‌ విక్టరీ.  ఈ రెండు మ్యాచ్‌లకు ఎటువంటి సంబంధం లేకపోయినా, ఆయా జట్లను గెలిపించి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు పొందిన వారికి మాత్రం సంబంధం ఉంది.  ఒకరు రాహుల్‌ చహర్‌ అయితే మరొకరు దీపక్‌ చహర్‌.  వీరిద్దరూ అన్నదమ్ములు.  రాహుల్‌ చహర్‌ రైట్‌ ఆర్మ్‌ లెగ్‌ బ్రేక్‌ బౌలర్‌ అయితే, దీపక్‌ చహర్‌ ఫాస్ట్‌ బౌలర్‌. నిన‍్న(ఏప్రిల్‌16వ తేదీ) పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో దీపక్‌ చహర్‌ తన కెరీర్‌లో గుర్తిండిపోయే గణాంకాల్ని నమోదు చేశాడు.  తన నాలుగు ఓవర్ల స్పెల్‌లో కేవలం 13 పరుగులిచ్చిన అతడు నాలుగు వికెట్లు తీశాడు. ఇందులో ఒక మెయిడెన్‌ కూడా ఉండటం విశేషం.

అయితే ఈ నాలుగు వికెట్లను కూడా నాలుగు ప్రత్యేకమైన బంతులతో చహర్‌ దక్కించుకోవడం మరొక విశేషం.  ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌ రెండో బంతికి నకుల్‌ బాల్‌తో గేల్‌ను బోల్తా కొట్టించాడు. ఆ మరుసటి బంతికే పూరన్‌ను షార్ట్‌పిచ్‌ బాల్‌తో పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో చహర్‌ హ్యాట్రిక్‌ తీసేట్లు కనిపించాడు. నాలుగో బంతిని ఇన్‌స్వింగర్‌ వేయగా... అదికాస్తా షారుఖ్‌ ఖాన్‌ ప్యాడ్‌లను తాకింది. అవుట్‌ కోసం చహర్‌ అప్పీల్‌ చేయగా అంపైర్‌ తిరస్కరించాడు. ఆరో ఓవర్‌ రెండో బంతిని ఆఫ్‌స్టంప్‌ ఆవల ఊరిస్తూ వేయగా డ్రైవ్‌ చేసిన దీపక్‌ హుడా మిడాఫ్‌లో డు ప్లెసిస్‌ చేతికి చిక్కాడు. దాంతో దీపక్‌ చహర్‌ ఖాతాలో నాలుగో వికెట్‌ చేరింది.

ఈ నెల 13వ తేదీన చెన్నై వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై గెలుపులో రాహుల్‌ చహర్‌దే కీలక పాత్ర. ముంబై ఓటమి దిశగా పయనిస్తున్నప్పుడు గేమ్‌ చేంజర్‌గా మారిపోయాడు రాహుల్‌‌.  నాలుగు ఓవర్లు వేసి నాలుగు వికెట్లను సాధించాడు రాహుల్‌ చహర్‌. ఇక‍్కడ 6.80 ఎకానమీతో పొదుపుగా బౌలింగ్‌ చేయడం మరొక విశేషం. ముంబై నిర్దేశించిన 153 పరుగుల టార్గెట్‌ ఛేదనలో కేకేఆర్‌ తొలుత గెలుపు దిశగా పయనించింది.

కాగా, చహర్‌ వేసిన ప్రతీ ఓవర్‌లోనూ వికెట్‌ సాధిస్తూ ముంబై విజయంపై ఆశలు పెంచాడు. 9 ఓవర్‌ ఐదో బంతికి శుబ్‌మన్‌ గిల్‌ను ఔట్‌ చేసిన రాహుల్‌..  ఆపై 11 ఓవర్‌ మూడో బంతికి త్రిపాఠిని పెవిలియన్‌కు పంపాడు. అటు తర్వాత 13 ఓవర్‌ ఐదో బంతికి ఇయాన్‌ మోర్గాన్‌ ఔట్‌ చేశాడు. ఇక 15 ఓవర్‌ ఐదో బంతికి నితీష్‌ రానాను ఔట్‌ చేసి ఒక్కసారిగా ముంబై ఇండియన్స్‌ గెలుపు తీసుకొచ్చాడు.  ఈ నాలుగు వికెట్లతో తిరిగి తేరుకోలేకపోయిన కేకేఆర్‌ 142 పరుగులకే పరిమితమై 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ రెండు మ్యాచ్‌లో రాహుల్‌, దీపక్‌ చాహర్‌లు తలో నాలుగు వికెట్లు తీయడమే కాకుండా మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులుకు కూడా దక్కించుకుని సాహోరే చహర్‌ బ్రదర్స్‌ అనిపించుకుంటున్నారు.

ఇక్కడ చదవండి: చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్‌.. వరస్ట్‌ నుంచి బెస్ట్‌!

>
మరిన్ని వార్తలు