ఐపీఎల్‌ 2021‌: ధవన్‌, స్టోయినిస్‌ మెరుపులు.. ఢిల్లీ సునాయాస విజయం‌‌‌‌‌‌‌‌

18 Apr, 2021 23:27 IST|Sakshi
Photo Courtesy: BCCI/IPL

‌‌‌‌‌ఆరంభంలో శిఖర్‌ ధవన్‌(92) మెరుపులకు, ఆఖర్లో స్టోయినిస్‌(13 బంతుల్లో 27 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌) సుడిగాలి ఇన్నింగ్స్‌ తోడవ్వడంతో మరో 10 బంతులు మిగిలుండగానే ఢిల్లీ  జట్టు సునాయాస విజయాన్ని సాధించింది. పంజాబ్‌ నిర్ధేశించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్‌ 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లలిత్‌ యాదవ్‌(6 బంతుల్లో 12; 2 ఫోర్లు), నాటౌట్‌గా నిలిచాడు.. పంజాబ్‌ బౌలర్లలో రిచర్డ్‌సన్‌ 2 వికెట్లు, అర్షదీప్‌, మెరిడిత్‌లకు చెరో వికెట్‌ దక్కింది. 

నాలుగో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ.. పంత్‌(15) ఔట్
రిచర్డ్‌సన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో దీపక్‌ హూడా అద్భుతమైన క్యాచ్‌ అందుకోవడంతో ఢిల్లీ కెప్టెన్‌ పంత్‌(12 బంతుల్లో 11; సిక్స్‌) పెవిలియన్‌ బాటపట్టాడు. 18.1 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్‌ 180/4. క్రీజ్‌లో స్టోయినిస్‌(23), లలిత్‌ యాదవ్‌(0) ఉన్నారు. ఢిల్లీ గెలుపునకు 17 బంతుల్లో 16 పరుగులు చేయాల్సి ఉంది. 

92 పరుగుల వద్ద ధవన్‌ క్లీన్‌ బౌల్డ్‌‌‌‌‌‌‌‌
ప్రస్తుత ఐపీఎల్‌లో ధవన్(49 బంతుల్లో 92; 13 ఫోర్లు, 2 సిక్సర్లు)‌ మరో సెంచరీ సాధించే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్‌లో 85 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరిన ధవన్‌.. ఈ మ్యాచ్‌లో కేవలం 8 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. రిచర్డ్‌సన్‌ వేసిన బంతిని స్కూప్‌ షాట్‌ ఆడే ప్రయత్నంలో క్లీన్‌బౌల్డయ్యాడు. 14.5 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్‌ 152/3. క్రీజ్లో పంత్‌(11), స్టోయినిస్‌(0) ఉన్నారు.

వరుస బౌండరీలతో విరుచకుపడుతున్న ధవన్‌..
మెరిడిత్‌ వేసిన 14వ ఓవర్‌లో శిఖర్‌ ధవన్‌ వరుస బౌండరీలతో విరుచుకుపడటంతో ఆ ఓవర్‌లో మొత్తం 18 పరుగులు వచ్చాయి. దీంతో ఢిల్లీ సునాయాసంగా లక్ష్యాన్ని చేరుకునేలా కనిపిస్తుంది. 14 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్‌ 143/2గా ఉంది. క్రీజ్‌లో ధవన్‌ (47 బంతుల్లో 91; 13 ఫోర్లు, 2 సిక్సర్లు), పంత్‌(8 బంతుల్లో 4) ఉన్నారు. పంజాబ్‌ బౌలర్లలో అర్షదీప్‌, మెరిడిత్‌లకు తలో వికెట్‌ దక్కింది.

ఢిల్లీ రెండో వికెట్‌ డౌన్‌.. స్టీవ్‌ స్మిత్‌(9) ఔట్
ప్రస్తుత సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న స్టీవ్‌ స్మిత్‌(12 బంతుల్లో 9) అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. మెరిడిత్‌ బౌలింగ్‌లో ‌‌‌‌‌‌థర్డ్‌ మెన్‌ దిశగా ఫీల్డింగ్‌ చేస్తున్న రిచర్డ్‌సన్‌ క్యాచ్‌ అందుకోవడంతో అతను పెవిలియన్‌ బాటపట్టాడు. 12 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్‌ 107/2. క్రీజ్‌లో ధవన్‌ (37 బంతుల్లో 64), పంత్‌(0) ఉన్నారు.

