CSK Vs KKR: నరాలు తెగే ఉత్కంఠ.. చెన్నై విజయం

26 Sep, 2021 21:37 IST|Sakshi
Photo Courtesy: IPL

ఉత్కంఠ పోరులో చెన్నై విజయం

2 వికెట్ల తేడాతో కోల్‌కతాపై ధోని సేన గెలుపు

CSK Beats KKR By 2 Wickets: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో అబుదాబిలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ జయభేరి మోగించింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో భాగంగా చెన్నై ఓపెనర్లు రుత్‌రాజ్‌ గైక్వాడ్‌, డుప్లెసిస్‌ శుభారంభం అందించగా.. 19వ ఓవర్లో జడేజా మెరుపులు మెరిపించాడు.

వరుసగా రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో అలరించాడు. మొత్తంగా 8 బంతులు ఎదుర్కొని 22 పరుగులతో జోరు మీదున్న జడ్డూను.. ఆఖరి ఓవర్‌ ఐదో బంతికి సునిల్‌ నరైన్‌ అవుట్‌ చేయడంతో మ్యాచ్‌ రసవత్తరంగా మారింది. ఇక క్రీజులోకి వచ్చిన దీపక్‌ చహర్‌ పరుగు తీసి చెన్నై విజయం ఖరారు చేశాడు. కాగా తలైవా ధోని(1) మాత్రం మరోసారి నిరాశపరిచాడు. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. మ్యాచ్‌ గెలుపులో కీలక పాత్ర పోషించిన జడేజా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. 

విజిల్‌ పొడూ చెన్నై
ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో విజయం చెన్నైని వరించింది. రెండు వికెట్ల తేడాతో గెలుపు ధోని సేన సొంతమైంది.

స్కోర్లు: కేకేఆర్‌- 171/6 (20)
సీఎస్‌కే: 172/8 (20)

నరాలు తెగే ఉత్కంఠ
కేకేఆర్‌- చెన్నై మధ్య విజయం దోబూచులాడుతోంది. విజయానికి సీఎస్‌కే ఒక పరుగు దూరంలో ఉండగా.. చివరి ఓవర్‌ ఐదో బంతికి సునిల్‌ నరైన్‌ జడేజాను అవుట్‌ చేశాడు. ఆఖరి బంతి విజేతను నిర్ణయించనుంది.

ధోనిని బౌల్డ్‌ చేసిన వరుణ్‌
అద్భుత బంతితో వరుణ్‌ చక్రవర్తి ధోని(1)ని బౌల్డ్‌ చేశాడు. కెప్టెన్‌ మోర్గాన్‌ ప్లాన్‌ను పక్కాగా అమలు చేసి ధోనిని పెవిలియన్‌కు పంపాడు. దీంతో చెన్నై ఆరో వికెట్‌ కోల్పోయింది.

రైనా రనౌట్‌
18వ ఓవర్‌లో వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో ధోని రెండో పరుగుకు రైనాకు ఆహ్వానించాడు. కానీ రాహుల్‌ త్రిపాఠి వేగంగా స్పందించి బంతిని విసరడంతో రైనా అవుట్‌ అయ్యాడు. 


Photo Courtesy: IPL

మొయిన్‌ అలీ అవుట్‌.. క్రీజులోకి ధోని
ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో మొయిన్‌ అలీ పెవిలియన్‌ చేరాడు. 32 పరుగుల వద్ద వెంకటేశ్‌ అయ్యర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. కెప్టెన్‌ ధోని క్రీజులోకి వచ్చాడు.

రనౌట్‌ ప్రమాదం
16 ఓవర్‌లో వెంకటేశ్‌ అయ్యర్‌ను రంగంలోకి దింపాడు మోర్గాన్‌. ఈ క్రమంలో నాలుగో బంతికి మొయిన్‌ అలీ పరుగు తీయడంతో రనౌట్‌కు ఆస్కారం ఏర్పడింది. అయితే, అలీ, రైనా మెరుపు వేగంతో స్పందించడంతో ప్రమాదం తప్పింది.


Photo Courtesy: IPL

అంబటి రాయుడిని బౌల్డ్‌ చేసిన నరైన్‌
చెన్నై మూడో వికెట్‌ కోల్పోయింది. సునీల్‌ నరైన్‌ అంబటి రాయుడిని బౌల్డ్‌ చేశాడు. దీంతో 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అంబటి మైదానాన్ని వీడాడు. ఇక క్రీజులోకి వచ్చీ రావడంతోనే సురేశ్‌ రైనా ఫోర్‌ కొట్టి తన ఇన్నింగ్స్‌ ఆరంభించాడు. సీఎస్‌కే ప్రస్తుత స్కోరు-  127/3 (15).

  డుప్లెసిస్‌ అవుట్‌
చెన్నై సూపర్‌కింగ్స్‌ ఓపెనర్‌ డుప్లెసిస్‌కు అర్ధ సెంచరీ చేసే అవకాశం మిస్సయింది. 30 బంతుల్లో 43 పరుగులు చేసిన అతడు.. ప్రసిద్‌ కృష్ణ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి ఫెర్గూసన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. తద్వారా రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. 


