MS Dhoni: బ్రావో ఇలా చేశాడే అనుకుంటారు కదా.. ఆ విషయంలోనే మాకు ‘గొడవలు’!

25 Sep, 2021 12:14 IST|Sakshi
Photo: CSK Twitter

MS Dhoni reveals fight with 'brother' Dwayne Bravo: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై విజయంలో కీలక పాత్ర పోషించిన డ్వేన్‌ బ్రావోపై చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రణాళికలను మైదానంలో పక్కాగా అమలు చేసి సత్ఫలితాలు సాధించడం సంతోషంగా ఉందన్నాడు. జట్టుకు అవసరమైన సమయంలో బాధ్యతగా వ్యవహరిస్తాడని బ్రావోను కొనియాడాడు. కాగా శుక్రవారం ఆర్సీబీతో షార్జాలో జరిగిన మ్యాచ్‌లో ధోని సేన 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఇక ఆర్సీబీ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, మాక్స్‌వెల్‌, హర్షల్‌ పటేల్‌ వికెట్లు తన ఖాతాలో వేసుకున్న డ్వేన్‌ బ్రావో ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. 

ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం ధోని మాట్లాడుతూ.. ‘‘బ్రావో ఫిట్‌నెస్‌ బాగుంది. ఇది మంచి విషయం. తన ప్లాన్‌ను పక్కాగా అమలు చేయడం కలిసి వచ్చే అంశం. తనని నా సోదరుడిగా భావిస్తాను. బ్రదర్‌ అని పిలుస్తాను. తను స్లోగా బౌలింగ్‌ చేసినపుడు మా మధ్య గొడవలు జరుగుతాయి. తన టెక్నిక్‌(స్లో బాల్స్‌ వేస్తాడన్న ఉద్దేశంలో) గురించి అందరికీ తెలుసన్న విషయం బ్రావోకు అనేకసార్లు చెప్పాను. కాబట్టి ఒక ఓవర్‌లో ఆరు వైవిధ్యమైన బంతులు విసరాలని సూచించాను. ముఖ్యంగా యార్కర్లు వేస్తే బాగుంటుందని చెబుతాను.

అప్పుడు.. ‘అరె.. నెమ్మదైన బంతులు వేసే బ్రావో ఇలా చేశాడా’ అని బ్యాటర్స్‌ ఆశ్చర్యపోతారు కదా. వాళ్లను కన్‌ఫ్యూజ్‌ చేయొచ్చు కూడా. ఈ విషయాలను పక్కన పెడితే... తనకు ప్రపంచంలోని వివిధ మైదానాల్లో ఆడిన అనుభవం ఉంది. అది మాకు ఎంతగానో ఉపకరిస్తుంది. బాధ్యతగా వ్యహరించాల్సిన సమయంలో తను ఎల్లప్పుడూ ముందుంటాడు’’ అని కితాబిచ్చాడు. కాగా కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా గాయపడిన డ్వేన్‌ బ్రావో కోలుకుని.. ఐపీఎల్‌ రెండో అంచెకు అందుబాటులోకి వచ్చాడు. ఫేజ్‌ 2 తొలి మ్యాచ్‌లో భాగంగా ముంబైతో జరిగిన పోరులో 3 వికెట్లు తీశాడు. ఇక బ్యాటింగ్‌లో... 8 బంతుల్లో 23 పరుగులు చేసి సత్తా చాటాడు.  

చదవండి: IPL 2021: ఐపీఎల్‌లో టిమ్‌ డేవిడ్‌ సరికొత్త రికార్డు..

మరిన్ని వార్తలు