ధవన్‌ మెరుపు అర్ధశతకం
ఢిల్లీ ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌(31 బంతుల్లో 50; 8 ఫోర్లు) ప్రస్తుత సీజన్‌లో రెండో హాఫ్‌ సెంచరీని ఓవరాల్‌ ఐపీఎల్‌ కెరీర్‌లో 43వ అర్ధశతకాన్ని నమోదు చేశాడు. ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతున్న ధవన్‌.. నిలకడగా ఆడుతూ, చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ జట్టును లక్ష్యం దిశగా తీసుకెళ్తున్నాడు. ధవన్‌ ధాటికి 10.1 ఓవర్లలో జట్టు స్కోర్‌ 100 పరుగులకు చేరుకుంది. క్రీజ్‌లో ధవన్‌కు(58) తోడుగా స్టీవ్‌ స్మిత్‌(8) ఉన్నారు. 

తొలి వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ.. పృథ్వీషా(32) ఔట్‌ 
ప్రత్యర్ధి నిర్ధేశించిన లక్ష్యానికి ధీటుగా జావాబిస్తున్న ఢిల్లీ జట్టుకు 5వ ఓవర్‌ మూడో బంతికి షాక్‌ తగిలింది. చెలరేగి ఆడుతున్న పృథ్వీషాను(17 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్షదీప్‌ బోల్తా కొట్టించాడు. షా.. భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో స్క్వేర్‌ లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న గేల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 5.3 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్‌ 59/1. క్రీజ్‌లో ధవన్‌(26), స్మిత్(0)‌ ఉన్నారు. 

చెలరేగి ఆడుతున్న ఢిల్లీ ఓపెనర్లు.. 5 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్‌ 57/0
196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు శుభారంభం లభించింది. ఆ జట్టు ఓపెనర్లు పృథ్వీషా(15 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), శిఖర్‌ ధవన్‌(15 బంతుల్లో 26; 5 ఫోర్లు) బౌండరీలతో విరుచుకుపడుతూ స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. వీరి ధాటికి 5 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్‌ 57 పరుగులుగా ఉంది. ముఖ్యంగా పృథ్వీషా చూడచక్కని షాట్లతో అలరిస్తున్నాడు. 

ఢిల్లీ విజయలక్ష్యం 196 ‌‌‌‌‌
భారీ స్కోర్‌ సాధిస్తుందనుకున్న పంజాబ్‌ కింగ్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు సాధించింది. ఓపెనర్లు రాహుల్‌, మయాంక్‌ అందించిన శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైన పంజాబ్‌ 200లోపు స్కోర్‌కే పరిమితమై నిరాశపరించింది. క్రిస్‌ వోక్స్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో 16 పరుగులు రావడంతో పంజాబ్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. హూడా(13 బంతుల్లో 22; 2 సిక్సర్లు), షారుక్‌ ఖాన్‌(5 బంతుల్లో 15; 2 ఫోర్లు, సిక్స్‌) నాటౌట్‌గా నిలిచారు. ఢిల్లీ బౌలర్లలో వోక్స్‌, మేరీవాలా, ఆవేశ్‌ ఖాన్, రబాడ తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

పంజాబ్‌ నాలుగో వికెట్‌ డౌన్‌, పూరన్‌(9) ఔట్‌‌‌‌‌‌‌
ఆవేశ్‌ ఖాన్‌ వేసిన 18.5 బంతికి రబాడ క్యాచ్‌ అందుకోవడంతో పూరన్‌(8 బంతుల్లో 9; ఫోర్‌) పెవిలియన్‌ బాటపట్టాడు. 18.5 ఓవర్ల తర్వాత పంజాబ్‌ స్కోర్‌ 179/4. క్రీజ్‌లో హూడా(21), షారుక్‌ ఖాన్‌(0) ఉన్నారు.

గేల్‌‌(11) ఔట్‌, 17 ఓవర్ల తర్వాత పంజాబ్‌ స్కోర్‌ 162/3‌‌‌‌‌‌
డేంజరస్‌ బ్యాట్స్‌మెన్‌ క్రిస్‌ గేల్‌ను(9 బంఒతుల్లో 11; సిక్స్) క్రిస్‌ వోక్స్‌ బోల్తా కొట్టించాడు. వోక్స్‌ సంధించిన స్లో బాల్‌ను మిస్‌ జడ్జ్‌ చేసిన గేల్‌.. సబ్‌ ఫీల్డర్‌ రిపల్‌ పటేల్‌కు కవర్స్‌లో క్యాచ్‌ అందించి ఔటయ్యాడు. 17 ఓవర్ల తర్వాత పంజాబ్‌ 3 వికెట్ల నష్టానికి 162 పరుగులు సాధించింది. క్రీజ్‌లో హూడా(6 బంతుల్లో 12; సిక్స్‌), పూరన్‌(2) ఉన్నారు.

