MS Dhoni: చాలు సామీ.. చాలు.. ఫినిషర్‌ ఇంకా బతికే ఉన్నాడు!

1 Oct, 2021 09:38 IST|Sakshi
Photo Credit: IPL/BCCI

Dhoni finishes With Mammoth Six: ఐపీఎల్‌ గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకున్న చెన్నై సూపర్‌కింగ్స్‌.. ఈసారి మాత్రం సత్తా చాటింది. ఐపీఎల్‌-2021లో ప్లే ఆఫ్స్‌ చేరిన మొదటి జట్టుగా నిలిచింది. షార్జాలో గురువారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించి సగర్వంగా ముందడుగు వేసింది. ఆరు వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించింది. దీంతో సీఎస్‌కే ఫ్యాన్స్‌ ముఖ్యంగా.. మిస్టర్‌ కూల్‌, కెప్టెన్‌ ధోని అభిమానులు మస్తుగా ఖుషీ అవుతున్నారు. తనదైన శైలిలో సిక్సర్‌తో ఇన్నింగ్స్‌ను ముగించడమే ఇందుకు కారణం. 

ఈ క్రమంలో.. తనలో అసలైన ఫినిషర్‌ ఇంకా మిగిలే ఉన్నాడంటూ తలా నిరూపించాడని సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ సందడి చేస్తున్నారు. ఈ మ్యాచ్‌కు ఇదే హైలెట్‌ అని.. గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్నారు. విమర్శకులకు ధోని బ్యాట్‌తోనే సమాధానం చెబుతాడంటూ మీమ్స్‌ షేర్‌ చేస్తున్నారు. అయితే, కొంతమంది నెటిజన్లు మాత్రం.. ‘‘చాలా రోజుల తర్వాత కనీసం ఇప్పుడైనా మంచి షాట్‌ ఆడావు. చాలు సామీ.. చాలు’’ అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. కాగా ఎన్నో మ్యాచ్‌లలో తనదైన స్టైల్‌లో షాట్లు బాది.. బెస్ట్‌ ఫినిషర్‌గా ధోని గుర్తింపు పొందిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక నిన్నటి(సెప్టెంబరు 30) మ్యాచ్‌లో 11 బంతులు ఎదుర్కొన్న ధోని.. ఒక ఫోర్‌, ఒక సిక్సర్‌ సాయంతో 14 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో సిద్దార్థ్‌ కౌల్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ బాది చెన్నై విజయాన్ని ఖరారు చేశాడు. ఇక ఈ మ్యాచ్‌ సందర్భంగా ధోని అరుదైన రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో చెన్నై వికెట్‌ కీపర్‌గా 100 క్యాచ్‌లు అందుకున్న ఘనత సొంతం చేసుకున్నాడు. హైదరాబాద్‌ ఆటగాడు వృద్దిమాన్‌ సాహా క్యాచ్‌ అందుకోవడం ద్వారా ఈ ఫీట్‌ సాధించాడు. 

స్కోర్లు:
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- 134/7 (20)
చెన్నై సూపర్‌కింగ్స్‌- 139/4 (19.4)

చదవండి: MS Dhoni: ఈ సీజన్‌ తర్వాత రిటైర్మెంట్‌.. హెడ్‌కోచ్‌గా.. లేదంటే!

మరిన్ని వార్తలు