రూ. 1.20 కోట్లు; త్వరలోనే ఇల్లు కొంటా: యువ క్రికెటర్‌

10 Mar, 2021 12:59 IST|Sakshi
చేతన్‌ సకారియా(ఫొటో కర్టెసీ: బీసీసీఐ ట్విటర్‌)

ప్రభుత్వ ఉద్యోగిగా చూడాలనుకున్నారు

కానీ నాకు క్రికెట్‌ అంటే ఇష్టం

మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డాం

జహీర్‌ ఖాన్‌ నా రోల్‌ మోడల్‌

రాజ్‌కోట్‌లో ఇల్లు కొంటా

ఆర్‌ఆర్‌ ఆటగాడు చేతన్‌ సకారియా

న్యూఢిల్లీ: ‘‘విజయ్‌ హజారే ట్రోఫీలో ఆడే క్రమంలో ప్రాక్టీసు ముగించుకుని హోటల్‌కు వస్తున్నాం. అదే సమయంలో వేలం జరుగుతోంది. అవీ బరోట్‌ను కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు నాకు కాస్త భయం వేసింది. అసలు నన్ను ఎవరైనా కొనుగోలు చేస్తారా లేదా అనే సందేహం మొదలైంది. అయితే, వెంటనే ఆర్సీబీ బిడ్డింగ్‌ మొదలు పెట్టింది. వెంటనే రాజస్తాన్‌ రాయల్స్‌ కూడా పోటీకి వచ్చింది. 1.2 కోట్లు పెట్టి నన్ను కొనుగోలు చేసింది. అప్పుడు నా చుట్టూ ఉన్న జట్టు సభ్యులంతా బస్సులోనే సంబరాలు చేశారు. నా మీద నీళ్లు జల్లుతూ సంతోషంతో కేకలు వేశారు’’ అంటూ యువ క్రికెటర్‌ చేతన్‌ సకారియా ఉద్విగ్న క్షణాల గురించి గుర్తు చేసుకున్నాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌- 2021లో సత్తా చాటేందుకు ఆశగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.

కాగా చెన్నైలో జరిగిన ఐపీఎల్‌-2021 మినీ వేలంలో రూ. 20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన చేతన్‌ను భారీ మొత్తం వెచ్చించి ఆర్‌ఆర్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా అతడి పేరు మారుమ్రోగిపోయింది. ఇక ఏప్రిల్‌ 9 నుంచి ఐపీఎల్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. తాజాగా టైమ్స్‌ నౌతో మాట్లాడిన చేతన్‌ సకారియా తన క్రీడా, వ్యక్తిగత జీవితంలోని పలు కీలక అంశాల గురించి పంచుకున్నాడు. ‘‘ ​13 ఏళ్ల వయసు నుంచి ప్రొఫెషనల్‌ క్రికెట్‌ ఆడటం ఆరంభించాను. అంతకుముందు టెన్నిస్‌ బాల్‌ టోర్నమెంట్లలో పాల్గొన్నాను. అయితే, నా తల్లిదండ్రులు మాత్రం ముందు చదువుపై శ్ర్దద్ధ పెట్టు.ఆ తర్వాతే ఆటలు అని చెప్పేవారు. నన్ను ప్రభుత్వ ఉద్యోగిగా చూడాలనేది వారి కోరిక. కానీ నాకు మాత్రం క్రికెట్‌ అంటే పిచ్చి. పరీక్షల సమయంలో కూడా క్రికెట్‌ ఆడటం మానేవాడిని కాదు.

అండర్‌- 16 జట్టుకు నేను ఎంపికైన తర్వాతే నా తల్లిదండ్రులకు క్రికెట్‌లో మంచి భవిష్యత్తు ఉంటుందని అర్థమైంది. ఆ తర్వాతే వాళ్లే నన్ను ప్రోత్సహించడం మొదలుపెట్టారు. మొదట్లో మేం చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయితే, మా మామయ్య చాలా సాయం చేశారు. ఆయన స్టేషనరీ షాప్‌ నడిపేవారు. అందులోనే నాకు చిన్న ఉద్యోగం ఇచ్చారు. తనకు సాయంగా ఉంటే స్కూలు ఫీజులు కట్టడంతో పాటు, క్రికెట్‌ ఆడటానికి వెళ్లేందుకు డబ్బులు ఇస్తానని చెప్పారు. అలాగే చేశారు కూడా. నేను బౌలర్‌ కాబట్టి పెద్దగా క్రికెట్‌ కిట్ల అవసరం కూడా ఉండేది కాదు. ఒక లెఫ్టార్మ్‌ సీమర్‌ అయిన నాకు జహీర్‌ ఖాన్‌ ఆదర్శం. ముంబై ఇండియన్స్‌ క్యాంపులో ఉన్నపుడు ఆయన ఎన్నో సలహాలు ఇచ్చేవారు. నా బౌలింగ్‌ యాక్షన్‌ బాగుందని మెచ్చుకున్నారు. 

ఇక ఆర్‌ఆర్‌ నన్ను కొనడం ద్వారా వచ్చిన 1.2 కోట్ల డబ్బుతో ఇల్లు కొనాలనుకుంటున్నా. ప్రస్తుతం మేం వర్టేజ్‌ గ్రామంలో ఉంటున్నాం. రాజ్‌కోట్‌లో ఓ ఇల్లు కొని కుటుంబాన్ని అక్కడికి తీసుకువెళ్తాను. అయితే, నా తమ్ముడు చనిపోయిన బాధ మాత్రం ఎన్నటికీ వెంటాడుతుంది. నేను తనను చాలా మిస్పవుతున్నా. నేను ఇంట్లో లేనపుడు వాడే అన్ని పనులు చూసుకునేవాడు. కానీ ఇప్పుడు తను లేడు. తన మరణం నాకొక పెద్ద షాక్‌’’ అని 22 ఏళ్ల ఈ సౌరాష్ట్ర ఫాస్ట్‌బౌలర్ చెప్పుకొచ్చాడు. కాగా చేతన్‌ సకారియా తమ్ముడు ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే.

చదవండి: 'ద్రవిడ్‌ భయ్యా.. ఎవరీ కుర్రాడు కుమ్మేస్తున్నాడు'

మరిన్ని వార్తలు