పంజాబ్ రెండో వికెట్‌ డౌన్‌.. కేఎల్‌ రాహుల్‌ 61 ఔట్‌‌‌‌‌‌
భారీ స్కోర్‌ దిశగా సాగుతున్న పంజాబ్‌కు 15వ ఓవర్‌ రెండో బంతికి షాక్‌ తగిలింది. బాధ్యతగా బ్యాటింగ్‌ చేస్తున్న ఆ జట్టు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ను(51 బంతుల్లో 61; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) రబాడా పెవిలియన్‌కు సాగనంపాడు. భారీ షాట్‌కు ప్రయత్నించే క్రమంలో డీప్‌ మిడ్‌ వికెట్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న స్టోయినిస్‌ క్యాచ్‌ అందుకోవడంతో రాహుల్‌ పెవిలియన్‌ బాటపట్టాడు. 15 ఓవర్ల తర్వాత పంజాబ్‌ స్కోర్‌ 150/2. క్రీజ్‌లో గేల్‌(5), హూడా(9) ఉన్నారు.

కేఎల్‌ రాహుల్‌ బాధ్యతాయుతమైన హాఫ్‌ సెంచరీ
కేఎల్‌ రాహుల్‌(45 బంతుల్లో 50; 6 ఫోర్లు, సిక్స్)  బాధ్యతాయుతమై కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఓపక్క సహచరుడు మయాంక్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంటే, రాహుల్‌ బాధ్యతగా బ్యాటింగ్‌ చేస్తూ.. ప్రస్తుత సీజన్‌లో రెండో హాఫ్‌ సెంచరీ సాధించాడు. అశ్విన్‌ వేసిన 13వ ఓవర్‌ 5 బంతికి సింగల్‌ తీసిన బర్త్‌డే బాయ్‌  రాహుల్ ఐపీఎల్‌ కెరీర్‌లో 23వ హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. 14 ఓవర్ల తర్వాత పంజాబ్‌ స్కోర్‌ 128/1. క్రీజ్‌లో ‌‌ రాహుల్‌కు తోడుగా గేల్‌(3) ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌.. మయాంక్‌(69) ఔట్‌ 
అరంగేట్రం బౌలర్‌ లుక్మాన్‌ మేరీవాలా బౌలింగ్‌లో ధవన్‌ అద్భుతమైన క్యాచ్‌ అందుకోవడంతో మయాంక్‌(33 బంతుల్లో 68; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. 12.4 ఓవర్ల తర్వాత పంజాబ్‌ స్కోర్‌ 122/1. క్రీజ్‌లో రాహుల్‌(48), గేల్‌(0) ఉన్నారు.  

ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న మాయంక్‌ 
మయాంక్‌ అగర్వాల్‌(33 బంతుల్లో 68; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాక ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. రబాడ వేసిన ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌లో మూడు వరుస సిక్సర్లతో బీభత్సం సృష్టించాడు. మయాంక్‌ ధాటికి 12 ఓవర్ల తర్వాత పంజాబ్‌ స్కోర్‌ 120/0. అతనికి రాహుల్(40 బంతుల్లో 46; 6 ఫోర్లు, సిక్స్‌)‌ నుంచి పూర్తి సహకారం అందుతుంది.

మయాంక్‌ స్టన్నింగ్‌ ఫిఫ్టీ..బౌండరీతో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన పంజాబ్ ఓపెనర్‌‌‌‌
పంజాబ్‌ ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌ మయాంక్‌ అగర్వాల్‌(25 బంతుల్లో 50; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో తొలి హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన మయాంక్‌.. ఈ మ్యాచ్‌లో చెలరేగి ఆడుతూ తన జట్టు భారీ స్కోర్‌ సాధించేందుకు బలమైన పునాది వేశాడు. ఆవేశ్‌ ఖాన్‌ వేసిన 9వ ఓవర్‌ మూడో బంతికి బౌండరీ సాధించిన మయాంక్‌.. ఐపీఎల్‌ 2021లో తొలి అర్ధశతకాన్ని నమోదు చేశాడు. మరోవైపు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(34 బంతుల్లో 35; 6 ఫోర్లు) కూడా బాధ్యతాయుతంగా బ్యాటింగ్‌ చేస్తుండటంతో 9.3 ఓవర్ల తర్వాత పంజాబ్‌ స్కోర్‌ 91/0గా ఉంది.