Photo Courtesy: IPL

తొలి వికెట్‌ కోల్పోయిన చెన్నై
తొమ్మిదో ఓవర్‌లో సీఎస్‌కే తొలి వికెట్‌ కోల్పోయింది. రసెల్‌ బౌలింగ్‌లో రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ మోర్గాన్‌(40)కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం డుప్లెసిస్‌, మొయిన్‌ అలీ క్రీజులో ఉన్నారు. సీఎస్‌కే ప్రస్తుత స్కోరు- 74/1 (8.3).

నెమ్మదిగా మొదలెట్టిన సీఎస్‌కే
172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై బ్యాటింగ్‌ కొనసాగుతోంది. ఓపెనర్లు రుత్‌రాజ్‌ గైక్వాడ్‌, ఫాఫ్‌ డుప్లెసిస్‌ ఆచితూచి ఆడుతున్నారు. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తూ పరుగులు రాబడుతున్నారు. ఈ క్రమంలో ఐదు ఓవర్లు ముగిసే సరికి.. చెన్నై 42 పరుగులు చేసింది. డుప్లెసిస్‌ 23, రుత్‌రాజ్‌ 22 పరుగులతో క్రీజులో ఉన్నారు.


Photo Courtesy: IPL

చెన్నై లక్ష్యం 172.. 
ఐపీఎల్‌-2021 రెండో అంచెలో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో మోర్గాన్‌ సేన ఆరు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టుకు 172 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ఇక సీఎస్‌కే బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌ రెండు, హాజిల్‌వుడ్‌ రెండు, జడేజా ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకోగా.. అంబటి రాయుడు శుభ్‌మన్‌ గిల్‌ను రనౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు.

దినేశ్‌ కార్తిక్‌ అవుట్‌..
కేకేఆర్‌ బ్యాట్స్‌మెన్‌ దూకుడు పెంచారు. 17వ ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన దినేశ్‌ కార్తిక్‌ చివరి ఓవర్లో హిట్టింగ్‌ ఆడేందుకు ప్రయత్నించాడు. 11 బంతుల్లో 26 పరుగులతో మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. అయితే, ఆఖరి ఓవర్‌లో హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో ధోనికి క్యాచ్‌ ఇచ్చి అతడు పెవిలియన్‌ చేరాడు. ప్రస్తుతం కేకేఆర్‌ స్కోరు- 166/6 (19.4). 


Photo Courtesy: IPL

ఐదో వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌
కేకేఆర్‌ డేంజరస్‌ ఆటగాడు ఆండ్రీ రసెల్‌ను శార్దూల్‌ ఠాకూర్‌ పెవిలియన్‌కు పంపాడు. అద్భుతమైన బంతితో అతడిని బౌల్డ్‌ చేశాడు. దీంతో.. 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రసెల్‌ మైదానాన్ని వీడాడు. ఇక రసెల్‌ అవుట్‌ కావడంతో కేకేఆర్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం నితీశ్‌ రాణా(30), దినేశ్‌ కార్తిక్‌(2) క్రీజులో ఉన్నాడు.


Photo Courtesy: IPL

త్రిపాఠి.. హాఫ్‌ సెంచరీ మిస్‌
ఆది నుంచి కుదురుగా ఆడుతున్న రాహుల్‌ త్రిపాఠి హాఫ్‌ సెంచరీ మిస్‌ అయ్యాడు. రవీంద్ర జడేజా వేసిన బంతికి బౌల్డ్‌ అయ్యాడు. కాగా మొత్తంగా 33 బంతులు ఎదుర్కొన్న త్రిపాఠి 4 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 45 పరుగులు చేశాడు. జడేజా బౌలింగ్‌లో నాలుగో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ప్రస్తుతం నితీశ్‌ రాణా(16), ఆండ్రీ రసెల్‌(4) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం కేకేఆర్‌ స్కోరు- 104/4 (14).

కెప్టెన్‌ మెర్గాన్‌ అవుట్‌..
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా మూడో వికెట్‌ కోల్పోయింది. హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌(8) అవుట్‌ అయ్యాడు. అంతకుముందు వెంకటేశ్‌ అయ్యర్‌ క్యాచ్‌ మిస్‌ చేసిన డుప్లెసిస్‌ ఈసారి ఆ తప్పును పునరావృతం చేయలేదు. మోర్గాన్‌ ఇచ్చిన క్యాచ్‌ను ఒడిసిపట్టి.. అతడిని పెవిలియన్‌కు పంపాడు. ప్రస్తుతం రాహుల్‌ త్రిపాఠి(42), నితీశ్‌ రాణా(4) క్రీజులో ఉన్నారు. 

10 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్‌ స్కోరు:  78-3

కట్టడి చేస్తున్న బౌలర్లు
సీఎస్‌కే బౌలర్లు కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తున్నారు. ఐదు ఓవర్లు ముగిసే సరికి 50 పరుగులతో పటిష్టంగా ఉన్న కేకేఆర్‌.. గత నాలుగు ఓవర్లలో కేవలం 20 పరుగులు మాత్రమే చేయడం ఇందుకు నిదర్శనం. 


