Virat Kohli: సీట్లోంచి లేచి ఎగిరి గంతేశాను.. గ్రేటెస్ట్‌ ఫినిషర్‌.. ధోనిపై ప్రశంసల జల్లు

11 Oct, 2021 10:10 IST|Sakshi
Photo Courtesy: IPL

Virat Kohli Hails MS Dhoni: ధోని... అద్భుతమైన షాట్‌తో ఇన్నింగ్స్‌ ముగించి.. జట్టు గెలుపును ఖరారు చేస్తే ఆ కిక్కే వేరు. ఫార్మాట్‌ ఏదైనా... సిక్సర్‌ లేదంటే.. బౌండరీ బాది తనదైన ఫినిషింగ్‌ టచ్‌ ఇస్తే అభిమానులకు కన్నుల పండుగే. ఇక ఐపీఎల్‌-2021 సీజన్‌లో భాగంగా ఆదివారం ఇదే తరహాలో మిస్టర్‌ కూల్‌.. మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. కీలకమైన క్వాలిఫైయర్‌-1(CSK Vs DC) మ్యాచ్‌లో బౌండరీ బాది.. చెన్నైని విజయతీరాలకు చేర్చాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కేవలం అభిమానులను మాత్రమే కాదు.. సెలబ్రిటీలను కూడా ఫిదా చేస్తున్నాయి. 

ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు సారథి విరాట్‌ కోహ్లి ధోనిపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘‘కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌... గొప్ప ఫినిషర్‌... మరోసారి నిరూపించాడు. సీట్లో నుంచి లేచి ఎగిరి గంతేసేలా చేశాడు’’ అంటూ ధోని భాయ్‌పై ప్రేమను చాటుకున్నాడు. 

ఇక పంజాబ్‌ కింగ్స్‌ ఫ్రాంఛైజీ సహ యజమాని ప్రీతి జింటా సైతం ధోని ఇన్నింగ్స్‌పై స్పందించారు. ‘‘వావ్‌.. సూపర్‌ మ్యాచ్‌. ధోని.. ఫినిషర్‌ మరోసారి జట్టును ముందుండి నడిపించాడు. ఎప్పటిలాగానే ఎంతో కూల్‌గా ఉంటూనే.. తమ జట్టులోని యువ ఆటగాళ్లకు మరోసారి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు’’ అని ప్రశంసించారు. కాగా ఈ మ్యాచ్‌లో ధోని 6 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 18 పరుగులు చేశాడు. ఇక పంత్‌సేన ఓటమి పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రీతి... తదుపరి మ్యాచ్‌లో మెరుగ్గా రాణించాలని ఆకాంక్షించారు. కాగా ఇటీవల సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో సిద్దార్థ్‌ కౌల్‌ బౌలింగ్‌లో ధోని సిక్సర్‌ బాది చెన్నైని గెలిపించిన సంగతి తెలిసిందే.

క్వాలిఫైయర్‌-1 విజేత చెన్నై.. తొమ్మిదోసారి ఫైనల్‌కు!
స్కోర్లు: ఢిల్లీ క్యాపిటల్స్‌: 172/5 (20)
చెన్నై సూపర్‌కింగ్స్‌: 173/6 (19.4)

మరిన్ని వార్తలు