IPL 2021 CSK Vs DC: రెండు ఐపీఎల్‌ రికార్డులపై కన్నేసిన చెన్నై ఓపెనర్..

4 Oct, 2021 15:38 IST|Sakshi

Ruturaj Gaikwad On Verge Of KL Rahul Record: ఐపీఎల్‌-2021 సెకెండ్‌ ఫేస్‌లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగబోయే మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ రెండు ఐపీఎల్‌ రికార్డులను బద్దలు కొట్టేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుత సీజన్‌లో పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్ రాహుల్ పేరిట ఉన్న అత్యధిక పరుగులు(528 పరుగులు), అత్యధిక సిక్సర్ల(22) రికార్డులకు రుతురాజ్‌ అతి చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం అతని పేరిట 508 పరుగులు, 20 సిక్సర్లు ఉన్నాయి. నేటి మ్యాచ్‌లో మరో 21 పరుగులు, 3 సిక్సర్లు బాదితే కేఎల్‌ రాహుల్‌ నుంచి ఆరెంజ్‌ క్యాప్‌తో పాటు అత్యధిక సిక్సర్ల రికార్డును రుతురాజ్‌ లాగేసుకుంటాడు. ప్రస్తుతం ఉన్న  గణాంకాలను ఈ ఇద్దరు క్రికెటర్లు 12 మ్యాచ్‌ల్లోనే సాధించారు.  

ఇదిలా ఉంటే, నేటి మ్యాచ్‌లో తలపడుతున్న ఢిల్లీ, సీఎస్‌కే జట్ల గణాంకాలు ఇప్పటివరకు సమానంగా ఉన్నాయి. ఇరు జట్లు చెరో 12 మ్యాచ్‌ల్లో 9 విజయాలు సాధించి తలో 18 పాయింట్లు తమ ఖాతాల్లో వేసుకున్నారు. అయితే రన్‌రేట్‌ పరంగా చూస్తే మాత్రం సీఎస్‌కే జట్టుదే కాస్త పైచేయిగా ఉంది. ఈ జట్టుకు 0.829 నెట్‌ రన్‌రేట్‌ ఉండగా.. ఢిల్లీకి 0.551 రన్‌రేట్‌ ఉంది. ఇక ఇరు జట్ల మధ్య హెడ్‌ టూ హెడ్‌ విషయానికొస్తే.. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 24 మ్యాచ్‌లు జరగ్గా సీఎస్‌కే 15, ఢిల్లీ 9 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ఈ సీజన్‌ తొలిదశలో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కేపై ఢిల్లీ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరోవైపు ఈ  మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధిస్తే.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవడంతో పాటు ఐపీఎల్‌లో 100వ విజయాన్ని నమోదు చేస్తుంది.  
చదవండి: మ్యాక్స్‌వెల్‌ టీ20 ప్రపంచకప్‌ జట్టు.. అనూహ్యంగా ఆ ఇద్దరికి చోటు

మరిన్ని వార్తలు