Photo Courtesy: IPL

రెండో వికెట్‌ కోల్పోయిన కోల్‌కతా.. 
ఆరో ఓవర్‌ తొలి బంతికే కోల్‌కతా రెండో వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్‌ వెంకటేశ్‌ అయ్యర్(18)‌, శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. వికెట్‌ కీపర్‌ ధోనికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం రాహుల్‌ త్రిపాఠి(33), కెప్టెన్‌ ఇయాన్ మోర్గాన్‌(5) క్రీజులో ఉన్నారు. కాగా మూడో ఓవర్లో చహర్‌ బౌలింగ్‌లో అయ్యర్‌కు లైఫ్‌ లభించింది. డుప్లెసిస్‌ క్యాచ్‌ మిస్‌ చేయడంతో అతడు బతికి పోయాడు. 

ఐదు ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్‌ స్కోరు: 50-1

కుదురుగా ఆడుతున్న త్రిపాఠి
గిల్‌ స్థానంలో క్రీజులోకి వచ్చిన రాహుల్‌ త్రిపాఠి ఆచితూచి ఆడుతున్నాడు. దీపక్‌ చహర్‌, సామ్‌ కరన్‌ వరుస ఓవర్లలో బౌలింగ్‌ చేస్తున్నారు. నాలుగో ఓవర్‌లో సామ్‌ కరన్‌ వేసిన బంతి నో బాల్‌గా తేలడంతో వచ్చిన ఫ్రీ హిట్‌ను అతడు సద్వినియోగం చేసుకున్నాడు. సిక్సర్‌తో సామ్‌ కరన్‌కు సమాధానమిచ్చాడు.


Photo Courtesy: IPL

తొలి వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌.. గిల్‌ అవుట్‌
తొలి ఓవర్‌లోనే కోల్‌కతా వికెట్‌ కోల్పోయింది. దీపక్‌ చహర్‌ బౌలింగ్‌లో స్టార్‌ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ అవుట్‌ అయ్యాడు. తొమ్మిది పరుగుల వద్ద రనౌట్‌గా వెనుదిరిగాడు. అంతకుముందు ఎల్బీడబ్ల్యూగా గిల్‌ అవుటైనట్లు అంపైర్‌ పేర్కొనగా.. రివ్యూలో మాత్రం నాటౌట్‌గా తేలింది. అయితే, ఆ మరుసటి బంతికే అంబటి రాయుడు డైరెక్ట్‌ త్రోతో అతడిని పెవిలియన్‌కు పంపాడు. ప్రస్తుతం వెంకటేశ్‌ అయ్యర్‌, రాహుల్‌ త్రిపాఠి క్రీజులో ఉన్నారు.


Photo Courtesy: IPL

CSK vs KKR Match Updates: చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ టాస్‌ గెలిచి.. బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఎలాంటి మార్పులు లేకుండానే మైదానంలో దిగుతున్నట్లు కేకేఆర్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ వెల్లడించాడు. ఇక చెన్నై జట్టులో మాత్రం కీలక మార్పు చోటుచేసుకుంది. డ్వేన్‌ బ్రావో స్థానంలో సామ్‌ కరన్‌ జట్టులోకి వచ్చినట్లు సీఎస్‌కే సారథి ధోని తెలిపాడు. 

ఆసక్తికర పోరుకు రంగం సిద్ధం..
అబుదాబి:
ఐపీఎల్‌-2021 రెండో అంచెలో భాగంగా మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఫేజ్‌-2లో ఓటమి ఎరుగక దూసుకుపోతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌- కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య ఆదివారం మ్యాచ్‌ జరుగనుంది. కాగా ​క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఇప్పటి వరకు ఇరు జట్లు 23 సార్లు ముఖాముఖి తలపడగా.. 15 సార్లు చెన్నైనే విజయం వరించింది. 8 సార్లు గెలుపు కేకేఆర్‌ సొంతమైంది. మరి నేడు.. అబుదాబిలోని షేక్‌ జాయేద్‌ స్టేడియంలో జరుగనున్న మ్యాచ్‌లో ధోని సేన ఆధిపత్యం కొనసాగుతుందా లేదంటే.. కేకేఆర్‌ పైచేయి సాధిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

తుది జట్లు:
చెన్నై: రుతురాజ్‌ గైక్వాడ్‌, ఫాప్‌ డుప్లెసిస్‌, మొయిన్‌ అలీ, అంబటి రాయుడు, సురేశ్‌ రైనా, ఎంఎస్‌ ధోని(కెప్టెన్‌), రవీంద్ర జడేజా, సామ్‌ కరన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చహర్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌.

కోల్‌కతా: శుభ్‌మన్‌ గిల్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, రాహుల్‌, త్రిపాఠి, ఇయాన్‌ మోర్గాన్‌(కెప్టెన్‌), నితీశ్‌ రాణా, దినేశ్‌ కార్తిక్‌, ఆండ్రీ రసెల్‌, సునీల్‌ నరైన్‌, లూకీ ఫెర్గూసన్‌, వరుణ్‌ చక్రవర్తి, ప్రసిద్‌ కృష్ణ.

>
మరిన్ని వార్తలు