భారీ టార్గెట్‌ను చూసి టాపార్డర్‌ జడుసుకుంది.. అందుకే అలా

22 Apr, 2021 16:26 IST|Sakshi

ముంబై: చెన్నై, కేకేఆర్‌ జట్ల మధ్య బుధవారం జరిగిన ఆసక్తికర పోరులో చెన్నై నిర్ధేశించిన భారీ టార్గెట్‌ను(221 పరుగులు) చూసి కేకేఆర్‌ టాపార్డర్‌ జడుసుకుందని, ఆ టెన్షన్‌లో అనవసరపు షాట్లకు ప్రయత్నించి పేక మేడలా కుప్పకూలిందని కేకేఆర్‌ మాజీ కెప్టెన్‌ గౌతమ్‌ గంభీర్‌ ఆరోపించాడు. వాంఖడే లాంటి బ్యాట్స్‌మెన్‌ ఫ్రెండ్లీ పిచ్‌లపై ఎంత భారీ టార్గెట్‌ నిర్ధేశించినా ఛేజింగ్‌ చేసే జట్టు జంక కూడదని, కేకేఆర్‌ టాపార్డర్‌ ఆటగాళ్లు కాస్త బాధ్యతగా ఆడివుంటే ఫలితం మరోలా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డాడు. ఈ విషయమై టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్లు నిందార్హులేనని, వారి బాధ్యతారాహిత్యమే కేకేఆర్‌ కొంప ముంచిందని మండిపడ్డాడు. టాపార్డర్‌ ప్లేయర్స్‌ కాస్త నిలదొక్కుకున్న తరువాత భారీ షాట్లకు ప్రయత్నించాల్సిందని, కానీ వారు అనవసరపు షాట్లు ఆడి వికెట్లు పారేసుకున్నారని నిందించారు.

31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు రసెల్‌ కూడా అనవసరపు షాట్‌ ఆడి వుంటే కేకేఆర్‌ స్కోర్‌ 40/6గా ఉండేదని, కానీ రసెల్‌ అలా చేయకపోవడం వల్ల మ్యాచ్‌పై చివరిదాకా ఆశలు సజీవంగా ఉన్నాయని పేర్కొన్నాడు.  దీపక్‌ చాహర్‌ ధాటికి కేకేఆర్‌ 5.2 ఓవర్లలోనే 5 టాపార్డర్‌ వికెట్లు కోల్పోయి మ్యాచ్‌పై పట్టు కోల్పోయినప్పటికీ, లోయర్‌ ఆర్డర్‌ ఆటగాళ్లు రసెల్‌(22 బంతుల్లో 54; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), దినేశ్‌ కార్తిక్‌(24 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కమిన్స్‌(34 బంతుల్లో 66 నాటౌట్‌; 4 ఫోర్లు, 6 సిక్సర్లు)లు అద్వితీయమైన పోరాటం చేసి చెన్నై శిబిరంలో దడ పుట్టించిన వైనాన్ని కేకేఆర్‌ అభిమానులు చిరకాలం గుర్తుపెట్టుకుంటారని అన్నాడు.

6,7,8 స్థానాల్లో రసెల్‌, డీకే, కమిన్స్‌ లాంటి ఆటగాళ్లుండటం కేకేఆర్‌ అదృష్టమని ఆయన పేర్కొన్నాడు. కొండంత లక్ష్యం ముందున్నా లోయరార్డర్‌ ఆటగాళ్లు, ముఖ్యంగా కమిన్స్‌ చేసిన అరివీర భయంకరమైన పోరాటాన్ని ఆయన ఆకాశానికెత్తాడు. భారీ లక్ష్యాన్ని చూసి వాళ్లు కూడా చేతులెత్తేసి ఉంటే 70 లేదా 80 పరుగలకే కేకేఆర్‌ ఆలౌటయ్యేదన్నాడు. చివరిదాకా కమిన్స్‌ పోరాటం చేయడం, అతనికి టెయిలెండర్ల నుంచి సహకారం లభించకపోవడంతో కేకేఆర్‌ 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
చదవండి: 'ఈ పిచ్‌పై మాకు మొదటి మ్యాచ్‌.. అందుకే'

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు