Gautam Gambhir: చెన్నై ప్లేఆఫ్స్‌ చేరాక ధోని ఆ స్థానంలో బ్యాటింగ్‌కు రావాలి!

25 Sep, 2021 13:37 IST|Sakshi

Gautam Gambhir Comments On MS Dhoni: చెన్నై సూపర్‌కింగ్స్‌ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన తర్వాత ఆ జట్టు కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని బ్యాటింగ్‌ స్థానాన్ని మార్చుకోవాలని టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ సూచించాడు. వన్‌డౌన్‌, ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చే ఆటగాళ్లు ప్రతిసారి రాణించలేరని, కాబట్టి అనుభవజ్ఞుడైన మిస్టర్‌ కూల్‌ ఆ స్థానాన్ని భర్తీ చేస్తే ఉపయోగకరంగా ఉంటుందన్నాడు. కాగా ఐపీఎల్‌-2021 రెండో అంచెలో భాగంగా షార్జాలో రాయల్‌ చాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే జయభేరి మోగించిన సంగతి తెలిసిందే.

ఆరు వికెట్ల తేడాతో కోహ్లి సేనను మట్టికరిపించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఇక ఈ సీజన్‌లో ఆది నుంచి మంచి ప్రదర్శన కనబరుస్తున్న చెన్నై.. ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్‌లు ఆడి.. ఏడింటిలో గెలిచింది. ప్లేఆఫ్స్‌ బెర్తును దాదాపు ఖాయం చేసుకుంది. ఈ నేపథ్యంలో గౌతం గంభీర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ సీఎస్‌కే బ్యాటింగ్‌ ఆర్డర్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ప్లే ఆఫ్స్‌ చేరిన తర్వాతి మ్యాచ్‌లలో సీఎస్‌కే తొలుత బ్యాటింగ్‌ చేసినా... లేదంటే ఛేజింగ్‌ అయినా ధోని నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలి. తద్వారా మిడిలార్డర్‌ బలపడుతుంది.


Photo: CSK Twitter

నిజానికి నంబర్‌ 3, నంబర్‌ 4 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చేవాళ్లంతా ఎల్లప్పుడూ పరుగులు రాబట్టలేరు. అటువంటప్పుడే అనుభవం ఉన్న ఆటగాడు రంగంలోకి దిగాలి. ప్లేఆఫ్స్‌ చేరినంత మాత్రాన కెప్టెన్‌పై భారం ఏమాత్రం తగ్గదు. ముందుకు సాగాలంటే మరింత కఠినంగా శ్రమించాల్సి ఉంటుంది. కీలక మ్యాచ్‌లలో ఆదిలోనే వికెట్లు కోల్పోతే కష్టం. కాబట్టి ధోని తన బ్యాటింగ్‌ స్థానాన్ని ప్రమోట్‌ చేసుకుంటే బాగుంటుంది. ఒక కెప్టెన్‌గా తనకు ఆ వెసలుబాటు ఉంటుంది. జట్టుకు ఇది ఉపయుక్తంగా ఉంటుంది’’ అని చెప్పుకొచ్చాడు.   

చదవండి: IPL 2021: ఐపీఎల్‌లో టిమ్‌ డేవిడ్‌ సరికొత్త రికార్డు..

>
మరిన్ని వార్తలు