చెలరేగి ఆడుతున్న మయాంక్‌.. 9 ఓవర్ల తర్వాత పంజాబ్‌ స్కోర్‌ 87/0
పంజాబ్‌ కింగ్స్‌ ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్‌(22 బంతుల్లో 46; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి ఆడుతున్నాడు. అతనికి మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌(33 బంతుల్లో 35; 6 ఫోర్లు) మద్దతుగా నిలబడటంతో 9 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు వికెట్‌ నష్టపోకుండా 87 పరుగులు చేసింది. గత మ్యాచ్‌లో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 106 పరగులకే పరిమితమైన పంజాబ్‌ నేటి మ్యాచ్‌లో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ భారీ స్కోర్‌ దిశగా సాగుతుంది.

దూకుడుగా ఆడతున్న పంజాబ్‌.. 5 ఓవర్ల తర్వాత 50/0
టాస్‌ కోల్పోయి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ కింగ్స్‌కు ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌(18 బంతుల్లో 13; 3 ఫోర్లు), మయాంక్‌ అగర్వాల్‌(13 బంతుల్లో 30; 5ఫోర్లు, సిక్స్‌) దూకుడుగా ఆడుతూ శుభారంభాన్ని అందించారు. కెప్టెన్‌ రాహుల్‌ ఆచితూచి ఆడుతున్నప్పటికీ.. మయాంక్‌ బౌండరీలతో చెలరేగిపోతున్నాడు. దీంతో 5 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్‌ స్కోర్‌ 50/0.

ముంబై: ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో తలో మ్యాచ్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్‌ కింగ్స్ జట్లు‌ ముఖాముఖి పోరుకు సిద్దమయ్యాయి. ముంబైలోని వాంఖడే వేదికగా నేడు(ఆదివారం) ఇరు జట్ల మధ్య జరుగనున్న ఆసక్తికర పోరులో టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌‌ ముందుగా బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ముఖాముఖి పోరులో రెండు జట్లు ఇప్పటి వరకు 26 మ్యాచ్‌ల్లో తలపడగా, పంజాబ్‌ కింగ్స్‌ 15, ఢిల్లీ 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. 

ఇరు జట్లు తలపడిన చివరి ఐదు మ్యాచ్‌ల్లో పంజాబ్‌ మూడింట విజయం సాధించగా, ఢిల్లీ రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. గత సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన ముఖాముఖి పోరులో చెరో మ్యాచ్‌ గెలిచాయి. ఇందులో ఢిల్లీ ఒక మ్యాచ్‌ను సూపర్‌ ఓవర్‌ దాకా తీసుకెళ్లి విజయాన్ని దక్కించుకుంది. తొలుత ఢిల్లీ చేసిన 157 పరుగుల స్కోరును పంజాబ్‌ సమం చేసింది. దీంతో సూపర్‌ ఓవర్‌ అనివార్యమైంది. సూపర్‌ ఓవర్‌లో పంజాబ్‌ ఎటువంటి పోటీ ఇవ్వకుండానే ఢిల్లీకి లొంగిపోయింది. రెండు పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోవడంతో  ఢిల్లీ ఈజీగా ఛేదించి సూపర్‌ విక్టరీని నమోదు చేసింది. 

ఢిల్లీ క్యాపిటల్స్‌: రిషబ్‌ పంత్‌(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), శిఖర్ ధవన్, పృథ్వీ షా, స్టీవ్‌ స్మిత్‌, మార్కస్ స్టోయినిస్, క్రిస్ వోక్స్, రవిచంద్రన్ అశ్విన్, రబాడ, లలిత్‌ యాదవ్‌, అవేష్ ఖాన్, లుక్మన్‌ మేరివాలా

పంజాబ్‌ కింగ్స్‌: కేఎల్‌ రాహుల్(కెప్టెన్‌)‌, మయాంక్‌ అగర్వాల్‌, క్రిస్‌ గేల్‌, నికోలాస్‌ పూరన్‌, దీపక్‌ హూడా, షారుఖ్‌ ఖాన్‌, జైన్‌ రిచర్డ్‌సన్‌, జలజ్‌ సక్సేనా‌, మెరిడిత్‌, షమీ, అర్షదీప్‌ సింగ్‌

మరిన్ని వార్తలు