మేం బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నాం.. అదే పెద్ద తలనొప్పి

9 Apr, 2021 17:05 IST|Sakshi
ఫోటో కర్టసీ: ఎస్‌ఆర్‌హెచ్‌ ట్విటర్‌

చెన్నై: ఈసారి ఐపీఎల్‌ సీజన్‌కు ఎస్‌ఆర్‌హెచ్‌ మంచి బ్యాలెన్స్‌డ్‌గా ఉందని.. తుది జట్టులో ఎవరికి అవకాశం కల్పించాలనేది పెద్ద సమస్యగా మారనుందని ఆ జట్టు కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ తెలిపాడు. ఆసీస్‌ నుంచి వచ్చిన వార్నర్‌ నేరుగా క్వారంటైన్‌లోకి వెళ్లిపోయాడు. ఇటీవలే ఏడు రోజుల క్వారంటైన్‌ ముగించుకొన్న వార్నర్‌ మైదానంలో ప్రాక్టీస్‌ ఆరంభించాడు. ఈ సందర్భంగా వార్నర్‌ వీడియోనూ ఎస్‌ఆర్‌హెచ్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది.

''ఈసారి సీజన్‌కు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నాం. అయితే తుది జట్టులో ఎవరికి అవకాశం ఇవ్వాలనేది మాకు పెద్ద తలనొప్పిగా మారనుంది. అయితే ఇది ఒక రకంగా మాకు మంచిదే అని చెప్పొచ్చు. బ్యాటింగ్‌ విభాగంలో నాతో పాటు బెయిర్‌ స్టో, విలియమ్‌సన్‌, మనీష్‌ పాండేలతో పటిష్టంగా కనిపిస్తుండగా.. బౌలింగ్‌లో భువీ, నటరాజన్‌లు మరోసారి కీలకం కానున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరు మంచి ఫామ్‌లో ఉండడం మాకు సానుకూలాంశం అని చెప్పొచ్చు. గత ఆరు నెలల్లో చూసుకుంటే నటరాజన్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు.. ఇప్పుడు అదే స్థాయి ప్రదర్శన కనబరిస్తే ప్రత్యర్థి జట్లకు ఇబ్బందులు తప్పకపోవచ్చు.

ఇక భువీ ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో మంచి కమ్‌బ్యాక్‌ ఇచ్చాడు. ఈసారి ఏ జట్టుకు హోం అడ్వాంటేజ్‌ లేకపోవడం కొంత వ్యతిరేకతే అయినా.. తొలి అంచెలో దాదాపు  ఎనిమిది నుంచి తొమ్మిది మ్యాచ్‌లు చెన్నై, ఢిల్లీ వేదికల్లో ఆడనున్నాం. కాబట్టి పిచ్‌ పరిస్థితి అంత ఇబ్బందికరంగా ఏం ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం. హైదరాబాద్‌ పిచ్‌తో పోలిస్తే మాత్రం ఇక్కడి పిచ్‌లు స్పిన్‌కు కాస్త ఎక్కువ అనుకూలంగా ఉంటాయి. ఇక క్వారంటైన్‌లో ఏడు రోజుల పాటు చాలా బోర్‌గా ఫీలయ్యా. సరిగ్గా ఆరు నెలల కిందటే  ఐపీఎల్‌ ఆడాం.. మళ్లీ అప్పుడే వచ్చిందా అన్న అనుమానం కలిగింది. ఇక ఈ సీజన్‌కు కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగుతున్న మేము టైటిల్‌ సాధించడంపైనే ఫోకస్‌ పెట్టనున్నాం'' అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా ఫిబ్రవరిలో జరిగిన మినీ వేలంలో ఎస్‌ఆర్‌హెచ్‌ పెద్దగా పేరున్న ఆటగాళ్లును కొనుగోలు చేయలేదు. కేదార్‌ జాదవ్ (రూ. 2 కోట్లు) ‌,ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్(రూ. 1.5 కోట్లు)‌, జగదీష్‌ సుచిత్‌(రూ. 30 లక్షలు)లను కొనుగోలు చేసింది. కాగా గతేడాది సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ మూడో స్థానంలో నిలిచింది. ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 12న చెన్నై వేదికగా కేకేఆర్‌తో ఆడనుంది.
చదవండి: 
ఐపీఎల్‌ 2021: వారిద్దరు ఎదురుపడితే ఆ మజానే వేరు

IPL 2021: ఈ ఆటగాళ్లకు ఇదే చివరి సీజన్‌ కాబోతోందా?!

>
Poll
Loading...
మరిన్ని వార్తలు