‘నువ్వు మంచి బౌలర్‌వి భాయ్‌, కానీ నెక్ట్స్ మ్యాచ్‌ ఆడకు’

17 Apr, 2021 14:32 IST|Sakshi
Photo Courtesy: IPL

ఒక్క మ్యాచ్‌లో విఫలమైతే చెత్త ప్రదర్శన అని ముద్ర వేయకండి: చహర్‌

ముంబై: ‘‘ఆరోజు నేను గదికి వెళ్లిన తర్వాత సోషల్‌ మీడియా చెక్‌ చేసుకుంటున్నా. అప్పుడే ఒక అబ్బాయి నుంచి మెసేజ్‌ వచ్చింది. ‘‘భాయ్‌ మీరు మంచి బౌలర్‌ అని నాకు తెలుసు. అయితే, నాదొక విన్నపం.. మీరు తదుపరి మ్యాచ్‌లో మాత్రం ఆడకండి’’ అని మెసేజ్‌ పెట్టాడు. నిజానికి, ఆటగాళ్ల మీద ఎవరి అంచనాలు వారికి ఉండటం సహజం. ప్రతీ మ్యాచ్‌లోనూ అద్భుతంగా రాణించాలని కోరుకుంటారు. అందుకే ఆ అబ్బాయి నాకు అలా సందేశం పంపాడు. అయితే, నేను ఒకవేళ ఈరోజు ఆడకపోయి ఉంటే ఇలాంటి ఒక ప్రదర్శన చూసే అవకాశమే ఉండేది కాదు కదా. కాబట్టి ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన చెత్త ప్రదర్శన చేస్తాడన్న ముద్ర వేయకూడదు. అలాంటి వాళ్లకు మద్దతుగా నిలవండి’’ అని చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు దీపక్‌ చహర్‌ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. 

కాగా ఐపీఎల్‌-2021లో భాగంగా ఏప్రిల్‌ 10న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 7 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో దీపక్‌ చహర్‌.. 4 ఓవర్లు బౌలింగ్‌ చేసి 36 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. దీంతో అతడి ప్రదర్శనపై కొంతమంది విమర్శలు గుప్పించారు.  ఇదిలా ఉంటే.. శుక్రవారం నాటి మ్యాచ్‌లో చెన్నై, పంజాబ్‌ కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడంలో చహర్‌ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 

పంజాబ్‌ కీలక ఆటగాళ్లు మయాంక్‌ అగర్వాల్‌, క్రిస్‌ గేల్‌, దీపక్‌ హుడా, నికోలస్‌ పూరన్‌ వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును దెబ్బకొట్టాడు. 4 ఓవర్లలో కేవలం 13 పరుగులు ఇచ్చి 4 వికెట్లతో రాణించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం సహచర ఆటగాడు శార్దూల్‌ ఠాకూర్‌తో ముచ్చటిస్తూ ఢిల్లీ మ్యాచ్‌ ఫలితం తర్వాత సోషల్‌ మీడియాలో తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నాడు. అభిమానులకు అంచనాల మేరకు రాణించేందుకు కృషి చేస్తానని, అయితే, ఒక్క ప్రదర్శనతో తన విలువేమిటో నిర్ణయించడం సరికాదని చహర్‌ హితవు పలికాడు. 

చదవండి: నాకైతే ఫీల్డ్‌లో 11 మంది జడ్డూలు కావాలి: చహర్‌
దటీజ్‌ ధోని.. వైరల్‌ అవుతున్న ఫొటో 

 

మరిన్ని వార్తలు