మొన్న డ్యాన్స్.. ఈరోజు డైలాగ్.. ఏదైనా నీకు సాధ్యం

24 Apr, 2021 19:48 IST|Sakshi
Courtesy : Punjab Kings Twitter

చెన్నై: పంజాబ్‌ కింగ్స్‌ విధ్వంసకర ఆటగాడు.. యునివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ ఏం చేసినా కొత్తగా అనిపిస్తుంది. ఎంటర్‌టైన్‌ చేయడంలో గేల్‌ తర్వాతే ఎవరైనా అన్నట్లుగా ఉంటుంది. మొన్నటికి మొన్న డ్యాన్స్‌లతో అలరించిన గేల్‌ తాజాగా హిందీ సినిమా డైలాగులతో రెచ్చిపోయాడు. బాలీవుడ్‌ లెజెండరీ యాక్టర్‌.. దిగ్గజ విలన్‌ అమ్రిశ్‌ పురిని ఇమిటేట్‌ చేస్తూ ఆయన ఫేమస్‌ డైలాగును గేల్‌ పలికించిన తీరు వైరల్‌గా మారింది. అమ్రిశ్‌ పురి నటించిన మిస్టర్‌ ఇండియా సినిమాలో ఆయన పలికిన ''ముగాంబో బహుత్‌ కుష్‌ హువా'' డైలాగ్‌ ఎంత ఫేమస్‌ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాలో ఆయన వేషదారణ.. హావభావాలతో అప్పటి పిల్లలంతా వణికిపోయారు.

ఈ సందర్భంగా గేల్‌ ప్రాక్టీస్‌ సమయంలో ఆ డైలాగ్‌ను చెప్పే ప్రయత్నం చేశాడు. మూడు సార్లు ప్రయత్నించగా ఆఖరిసారి అచ్చం అమ్రిశ్‌ పురి తరహాలో చెప్పేశాడు. ఇంకేముందు ఈ వీడియోనే పంజాబ్‌ కింగ్స్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. నెటిజన్లు గేల్‌ డైలాగ్‌పై వినూత్న రీతిలో కామెంట్లు చేశారు. కాగా శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ విజయం సాధించి హాట్రిక్‌ ఓటముల నుంచి ఉపశమనం పొందింది. 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ 9 వికెట్ల తేడాతో గెలిచింది. రాహుల్‌ 60*, గేల్‌ 43* చివరి వరకు నిలిచి జట్టును గెలిపించారు. ఇక పంజాబ్‌ తన తర్వాతి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 26న అహ్మదాబాద్‌ వేదికగా కేకేఆర్‌తో ఆడనుంది.
చదవండి: వారిద్దరు సూపర్‌..  పరిస్థితులకు తగ్గట్టు ఆడారు 
ఫోన్‌ కోసం ఇంత పని చేస్తావా మ్యాక్సీ.. పాపం చహల్‌

మరిన్ని వార్తలు