పడిక్కల్‌ను పక్కకు పెట్టడానికి కారణం అదేనా..

9 Apr, 2021 22:22 IST|Sakshi

చెన్నై: ఇటీవలే కరోనా బారిన పడి, తిరిగి కోలుకుని జట్టులో చేరిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఓపెనర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌కు ఐపీఎల్‌ 14వ సీజన్‌ ప్రారంభ మ్యాచ్‌లో ఆడే అవకాశం లభించకపోవడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. గతేడాది దుబాయ్‌ వేదికగా జరిగిన ఐపీఎల్‌ 2020లో ఆర్‌సీబీ తరఫున అత్యధిక పరుగులు(15 మ్యాచ్‌ల్లో 473 పరుగులు, 5 హాఫ్‌ సెంచరీలు) సాధించిన ఆటగాడిగా నిలిచిన ఈ కేరళ కుర్రాడిని ముంబైతో జరిగిన మ్యాచ్‌ నుంచి ఎందుకు తప్పించారని ఆరా తీస్తున్న సమయంలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూసాయి. 

కరోనా నుంచి కోలుకుని పట్టుమని మూడు రోజులు కూడా గడవక ముందే పడిక్కల్‌ను డైరెక్ట్‌గా బయో బబుల్‌లోకి తీసుకురావడంపై ఇతర ఫ్రాంఛైజీల యాజమాన్యాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. కరోనా నుంచి కోలుకున్న తరువాత వారం రోజుల తప్పనిసరి క్వారంటైన్‌ నిబంధనను ఆర్‌సీబీ యాజమాన్యం తుంగలో తొక్కిందని, దీని వల్ల ఇతర ఆటగాళ్లు వైరస్‌ బారిన పడే ప్రమాదముందని మిగతా ఫ్రాంచైజీల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. హోమ్‌ క్వారంటైన్‌ అనే ఆప్షన్‌ ఎవరికీ లేనప్పుడు ఆర్‌సీబీ ఆటగాడికి ఎందుకా ఆప్షన్‌ ఇచ్చారని ఓ ఫ్రాంచైజీ యజమాని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. 

అయితే, ఈ తతంగం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకునే ఆర్‌సీబీ యాజమాన్యం పడిక్కల్‌ను ఈ మ్యాచ్‌ నుంచి తప్పించిందని తెలుస్తుంది. కాగా, మార్చి 22న పడిక్కల్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతను ఆర్‌సీబీ క్యాంప్‌ను నుంచి నేరుగా హోం క్వారంటైన్‌కు వెళ్లి, తిరిగి ఏప్రిల్‌ 7న ఆర్‌సీబీ  బబుల్‌లోకి నేరుగా ప్రవేశించాడు. అతనికి మూడు టెస్టుల్లో నెగిటివ్‌ వచ్చిందనే తాము బబుల్‌లోకి అనుమతిచ్చామని ఆర్‌సీబీ యాజమాన్యం చెబుతుంది. 
చదవండి: మొన్న మైఖేల్‌ జాక్సన్‌ ఇవాళ దలేర్‌ మెహందీ..
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు