ఆ విధ్వంసానికి ఎనిమిదేళ్లు.. నేడు మళ్లీ రిపీటయ్యేనా

23 Apr, 2021 18:24 IST|Sakshi

చెన్నై: సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం ఇదే రోజు(2013 ఏప్రిల్‌ 23) విండీస్‌ యోధుడు క్రిస్‌ గేల్‌ ఐపీఎల్‌లో పెను విధ్వంసాన్ని సృష్టించాడు. 2013 ఐపీఎల్‌ సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన అతను.. పూణే వారియర్స్‌ ఇండియాపై 66 బంతుల్లో ఏకంగా 175 పరుగులు సాధించి క్రికెట్‌ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేశాడు. ఈ మ్యాచ్‌కు ముందు చిరుజల్లులతో తడిసి ముద్దైన బెంగళూరు వేదిక, గేల్‌ సిక్సర్ల సునామీలో కొట్టుకుపోయింది. అప్పటివరకు నాటి కేకేఆర్‌ ఆటగాడు బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌(158) పేరిట ఉన్న ఐపీఎల్‌ అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ రికార్డును గేల్‌, ఈ ఇన్నింగ్స్‌ ద్వారా తుడిచిపెట్టాడు. క్రికెట్‌ ప్రపంచంలో గేల్‌ సృష్టించిన ఈ మహా ప్రళయం ధాటికి పలు రికార్డులు కాలగర్భంలో కలిసిపోయాయి. 

ఈ భాయనక ఇన్నింగ్స్‌లో హాఫ్‌ సెంచరీని 17 బంతుల్లో, సెంచరీని 30 బంతుల్లో పూర్తి చేసిన యూనివర్సల్‌ బాస్‌.. క్రికెట్‌ చరిత్రలో అత్యంత వేగవంతమైన టీ20 శతకాన్ని తన పేరిట నమోదు చేసుకున్నాడు. సెంచరీ తర్వాత కూడా శాంతించని ఈ భారీకాయుడు.. మరో 36 బంతులను ఎదుర్కొని మొత్తంగా 175 పరుగులు సాధించాడు. 102 నిమిషాల పాటు క్రీజ్‌లో ఉన్న అతను.. 13 బౌండరీలు, 17 భారీ సిక్సర్లు బాది క్రికెట్‌ అభిమానులకు చిరకాలం గుర్తండిపోయే కనువిందును అందించాడు. ఈ క్రమంలో అతను టీ20ల్లో వేగవంతమైన శతకం(30 బంతుల్లో), అత్యధిక వ్యక్తిగత స్కోర్‌(175 నాటౌట్‌), ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్ల(17 సిక్సర్లు) రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రికార్డులు నేటికీ చెక్కుచెదరకుండా పదిలంగా ఉన్నాయి. 

గేల్‌ నాటి విధ్వంసం ధాటికి తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 5 వికెట్ల నష్టానికి 263 పరుగుల భారీ స్కోర్‌ చేయగా, ప్రత్యర్ధి జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 133 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో బెంగళూరు130 పరుగుల భారీ తేడాతో పూణేపై ఘనవిజయం సాధించింది. కాగా, నాటి ఆ జి'గేల్‌' ఇన్నింగ్స్‌ను గర్తుచేసుకుంటూ, ప్రస్తుతం అతను ప్రాతినిధ్యం వహిస్తున్న పంజాబ్‌ కింగ్స్‌ ఫ్రాంచైజ్‌ ట్వీట్‌ చేసింది. ఎనిమిదేళ్ల క్రితం గేల్‌ విధ్వంసాన్ని మేమంతా సాక్షులమంటూ క్యాప్షన్‌ను జోడించింది. నేడు చెన్నై వేదికగా పంజాబ్‌, ముంబై జట్లు తలపడనున్న నేపథ్యంలో గేల్‌ విధ్వంసం మరోసారి రిపీట్‌ కావాలని పంజాబ్‌ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. 
చదవండి: మలాన్‌ నం.1 టీ20 బ్యాట్స్‌మెన్‌ అయ్యుండొచ్చు.. కానీ గేల్‌తో పోలికా

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు