MS Dhoni: అంత మాట అంటావా.. నీకింకా కుళ్లు బుద్ధి పోలేదా గంభీర్‌?!

2 Oct, 2021 17:21 IST|Sakshi
MS Dhoni(Courtesy- IPL/BCCI)- Gautam Gambhir

గంభీర్‌ను ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు

‘Still jealous?’ – Twitterati Brutally Slam Gautam Gambhir: టీమిండియా మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ గౌతం గంభీర్‌ను మిస్టర్‌ కూల్‌ ధోని ఫ్యాన్స్‌ ట్రోల్‌ చేస్తున్నారు. ‘‘నీకింకా కుళ్లు బుద్ధి పోలేదా గంభీర్‌’’ అంటూ విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా గంభీర్‌.. ‘‘సో కాల్డ్‌ ఫినిషర్‌’’ అన్న పదం వాడటమే ఇందుకు కారణం. ఇంతకీ విషయం ఏమిటంటే... టీమిండియా సారథిగా, చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌గా ఎంఎస్‌ ధోనికి ఉన్న రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్‌కు మూడు ఐసీసీ టైటిళ్లు అందించడంతో పాటు... మూడుసార్లు చెన్నైని ఐపీఎల్‌ విజేతగా నిలిపాడు. ఇక కీలక మ్యాచ్‌లలో తనదైన స్టైల్లో ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చి జట్టును విజయ తీరాలకు చేర్చడంలో అతడికి అతడే సాటే. అందుకే ధోనిని అత్యుత్తమ ఫినిషర్లలో ఒకరిగా పేర్కొంటారు. 

అయితే, ఐపీఎల్‌-2021లో చెన్నై అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ... ధోని వ్యక్తిగత ప్రదర్శన తన స్థాయికి తగ్గట్టు లేదని అభిమానులు కాస్త నిరాశ చెందారు. హెలికాప్టర్‌ షాట్లు ఎక్కడ భాయ్‌ అంటూ కామెంట్లు చేశారు. వారి నిరీక్షణకు తెర దించుతూ... షార్జాలో గురువారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో... సిక్సర్‌తో ఇన్నింగ్స్‌ను ముగించి.. చెన్నైని గెలిపించాడు ధోని. దీంతో... ‘‘అసలైన ఫినిషర్‌ ఇంకా మిగిలే ఉన్నాడు’’ అంటూ సోషల్‌ మీడియాలో సందడి చేశారు. 

ఇదిలా ఉండగా... శుక్రవారం దుబాయ్‌ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌- పంజాబ్‌ కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ సందర్భంగా.. కామెంట్రీ ఇస్తున్న గంభీర్‌.. ‘‘ఫినిషర్ల’’ గురించి మాట్లాడాడు. ఈ మేరకు.. ‘‘ఆండ్రీ రసెల్‌ను ఫినిషర్‌ అంటారు. గత రెండేళ్లుగా విరాట్‌ కోహ్లి అత్యుత్తమ ఫినిషర్‌గా రాణిస్తున్నారు. వారి ప్రదర్శన ఆధారంగానే ఈ పదాన్ని వాడతారు. ఫినిషర్‌ అని పిలుచుకున్నంత మాత్రాన ఎవరూ ఫినిషర్‌ కాలేరు. సో కాల్డ్‌ ఫినిషర్ల ప్రదర్శన గురించి మాట్లాడేటపుడు కోహ్లి చేసిన పరుగుల గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది’’ అని వ్యాఖ్యానించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

దీంతో ధోనిని ఉద్దేశించే గంభీర్‌ ఇలా అన్నాడన్న ఉద్దేశంలో.. ‘‘సో కాల్డ్‌ ఫినిషర్‌ అని ఎవరిని అంటున్నావు. నువ్వు మధ్యలోనే వదిలేసి వెళ్లిన మ్యాచ్‌ను తన షాట్‌తో గెలిపించి.. ఐసీసీ టైటిల్‌ అందించాడు. నీకింకా కుళ్లు బుద్ధి పోలేదా? రసెల్‌ గురించి మాట్లాడతావు. ధోని గురించి చెడ్డగా మాట్లాడేందుకు కోహ్లిని పొగుడుతావు. కోహ్లి గురించి చెడుగా మాట్లాడాలనుకుంటే... రోహిత్‌ను ప్రశంసిస్తావు. అసలు నీ బాధేంటి?’’ అంటూ ధోని ఫ్యాన్స్‌ ట్రోల్‌ చేస్తున్నారు. కాగా ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ చేరిన తొలి జట్టు ధోని సేన అన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు