వార్నర్‌ షూపై పేర్లు.. రోహిత్‌లా మాత్రం కాదు  

29 Apr, 2021 15:37 IST|Sakshi
courtesy : IPL/bcci

ఢిల్లీ: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రాత ఏ మాత్రం బాగాలేదు. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదు ఓటములు.. ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో ఆఖరిస్థానంలో నిలిచింది. బుధవారం సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ మరో ఓటమిని మూటగట్టుకుంది. ఇన్నాళ్లు సన్‌రైజర్స్‌కు బలమని భావించిన బౌలింగ్‌ విభాగం సీఎస్‌కేతో మ్యాచ్‌లో మాత్రం తేలిపోయింది. మొదట బ్యాటింగ్‌ చేసి 171 పరుగులు చేసి కూడా ఎస్‌ఆర్‌హెచ్‌ ఆ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది.

ఇక నిన్నటి మ్యాచ్‌లో కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ హాఫ్‌ సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. ఎప్పుడైనా ఇన్నింగ్స్‌లను దూకుడుగా ఆరంభించే వార్నర్‌ సీఎస్‌కేతో మ్యాచ్‌లో మాత్రం తన శైలికి విరుద్ధంగా ఆడాడు. ఫలితంగా తన ఐపీఎల్‌ కెరీర్‌లోనే అత్యంత నెమ్మదైన అర్థశతకాన్ని నమోదు చేశాడు. ఈ విషయం పక్కనపెడితే.. నిన్న మ్యాచ్‌లో అతను వేసుకున్న షూ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

వార్నర్‌ షూపై ముందు భాగంలో క్యాండీ.. వెనుక భాగంలో ఇవి, ఇండీ, ఇస్లా అని రాసి ఉన్నాయి. అయితే రోహిత్‌ శర్మలాగా వార్నర్‌ కూడా ఏదైనా పర్యావరణ పరిరక్షణ కోసం అవి రాసుకొచ్చాడనుకుంటే పొరపాటు.. ఎందుకంటే వార్నర్‌ రాసుకున్న పేర్లు తన భార్య.. ముగ్గురు కూతుర్లవి. ఐపీఎల్‌కు వచ్చే ముందు తన ఫ్యామిలీతో గడిపిన మూమెంట్స్‌ను వీడియో రూపంలో విడుదల చేశాడు. తాజాగా ఐపీఎల్‌లో ఆడుతూ తన ఫ్యామిలీ మిస్‌ అవుతున్నందుకు వారిని గుర్తు చేసుకుంటూ వార్నర్‌ ఈ విధంగా రాసుకున్నాడు.

అయితే వార్నర్‌ ఇది చేయడానికి ఆదర్శం ఇంగ్లండ్‌ మాజీ ఫుట్‌బాల్‌ స్టార్‌ డేవిడ్‌ బెక్‌హమ్‌ అంట. బెక్‌హమ్‌ పదేళ్ల కిందటే ఇలా తన భార్య, పిల్లల పేర్లు అతని షూపై రాసుకొని మైదానంలోకి దిగేవాడు. అయితే దీనిపై వార్నర్‌ కాండీ వార్నర్‌ స్పందిస్తూ.. డార్లింగ్‌.. నువ్వెక్కడ ఉన్నా మేము ఎప్పుడు నీ వెంటే అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. ఇక సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌  7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. కాగా ఆ జట్టు తన తర్వాతి మ్యాచ్‌ను మే 2న రాజస్తాన్‌ రాయల్స్‌తో ఆడనుంది.
చదవండి: ఒక్క మ్యాచ్‌ మూడు రికార్డులు కొట్టిన వార్నర్‌

నాకు విసుగు తెప్పించారు: వార్నర్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు