మీకు బౌలర్లు ఉన్నారు.. కానీ డెత్‌ ఓవర్‌ బౌలర్‌ ఎక్కడ?

2 May, 2021 14:40 IST|Sakshi
Photo Courtesy: BCCI/IPL

సీఎస్‌కే బౌలింగ్‌ యూనిట్‌పై ఇర్ఫాన్‌

న్యూఢిల్లీ: ముంబై  ఇండియన్స్‌ ఎదుట భారీ లక్ష్యం ఉంచినా దాన్ని కాపాడుకోవడంలో వైఫల్యం చెందడానికి చెన్నై సూపర్‌ కింగ్స్‌ బౌలింగ్‌ యూనిటే ప్రధాన కారణమని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అభిప్రాయపడ్డాడు. ఢిల్లీ పిచ్‌ బ్యాటింగ్‌ ట్రాక్‌ అనే విషయాన్ని పక్కన బెడితే అసలు సీఎస్‌కే బౌలర్లు ఆశించిన స్థాయిలో బౌలింగ్‌ ఎక్కడ వేశారని ప్రశ్నించాడు.  మ్యాచ్‌ మొత్తంగా చూస్తే సీఎస్‌కే బౌలింగ్‌ చాలా పేలవంగా ఉందన్నాడు. ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌తో చాట్‌ చేసిన ఇర్ఫాన్‌.. ‘ ముంబై బ్యాటింగ్‌ చూడండి నిజంగానే బాగుంది. వారు షాట్లు కొట్టిన తీరు వారి బ్యాటింగ్‌ బలాన్ని చూపిస్తోంది. 

మరి అదే సమయంలో సీఎస్‌కే  బౌలర్ల బౌలింగ్‌ వైఫల్యం కూడా ముంబై హిట్టర్లు విరుచుకుపడటానికి మరొకకారణం. సీఎస్‌కేకు సరైన యార్కర్లు వేసే బౌలర్‌ లేడనేది నా అభిప్రాయం. వారికి యార్కర్ల స్పెషలిస్టు అవసరం ఉంది. ప్రస్తుతం సీఎస్‌కేలో యార్కర్లను సంధించగల బౌలర్‌ కనిపించడం లేదు. సీఎస్‌కే ఆల్‌రౌండర్లతో ఉన్న జట్టే. వారికి 7 నుంచి 8 బౌలింగ్‌ ఆప్షన్లు ఉన్నాయి. కానీ డెత్‌ ఓవర్లలో పరుగులు కాపాడే బౌలర్‌ లేడు. బంతి తడిగా ఉన్నప్పుడు యార్కర్లు వేయడం కష్టం. కానీ సామ్‌ కరాన్‌ మాత్రం ఆకట్టుకున్నాడు. కొన్ని మంచి యార్కర్లు వేశాడు. ఆ తర్వాత ఎవరూ యార్కర్లు సరిగా వేయలేదు. సీఎస్‌కే టైటిల్‌ గెలవాలంటే బౌలింగ్‌ మెరుగుపడాలి’ అని తెలిపాడు. 

ముంబై ఇండియన్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అంబటి రాయుడు (27 బంతుల్లో 72 నాటౌట్‌; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌ చేయగా... మొయిన్‌ అలీ (36 బంతుల్లో 58; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), ఫాఫ్‌ డు ప్లెసిస్‌ (28 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. డు ప్లెసిస్‌కు ఐపీఎల్‌లో ఇది వరుసగా నాలుగో అర్ధ సెంచరీ కావడం విశేషం. అనంతరం ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసి గెలించింది. పొలార్డ్‌  34 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో అజేయంగా 87 పరుగులు చేసి ముంబై విజయంలో కీలక పాత్ర  పోషించాడు. 

ఇక్కడ చదవండి: వార్నర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌ వైరల్‌
ఆ బంతిని కూడా ఫోర్‌ కొడితే ఇంకేం చేస్తాం!
భారీ హిట్టర్లు ఉంటే ఇలానే ఉంటుంది: ధోని

మరిన్ని వార్తలు