మోర్గాన్‌కు డగౌట్‌ నుంచి హెల్ప్‌.. అప్పుడు కూడా అంతే!

27 Apr, 2021 21:27 IST|Sakshi
Photo Courtesy: Hotstar

అహ్మదాబాద్‌: ఈ ఐపీఎల్‌లో సోమవారం(ఏప్రిల్‌ 26వ తేదీ) అహ్మదాబాద్‌ వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌కు డగౌట్‌ నుంచి కోడ్‌ లాంగ్వేజ్‌ సందేశాలు అందడం చర్చనీయాంశమైంది. కేకేఆర్‌ ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలోఓ ఆ జట్టు ఎనలిస్ట్‌గా పనిచేస్తున్న నాథన్‌ లీమన్‌ డగౌట్‌ నుంంచి ‘54’ కోడ్‌ను చూపించాడు. ఆ సంఖ్యను ప్లకార్డు రూపంలో చేతిలో పట్టుకుని ప్రదర్శించాడు. ఇది ఆఫ్‌సైడ్‌-లెగ్‌సైడ్‌ ఫీల్డింగ్‌కు సంబంధించిన కోడ్‌ కావొచ్చని విశ్లేషకుల అభిప్రాయం. దీనిపై వివాదం చెలరేగకపోయినా హాట్‌ టాపిక్‌ అయ్యింది.. ఇది నియమావళిని ఉల్లంఘించడమా.. కాదా అనే చర్చ నడిచింది. 

ఇది  క్రీడాస్ఫూర్తికి విరుద్దమంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.  కాగా,  ఇలా డగౌట్‌ నుంచి సంకేతాలు అందడంంలో ఎలాంటి తప్పు లేదని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఇక్కడ ఎవరైనా తమ జట్టును నడిపించడానికి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవచ్చన్నాడు. డగౌట్‌ నుంచి ఇలా చెప్పడానికి కెప్టెనే కావాల్సిన అవసరం లేదన్నాడు. అది కేకేఆర్‌ గేమ్‌ ప్లాన్‌లో భాగంగానే చూడాలన్నాడు. తనకు తెలిసినంతవరకూ 54 సంఖ్య అనేది గేమ్‌ ప్లాన్‌ అయ్యుంటుందని,  ఈ చిన్న సాయంలో తప్పేమీ లేదన్నాడు. ఇటీవల కాలంలో డగౌట్‌ల నుంచి సంకేతాలు ఇవ్వడం జరగడం మనకు అప్పుడప్పుడు కనిపిస్తోంది. 

గతేడాది చివర్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో​ కూడా ఇంగ్లండ్‌ కెప్టెన్‌ మోర్గాన్‌కు ఇలానే డగౌట్‌ నుంచి సందేశాలు వచ్చాయి. అప్పుడు మోర్గాన్‌ ఫీల్డింగ్‌ సెట్‌ చేసే క్రమంలో ఇంగ్లండ్‌ జట్టు అన్‌లిస్ట్‌గా ఉన్న నాథన్‌ లీమనే ఈ సందేశాలు పంపాడు. కేప్ టౌన్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భాగంగా బౌలింగ్ మార్పు, ఫీల్డింగ్ కూర్పునకి సహాయపడేలా నాథన్ బోర్డుపై 3C, 4E అంటూ స్టేడియంలో ప్రదర్శించాడు. వాటిని చూస్తూ కెప్టెన్ మోర్గాన్ తన వ్యూహాల్ని మార్చుకుంటూ వెళ్లాడు. ఈ మ్యాచ్‌లో  ఇంగ్లండ్‌ 9 వికెట్ల తేడాతో విజయం సాధించడమే కాకుండా మూడు టీ20ల సిరీస్‌ని 3-0తో చేజిక్కించుకుంది. దీన్ని మోర్గాన్‌ సమర్ధించుకున్నాడు. ఇది ఎంతమాత్రం తప్పుకాదన్నాడు. దీన్ని కూడా గేమ్‌ ప్లాన్‌లో భాగంగానే చూడాలన్నాడు.

మరిన్ని వార్తలు