ముంబైపై గెలవడం సంతోషం.. కానీ అదొక్కటే: ధవన్‌

Photo Courtesy: Delhi Capitals Twitter

చెన్నై: ముంబై ఇండియన్స్‌ వంటి పటిష్టమైన జట్టును ఓడించడం తమ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుందని ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ అన్నాడు. మంగళవారం నాటి మ్యాచ్‌లో తాము మెరుగ్గా ఆడామని, కాబట్టి విజయానికి అర్హులమేనని పేర్కొన్నాడు. డిఫెండింగ్‌ చాంపియన్‌​ ముంబై ఇండియన్స్‌తో చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో పంత్‌ సేన 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అమిత్‌ మిశ్రా స్పిన్‌ మాయాజాలానికి తోడు ధవన్‌ బ్యాట్‌తో రాణించడంతో ఢిల్లీ, ఈ సీజన్‌లో మూడో గెలుపును సొంతం చేసుకుంది. తద్వారా గత నాలుగు పర్యాయాలుగా తమపై పైచేయి సాధించిన ముంబైకి ఓటమి రుచి చూపించింది. ఐపీఎల్‌-2020 ఫైనల్లో తమను ఓడించి  చాంపియన్‌గా నిలిచిన రోహిత్‌ బృందానికి షాకిచ్చింది.

ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం ధవన్‌ మాట్లాడుతూ... ‘‘చెన్నైలో విజయం సాధించడం ఎంతో ప్రత్యేకం. ఈ ఫీలింగ్‌ వాంఖడే ఫలితానికి పూర్తి భిన్నంగా ఉంది. ముంబై ఇండియన్స్‌ వంటి జట్టును ఓడించడం సహజంగానే మా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది కదా’’ అని హర్షం వ్యక్తం చేశాడు. ఇక హాఫ్‌ సెంచరీకి చేరువలో ఉన్న సమయంలో అవుట్‌ కావడం పట్ల కాస్త నిరాశకు గురయ్యానన్న ధవన్‌.. ‘‘వికెట్‌ తడిగా మారితే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసు. అందుకే మెరుగైన భాగస్వామ్యాలు నమోదు చేయాలని భావించాం. 

లలిత్‌ యాదవ్‌తో కలిసి నిలకడగా ఇన్నింగ్స్‌ కొనసాగిస్తున్న సమయంలో, ఫిఫ్టీ పూర్తి చేయకపోవడం కాస్త నిరాశకు గురిచేసింది. అయితే, ఎట్టకేలకు భారీ విజయం సాధించడం సంతోషాన్నిచ్చింది. మా ఆట తీరు బాగుంది. ఈ విజయానికి మేం పూర్తి అర్హులం’’ అని చెప్పుకొచ్చాడు. కాగా సీజన్‌ ఆరంభం నుంచి అద్భుతంగా రాణిస్తున్న ధవన్‌.. ఈ మ్యాచ్‌లో 45 పరుగుల( 5 ఫోర్లు, ఒక సిక్సర్‌)తో రాణించాడు. ప్రస్తుతం 231 పరుగులు పూర్తిచేసుకున్న గబ్బర్‌.. ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఆరెంజ్‌ క్యాప్‌ దక్కించుకున్నాడు. ఇక మ్యాచ్‌ అనంతరం పంత్‌ బృందానికి ఘన స్వాగతం లభించింది.

చదవండి: DC Vs MI ఢిల్లీకి అమితానందం
మా ఓటమికి అదే కారణం: రోహిత్‌

Author: కె. రామచంద్రమూర్తి
మరిన్ని వార్తలు