ఆ సమయం నాకు బ్యాడ్‌లక్‌.. అందుకే ఏడ్చేశా: పుజారా

7 May, 2021 16:23 IST|Sakshi

ముంబై: చతేశ్వర్‌ పుజారా.. సమకాలీన క్రికెట్‌లో అత్యున్నత టెస్టు ఆటగాడిగా ఇప్పటికే తనదైన ముద్ర వేశాడు. జట్టు క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు తన అసాధారణ బ్యాటింగ్‌తో ఎన్నోసార్లు టీమిండియాను గట్టెక్కించాడు. అలాంటి పుజారా తన కెరీర్‌లోనూ గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చాడు. తన కెరీర్‌‌లో అత్యంత క్లిష్టమైన సమయాన్ని ఎలా అధిగమించాననే విషయాన్ని ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు.

‘నా కెరీర్‌‌లో తొలిసారి నేను గాయపడినప్పుడు దాని నుంచి బయట పడటం చాలా కష్టంగా అనిపించింది. ఆ ఇంజ్యురీ నుంచి రికవర్ అవ్వడానికి ఆరు నెలలు పడుతుందని టీమ్ ఫిజియో చెప్పారు. దీంతో నేను చాలా నిరాశ, ఆందోళనకు గురయ్యా. ఏం చేయాలో పాలుపోక ఏడ్చేశా. అప్పుడు నేను నెగిటివ్ మైండ్‌‌సెట్‌‌తో ఉన్నా. మళ్లీ క్రికెట్ ఆడగలనా? ఒకవేళ ఆడినా అంతర్జాతీయ స్థాయిలో రాణించగలనా అనే సందేహాలతో నా బుర్ర వేడెక్కిపోయేది. ఒకానొక సమయంలో నా తల్లి దగ్గరకు వెళ్లి ఏడ్చాశా. అయితే నా తల్లి నాకు అండగా నిలబడి.. జీవితంలో ఇలాంటివి ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుందని.. వాటికి సిద్ధంగా ఉండాలంటూ దైర్యం చెప్పింది. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ కూడా మద్దతుగా నిలబడ్డారు. దీంతో నా భవిష్యత్తు గురించి ఆలోచించడం ఆపేసి, వర్తమానంపై దృష్టి పెట్టా’ అంటూ పుజారా చెప్పుకొచ్చాడు. పాజిటివ్ మైండ్‌సెట్‌‌తో ఉండటానికి యోగా, మెడిటేషన్, ప్రార్థన తనకు చాలా ఉపయోగపడ్డాయని పుజారా వివరించాడు. 

ఇక టెస్టు క్రికెటర్‌గా తనదైన ముద్ర వేసిన పుజారా ఐపీఎల్‌లో ఆడాలని ఉందంటూ తన మనసులోని కోరికను బయటపెట్టాడు. అందుకు తగ్గట్టుగానే ఫిబ్రవరిలో జరిగిన మినీ ఐపీఎల్‌ వేలంలో  సీఎస్‌కే రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే ఈ సీజన్‌లో సీఎస్‌కే ఆడిన 7 మ్యాచ్‌ల్లోనూ పుజారాకు అవకాశం రాలేదు. తుది జట్టు పటిష్టంగా ఉండడంతో పుజారా బెంచ్‌కే పరిమితమవ్వాల్సి వచ్చింది. అయితే దురదృష్టవశాత్తూ కరోనా సెగ తగలడంతో ఐపీఎల్‌ 14వ సీజన్‌ రద్దు అయింది. దీంతో పుజారాకు నిరాశే మిగిలింది. ఐపీఎల్‌ సీజన్‌ పూర్తిగా జరిగింటే కనీసం ఒకటి.. రెండు మ్యాచ్‌లైనా ఆడే అవకాశం వచ్చి ఉండేది. ఇక సీఎస్‌కే గతేడాది ఐపీఎల్‌ సీజన్‌ను మరిపిస్తూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.
చదవండి: అందరూ సేఫ్‌గా వెళ్లాకే నేను ఇంటికి పోతా!

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు