IPl 2021 Final: ఈ ఏడాది టైటిల్‌ గెలిచే అర్హత కేకేఆర్‌కు ఉంది: ధోని

16 Oct, 2021 08:08 IST|Sakshi
PC: IPL/ BCCI

IPL 2021 Winner CSK Captain MS Dhoni Commnets:‘సీఎస్‌కే కంటే ముందు నేను కేకేఆర్‌ గురించి మాట్లాడాలి. సీజన్‌ తొలి దశలో ఎదురైన పరాభవాల నుంచి తేరుకుని... ఇక్కడి వరకు రావడం నిజంగా చాలా కష్టంతో కూడుకున్న పని. ఈసారి ఐపీఎల్‌ టైటిల్‌ విజేత అయ్యే అర్హత ఏ జట్టుకైనా ఉందంటే.. అది కేకేఆర్‌. వాళ్ల ఆట తీరు అమోఘం. నిజానికి... విరామం (ఐపీఎల్‌ వాయిదా)వాళ్లకు మేలే చేసింది’’ అంటూ చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్‌-2021 రెండో అంచెలో మోర్గాన్‌ సేన అద్భుత ప్రద్శనతో ఆకట్టుకుందని కితాబిచ్చాడు.

దుబాయ్‌ వేదికగా జరిగిన ఐపీఎల్‌-2021 ఫైనల్‌ మ్యాచ్‌లో సీఎస్‌కే.. కేకేఆర్‌ను 27 పరుగుల తేడాతో ఓడించి నాలుగోసారి (2010, 2011, 2018, 2021) చాంపియన్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం ధోని స్పందిస్తూ... ‘‘గణాంకాలను బట్టి చూస్తే... నిలకడ జట్టుగా మాకు మంచి పేరు ఉంది. అదే సమయంలో మేం ఫైనల్‌లో ఓడిన సందర్భాలు అనేకం. అందుకే ఈసారి ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వొద్దని అనుకున్నాం. బాగా ఇంప్రూవ్‌ అయ్యాం. జట్టు సమిష్టి విజయం ఇది. తొలుత కాస్త ఒత్తిడికి గురైన మాట వాస్తవం. అయితే, వ్యక్తిగతంగా.. గొప్పగా రాణించే ఆటగాళ్లు ఉండటం మాకు కలిసి వచ్చింది.’’ అని చెప్పుకొచ్చాడు.

ఇక ఈ సందర్భంగా అభిమానులను ధన్యవాదాలు తెలిపిన ధోని... ‘‘ఇప్పుడు మేం దుబాయ్‌లో ఉన్నాం. ఒకవేళ సౌతాఫ్రికాలో ఉన్నా సరే.. ఫ్యాన్స్‌ మద్దతు మాకు ఇలాగే ఉంటుంది. వాళ్లందరికీ నా కృతజ్ఞతలు. ఇప్పుడు నేను చెన్నైలోని చెపాక్‌లోనే ఉన్నట్లుగా భావిస్తున్నా. చెన్నై అభిమానుల కోసం మేం మళ్లీ అక్కడ ఆడే అవకాశం వస్తుందని భావిస్తున్నా’’ అని ఫ్యాన్స్‌పై ప్రేమను కురిపించాడు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: IPL 2021 Final: తెలుగులో మాట్లాడిన కేకేఆర్‌ ఆటగాడు.. ఫ్యాన్స్ ఫిదా

మరిన్ని వార్తలు