ధోని.. 21 నెలలు ఆలస్యమైంది!

20 Apr, 2021 17:53 IST|Sakshi

ముంబై:  రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో  సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఆరంభంలోనే రనౌట్‌ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 14 ఓవర్‌ చివరి బంతికి క్రీజ్‌లోకి వచ్చిన ధోని..  15 ఓవర్‌ రెండో బంతికి రనౌట్‌ అయ్యే అవకాశాన్ని తృటిలో తప్పించుకున్నాడు.  రాహుల్‌ తెవాతియా వేసిన బంతిని కవర్స్‌లోకి ఫ్లిక్‌ చేసి సింగిల్‌కి యత్నించాడు.అయితే జడేజా సింగిల్‌ వద్దని గట్టిగా అరిచాడు. అ‍ప్పటికే క్రీజ్‌ను వదిలి చాలా దూరం ముందుకు వచ్చేసిన ధోని.. జడేజా కాల్‌తో వెనక్కి మళ్లాడు. అంతేవేగంగా కవర్స్‌లో ఉన్న ఫీల్డర్‌.. కీపర్‌  సామ్సన్‌కు మెరుపువేగంతో బంతిని అందించాడు. అంతే ఒక్క ఉదుటన డైవ్‌ కొట్టిన ధోని కొద్దిపాటిలో రనౌట్‌ నుంచి తప్పించుకున్నాడు. 

ఇది ధోని ఫిట్‌నెస్‌ లెవెల్స్‌ను తెలియజేస్తుందని చాలామంది ఫ్యాన్స్‌ కొనియాడుతుండగా,  మరికొందరు  2019 వన్డే వరల్డ్‌కప్‌ జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు.  మాంచెస్టర్‌లో న్యూజిలాండ్‌ జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో ధోని రనౌట్‌ అయ్యాడు. మ్యాచ్‌ మంచి రసపట్టులో ఉన​ సమయంలో ధోని(50) హాఫ్‌ సెంచరీ ఔటయ్యాడు. 49 ఓవర్‌ మూడో బంతికి గప్టిల్‌ నేరుగా విసిరిన బంతి వికెట్ల గిరాటేయడంతో ధోని రనౌట్‌ అయ్యాడు. ఇదే ఆనాటి మ్యాచ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ఆ ఘటననే తాజాగా అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. రాజస్తాన్‌ మ్యాచ్‌లో డైవ్‌ కొట్టినట్లు అప్పటి మ్యాచ్‌లో కూడా రనౌట్‌ నుంచి తప్పించుకునే ఉంటే ఫలితం మరోలా ఉండేది. ‘ధోని.. 21 నెలలు ఆలస్యమైంది’ అంటూ సరదాగా సోషల్‌ మీడియలో కామెంట్లు, ఫోటోలు షేర్‌ చేస్తున్నారు. 

ఇక్కడ చదవండి: ‘ధోని.. నువ్వు నిజంగా అద్వితీయం’

90 నిమిషాల్లో వెళ్లాలి.. లేకపోతే కోహ్లికి ఫైన్‌..!

మరిన్ని వార్తలు