వికెట్‌ కీపర్‌గా సరికొత్త రికార్డు సృష్టించిన ధోని

22 Apr, 2021 17:24 IST|Sakshi

ముంబై: టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో(ఐపీఎల్‌) చరిత్ర సృష్టించాడు. లీగ్‌ చరిత్రలో ఇంత వరకు ఏ వికెట్‌ కీపర్‌కు సాధ్యంకాని 150 డిస్‌మిసల్స్‌ ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్‌, వికెట్‌ కీపింగ్‌లలో సమాంతరంగా రాణిస్తూ.. తన జట్టును మూడు సార్లు ఛాంపియన్‌గా నిలిపిన మహేంద్రుడు.. లీగ్‌ చరిత్రలో 150 మందిని ఔట్‌ చేసిన తొలి వికెట్‌ కీపర్‌గా రికార్డు పుటల్లోకెక్కాడు. ముంబైలోని వాంఖడే వేదికగా బుధవారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో నితీశ్‌ రాణా క్యాచ్‌ అందుకోవడం ద్వారా ధోని ఈ మైలురాయిని చేరుకున్నాడు.

ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 208 మ్యాచ్‌ల్లో113 క్యాచ్‌లందుకున్న ఈ మిస్టర్‌ కూల్‌ కెప్టెన్‌.. 39 స్టంపింగ్‌లు చేశాడు. వికెట్‌ కీపర్‌గా అత్యధిక డిస్‌మిసల్స్‌లో భాగస్వాములైన ఆటగాళ్ల జాబితాలో ధోని తర్వాతి స్థానంలో కేకేఆర్‌ వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ ఉన్నాడు. డీకే ఇప్పటి వరకు 112 క్యాచ్‌లు, 31 స్టంపింగ్‌లు చేసి 143 డిస్‌మిసల్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే, నిన్న కేకేఆర్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో చెన్నై 18 పరుగుల తేడాతో సూపర్‌ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్‌లో ధోని మూడు కీలకమైన క్యాచ్‌లందుకుని చెన్నై విజయంలో తనవంతు పాత్ర పోషించాడు.
చదవండి: భారీ టార్గెట్‌ను చూసి టాపార్డర్‌ జడుసుకుంది.. అందుకే అలా

>
మరిన్ని వార్తలు