నా బౌలింగ్‌లో ఒక్క క్యాచ్‌ కూడా పట్టలేవ్‌!

9 Apr, 2021 17:28 IST|Sakshi
ఫోటో సోర్స్‌-ఆర్సీబీ ట్వీటర్‌ అకౌంట్‌

చెన్నై:   ఐపీఎల్‌-14 వ సీజన్‌లో భాగంగా ఫ్రిబ్రవరిలో జరిగిన వేలంలో ఆసీస్‌ ఆల్‌ రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌కు భారీ ధర వెచ్చింది ఆర్సీబీ తీసుకున్న సంగతి తెలిసిందే. ముందుగా ఊహించినట్లుగానే మ్యాక్స్‌వెల్‌ కోసం తీవ్ర పోటీ జరిగింది. మ్యాక్స్‌వెల్‌ కోసం ఆర్సీబీ కడవరకూ పోటీలో నిలిచి సొంతం చేసుకుంది. అతని కోసం భారీ మొత్తం వెచ్చించి తీసుకుంది ఆర్సీబీ.  మ్యాక్స్‌వెల్‌ను 14 కోట్ల 25 లక్షల రూపాయల భారీ ధర చెల్లించి ఆర్సీబీ కొనుగోలు చేసింది.  గతంలో కింగ్స్‌ పంజాబ్‌ తరఫున ఆడగా అతన్ని ఈ సీజన్‌లో వదిలేసుకుంది. గత సీజన్‌లో తీవ్రంగా నిరాశపరిచన కారణంగా మ్యాక్సీని పంజాబ్‌ విడుదల చేసింది.

దాంతో వేలంలోకి వచ్చిన మ్యాక్సీ మరొకసారి జాక్‌పాట్‌ కొట్టాడు. మ్యాక్స్‌వెల్‌ను కొనుగోలు చేయడానికి సీఎస్‌కే సైతం ఆసక్తి చూపగా చివరకు ఆర్సీబీ అతన్ని దక్కించుకుంది. ఫలితంగా పేపర్‌పై  ఆర్సీబీ బ్యాటింగ్‌ బలోపేతం అయ్యింది. ఒకవేళ మిడిల్‌ ఆర్డర్‌లో మ్యాక్స్‌వెల్‌ సెట్‌ అయితే మాత్రం ఆ జట్టు పెట్టుకున్న ఆశలు నెరవేరినట్లే.కాగా, ముంబై ఇండియన్స్‌తో చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో  జరుగునున్న ఐపీఎల్‌ ఆరంభపు మ్యాచ్‌లో ఆర్సీబీ తలపడనుంది. ఈ మ్యాచ్‌ ఆరంభానికి కొన్ని గంటల ముందు ఆర్సీబీ ఒక వీడియోను విడుదల చేసింది.

అందులో ఆర్సీబీ ప్రాక్టీస్‌కు సంబంధించిన అంశాలతో పాటు మ్యాక్స్‌వెల్‌-యజ్వేంద్ర చహల్‌ల మధ్య జరిగిన సరదా సంభాషణను కూడా సదరు ఫ్రాంచైజీ మిక్స్‌ చేసింది.  ఆ ఇద్దరు ఆటగాళ్ల సంభాషణలో భాగంగా ముందుగా మ్యాక్సీని చహల్‌ ఒక ప్రశ్న అడుగుతూ ‘ ఈ రెండు నెలల ఐపీఎల్‌లో నా బౌలింగ్‌లో ఎన్ని క్యాచ్‌లు పడతావ్‌’ అని అడగ్గా,  దానికి మ్యాక్స్‌వెల్‌ బదులిస్తూ ‘ చాలా క్యాచ్‌లు పడతాను, మరి నా బౌలింగ్‌లో నువ్వెన్ని క్యాచ్‌లు పడతావ్‌’ అని చహల్‌ను ఎదురుప్రశ్నిస్తాడు. ‘ కనీసం ఒకటి’ అంటూ చహల్‌ రిప్లే ఇవ్వగా, ఒక్కటి కూడా పట్టలేవ్‌’ అని మ్యాక్సీ అంటాడు. దాంతో వారిద్దరూ పగలబడి నవ్వుకున్నారు.


 

Poll
Loading...
Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు