మూడేళ్ల తర్వాత నా కల నెరవేరింది.. బిగ్‌ వికెట్‌ దక్కింది!

12 Apr, 2021 16:43 IST|Sakshi
ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్‌ అవేశ్‌ ఖాన్‌- సీఎస్‌కే కెప్టెన్‌ ధోని(ఫొటోలు: బీసీసీఐ/ఐపీఎల్‌))

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి ఎంఎస్‌ ధోని వికెట్‌ తీయాలన్న తన కల ఎట్టకేలకు నెరవేరిందని ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు అవేశ్‌ ఖాన్‌ అన్నాడు. మూడేళ్ల క్రితం ఈ అవకాశం వచ్చినట్టే వచ్చే చేజారిందని, అయితే ఇప్పుడు ప్రణాళిక పక్కాగా అమలు చేయడం ద్వారా అనుకున్నది సాధించగలిగానని సంతోషం వ్యక్తం చేశాడు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో అవేశ్‌, కేవలం ఐదు మ్యాచ్‌లు ఆడి 14 వికెట్లు తీసి సత్తా చాటాడు.

ఈ క్రమంలో ఐపీఎల్‌-2021 సీజన్‌లో తమ తొలి మ్యాచ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ అవేశ్‌పై నమ్మకం ఉంచడంతో, తుదిజట్టులో అతడికి చోటు లభించింది. దీంతో డీసీ వర్సెస్‌ సీఎస్‌కే మ్యాచ్‌లో, వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని‌.. డుప్లెసిస్‌, ఎంఎస్‌ ధోని వంటి కీలక ఆటగాళ్ల వికెట్లు తీసి కెప్టెన్‌ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశాడు. జట్టు విజయంలో తనదైన పాత్ర పోషించాడు. 

ఈ నేపథ్యంలో ధోని వికెట్‌ తీయడం గురించి అవేశ్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. ‘‘మూడేళ్ల క్రితం మహి భాయ్‌ వికెట్‌ తీసే అవకాశం వచ్చింది. కానీ క్యాచ్‌ డ్రాప్‌ చేయడం(కోలిన్‌ మున్రో)తో నిరాశే ఎదురైంది. మహీ భాయ్‌ వికెట్‌ తీయాలన్న నా కల అలాగే మిగిలిపోయింది. కానీ ఇప్పుడు.. మూడు సంవత్సరాల తర్వాత అది నెరవేరింది. ఇందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను’’ అని హర్షం వ్యక్తం చేశాడు.

అదే విధంగా.. ‘‘భాయ్‌ కొన్ని రోజులుగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. మ్యాచ్‌లు ఆడలేదు. కాబట్టి తనపై ఒత్తిడి మరింతగా పెంచి, వికెట్‌ తీయాలని ప్రణాళికలు రచించాం. అవి నేను అమలు చేయగలిగాను’’ అని ప్లానింగ్‌ గురించి చెప్పుకొచ్చాడు. కాగా రెండు బంతులు ఎదుర్కొన్న ధోని, పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరిన సంగతి తెలిసిందే. ఇక చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలుపొందిన పంత్‌ సేన, ఏప్రిల్‌ 15న రాజస్తాన్‌ రాయల్స్‌తో ముంబైలో జరిగే మ్యాచ్‌కు సన్నద్ధమవుతోంది. 

చదవండి: ‘నన్ను బాధించింది..ఇక ఆలోచించడం లేదు’
ఐపీఎల్‌ ఆడకుండా క్రికెటర్లను ఆపలేం.. ఎందుకంటే!


 

>
మరిన్ని వార్తలు