అలాంటి పరిస్థితుల్లో గంభీర్‌లా ఆడాలని ఉంటుంది: పడిక్కల్‌

21 Apr, 2021 18:04 IST|Sakshi

ముంబై: జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ ప్లే చేసిన రోల్స్‌ను ప్లే చేయాలని ఉందని అంటున్నాడు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఓపెనర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌. స్వతహాగా లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాట్స్‌మెన్‌ అయిన పడిక్కల్‌.. గంభీర్‌ తన ఆరాధ్య దైవమని, ఆట విషయంలో అతన్నే అనుకరిస్తానని చాలా సందర్భాల్లో పేర్కొన్నాడు. తాను ప్రాతినిధ్యం వహించే జట్టు ఏ స్థాయిదైనా గంభీర్‌ ఒకే డెడికేషన్‌తో ఆడతాడని, క్లిష్ట సమయాల్లో జట్టును ఆపద్బాంధవుడిలా ఆదుకుంటాడని, అతనో గొప్ప మ్యాచ్‌ విన్నర్‌ అని, అంచేతనే గంభీర్‌ను తాను ఆదర్శంగా తీసుకుంటానని అంటున్నాడీ 20 ఏళ్ల కేరళ కుర్రాడు. 

జట్టు కష్టాల్లో ఉన్నప్పుడే గొప్ప ప్లేయర్లు పుట్టుకొస్తారని, అలాంటి చాలా క్లిష్ట సందర్భాల్లో గంభీర్‌ తన అత్యుత్తమ ఆటతీరు కనబర్చాడని, తనకు కూడా అలాంటి రోల్స్‌ ప్లే చేయాలని ఉందని పడిక్కల్‌ ఆకాంక్షిస్తున్నాడు. మరోవైపు ఐపీఎల్‌లో కోహ్లితో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించడం గొప్ప అనుభూతని, కోహ్లికి ఆట పట్ల ఉన్న నిబద్దత, విపరీతమైన ప్యాషన్‌ తనను బాగా ఆకర్శిస్తాయని పడిక్కల్‌ తెలిపాడు. 

కాగా, గతేడాది దుబాయ్‌ వేదికగా జరిగిన ఐపీఎల్‌ 2020 సీజన్‌లో ఆరోన్‌ ఫించ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పడిక్కల్‌.. ఐపీఎల్‌ అరంగేట్రంలోనే అదరగొట్టాడు. ఆ సీజన్‌లో మొత్తం 15 మ్యాచ్‌లాడిన అతను 124. 80 స్ట్రయిక్‌ రేట్‌తో 379 పరుగులు సాధించి ఆర్‌సీబీ తరఫున టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అయితే, పడిక్కల్‌.. ప్రస్తుత సీజన్‌లో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాడు. అతనాడిన రెండు మ్యాచ్‌ల్లో కేవలం 36 పరుగులు మాత్రమే సాధించి తీవ్రంగా నిరాశపరిచాడు. ఇదిలా ఉంటే అతను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్‌సీబీ మాత్రం ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేసి మాంచి జోరుమీదుంది. కాగా, ఆర్‌సీబీ తమ తదుపరి మ్యాచ్‌ను గురువారం(ఏప్రిల్‌ 22) రాజస్థాన్‌తో ఆడుతుంది.
చదవండి: మొన్న కోహ్లికి ఎసరు పెట్టాడు.. ఇప్పుడు మలాన్‌ వంతు

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు