సీఎస్‌కే మరో 189.. టాప్‌-5లోకి!

ముంబై: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఓటమి పాలైంది. సీఎస్‌కే 189 పరుగుల టార్గెట్‌ను ఢిల్లీ సునాయాసంగా ఛేదించింది. డిల్లీతో మ్యాచ్‌లో సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 188 పరుగులు సాధించింది. రైనా (54), మొయిన్‌ అలీ (36)లు దూకుడుగా ఆడగా, సామ్‌ కరాన్ ‌(34) బ్యాట్‌ ఝుళిపించాడు. రాయుడు(23), రవీంద్ర జడేజా (26 నాటౌట్‌)లు ఫర్వాలేదనిపించడంతో సీఎస్‌కే గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది.

అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్‌ 18.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఘన విజయం సాధించింది. పృథ్వీ షా (72), శిఖర్‌ ధవన్ ‌(85)లు రాణించగా, స్టోయినిస్‌(14) మూడు ఫోర్లతో కాసేపు మెరుపులు మెరిపించాడు. రిషభ్‌ పంత్ ‌(15 నాటౌట్‌) ఫోర్‌ కొట్టి మ్యాచ్‌కు ఓ చక్కటి ముగింపు ఇచ్చాడు.

సీఎస్‌కే మరో 189
సీఎస్‌కే భారీ స్కోర్లు చేసినా మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. బౌలర్లు సరిగ్గా రాణించకపోవడంతో సీఎస్‌కే మూల్యం చెల్లించుకుంది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే 189 పరుగుల టార్గెట్‌ను ప్రత్యర్థికి నిర్దేశించినా అది చివరకు వృథానే అయ్యింది. సీఎస్‌కే ఇలా 189 పరుగులు చేసి కాపాడుకోలేకపోవడం ఇది మూడోసారి. గతంలో 2009లో కేకేఆర్‌పై సెంచూరియన్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇలానే 189 పరుగులు చేసి సీఎస్‌కే ఓటమి పాలైంది.

ఆపై 2011లో కింగ్స్‌ పంజాబ్‌ (ప్రస్తుతం పంజాబ్‌ కింగ్స్‌)తో మొహాలీలో జరిగిన మ్యాచ్‌లో కూడా 189 పరుగులే సాదించి పరాజయం చవిచూసింది. ఇక ప్రత్యర్థి చేజింగ్‌ చేసే క్రమంలో సీఎస్‌కే కాపాడుకోలేక పోయిన స్కోర్లలో 206 పరుగులు ఒకటి, 191 పరుగులు ఒకటి. 2012లో చెన్నైలో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 191 పరుగుల టార్గెట్‌ను సీఎస్‌కే నిర్దేశించినా దాన్ని కాపాడుకోలేకపోయింది. ఆపై 2014లో కింగ్స్‌ పంజాబ్‌తో అబుదాబిలో జరిగిన మ్యాచ్‌లో 206 పరుగులు టార్గెట్‌ను నిర్దేశించిన ధోని అండ్‌ గ్యాంగ్‌కు ఓటమి తప్పలేదు. సీఎస్‌కే అత్యధిక పరుగులు చేసి కాపాడుకోలేక పోయిన టాప్‌-5 జాబితాలో తాజామ్యాచ్‌ కూడా చేరిపోవడం ఇక్కడ  చెప్పుకోదగ్గ అంశం.

>
Author: కె. రామచంద్రమూర్తి
మరిన్ని వార్తలు