IPL 2021: చెన్నై జట్టులో 'జోష్‌'.. మరింత పదునెక్కిన సీఎస్‌కే పేస్‌ దళం

22 Aug, 2021 15:44 IST|Sakshi

దుబాయ్‌: ఐపీఎల్‌ 2021 తొలి దశ మ్యాచ్‌లకు వ్యక్తిగత కారణాల చేత దూరమైన ఆసీస్‌ స్టార్‌ పేసర్‌ జోష్‌ హేజిల్‌వుడ్‌.. యూఏఈ వేదికగా జరుగనున్న రెండో దశ మ్యాచ్‌లకు అందుబాటులోకి రానున్నాడు. ఈ విషయాన్ని అతను ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎస్‌కే ఫ్రాంచైజీ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ఆసీస్‌ స్పీడ్‌స్టర్‌ రాకతో చెన్నై జట్టులో జోష్‌ పెరిగిందని, తమ పేస్‌ విభాగం మరింత పదునెక్కిందని సీఎస్‌కే  సీఈవో కాశీ విశ్వనాథన్‌ శనివారం మీడియాకు వెల్లడించారు. కాగా, జోష్‌ హేజిల్‌వుడ్‌ ఇటీవల బంగ్లాదేశ్‌తో ఆడిన టీ20 సిరీస్‌లో మంచి ఫామ్‌ను కనబర్చాడు. అతనాడిన నాలుగు మ్యాచ్‌ల్లో 8 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. జోష్‌ అదే ఫామ్‌ను కొనసాగించాలని సీఎస్‌కే కోరుకుంటోంది. జోష్‌ రాకతో చెన్నై ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, జోష్‌ హేజిల్‌వుడ్‌ను సీఎస్‌కే యాజమాన్యం ఐపీఎల్‌ 2020కు ముందు రూ. 2 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అయితే, ఆ సీజన్‌లో అతడు మూడు మ్యాచ్‌లే ఆడాడు. జట్టులో పేసర్లు ఎక్కువగా ఉండడం, విదేశీ ఆటగాళ్ల కోటా పరిమితుల కారణంగా అతడికి ఆడే అవకాశం లభించలేదు. ఇక ఐపీఎల్‌ 2021 తొలి దశ మ్యాచ్‌లకు ముందు అతడు వ్యక్తిగత కారణాలతో లీగ్‌కు దూరం కావడంతో  అతడి స్థానంలో ఆసీస్‌కే చెందిన జేసన్ బెహ్రెన్డార్ఫ్‌ సీఎస్‌కే జట్టులోకి వచ్చాడు. ప్రస్తుతం సీఎస్‌కే జట్టులో సామ్‌ కర్రన్‌, లుంగి ఎంగిడి, డ్వేన్‌ బ్రేవో, జోష్‌ హేజిల్‌వుడ్‌ వంటి విదేశీ ఫాస్ట్‌ బౌలర్లు, దీపర్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌ వంటి దేశీయ స్టార్‌ పేసర్లు ఉన్నారు.  

ఇదిలా ఉంటే, సెప్టెంబరు 19 ప్రారంభంకానున్న ఐపీఎల్‌ 2021 మలి దశ మ్యాచ్‌ల కోసం చెన్నై సూప‌ర్ కింగ్స్ సహా పలు జట్లు ఇప్పటికే దుబాయ్‌ చేరుకుని ప్రాక్టీస్‌ను మొదలుపెట్టాయి. సీఎస్‌కే కెప్టెన్‌ ధోని, రైనా, అంబటి రాయుడు సహా పలువురు ఆటగాళ్లు నెట్స్‌లో కఠోరంగా శ్రమిస్తున్నారు. ఐపీఎల్ 2021 సీజన్ వాయిదా పడే సమయానికి 7 మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే.. ఐదింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ (12 పాయింట్లు) ఆరు విజయాలతో ఉండగా.. మూడో స్థానంలో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు (10 పాయింట్లు) నిలిచింది.
చదవండి: ఐపీఎల్‌ నుంచి బట్లర్‌ అవుట్‌!

మరిన్ని వార్తలు