ధోని అంత ఈజీ క్యాచ్‌ వదిలేశాడా.. నేను నమ్మను!

29 Apr, 2021 11:17 IST|Sakshi

క్యాచ్‌ మిస్‌ చేసిన ధోని.. నెటిజన్ల కామెంట్లు!

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఐపీఎల్‌లో సాధించిన ఘనతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ను మూడుసార్లు చాంపియన్‌గా నిలిపిన మిస్టర్‌ కూల్‌.. క్యాష్‌ రిచ్‌లీగ్‌లో అత్యంత నిలకడైన జట్టుగా సీఎస్‌కే రికార్డు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, గత సీజన్‌లో చెన్నై విఫలమైనా, ఆ చేదు జ్ఞాపకాలు చెరిపేసేలా, ఐపీఎల్‌-2021లో వరుస విజయాలతో దూసుకుపోతుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా తన పేరిట అనేక రికార్డులు లిఖించుకున్న ధోని, బెస్ట్‌ వికెట్‌ కీపర్‌గానూ పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. వికెట్ల వెనుక చురుగ్గా కదులుతూ అనేకసార్లు కళ్లు చెదిరే క్యాచ్‌లు పట్టిన ఈ జార్ఖండ్‌ డైనమైట్‌ ఐపీఎల్‌లో ఇప్పటి వరకు దాదాపు 150 మందిని అవుట్‌ చేశాడు.

అయితే, బుధవారం నాటి మ్యాచ్‌లో మాత్రం సన్‌రైజర్స్‌ ఓపెనర్‌ బెయిర్‌స్టో ఇచ్చిన సులువైన క్యాచ్‌ను ధోని డ్రాప్‌ చేయడం అభిమానులకు ఒకింత షాక్‌కు గురిచేసింది. ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దీపక్‌ చహర్‌ వేసిన రెండో బంతికే బెయిర్‌స్టోను అవుట్‌ చేసే అవకాశం వచ్చింది. కానీ, బంతి దిశను సరిగ్గా అంచనా వేయలేక ధోని పూర్తిగా ఎడమవైపునకు రావడంతో అతడి చేతుల్లో పడినట్లే పడి కిందపడిపోయింది. దీంతో బెయిర్‌స్టోకు లైఫ్‌ లభించింది.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ‘‘ఏంటీ.. ధోని క్యాచ్‌ డ్రాప్‌ చేశాడా? నేను నమ్మను.. ఒకవేళ అదే నిజమైతే అంతకంటే విచిత్రం ఏమీ ఉండదు. అమ్మో.. ఒకవేళ బెయిర్‌స్టోను గనుక తొందరగా అవుట్‌ చేసి ఉండకపోతే, ఏమయ్యేదో’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా,  ధోని క్యాచ్‌ మిస్‌ చేసినప్పటికీ, బెయిర్‌స్టో(7) మాత్రం తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. నాలుగో ఓవర్‌లో సామ్‌ కరన్‌ బౌలింగ్‌లో చహర్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు.  ఇక ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.

స్కోర్లు: ఎస్‌ఆర్‌హెచ్‌- 171/3 (20)
సీఎస్‌కే- 173/3 (18.3)

చదవండి: ఇలా ఎలా మారిపోయింది?:  ధోని

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు