‘తొలి ఓవర్‌ భజ్జీకి ఇచ్చాం.. మళ్లీ అందుకే ఇవ్వలేదు’

12 Apr, 2021 16:13 IST|Sakshi

చెన్నై:  ఈ ఐపీఎల్‌ సీజన్‌లో కేకేఆర్‌ జట్టులోకి అరంగేట్రం చేసిన హర్భజన్‌ సింగ్‌పై‌ ఆ జట్టు కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ ప్రశంసలు కురిపించాడు.  హర్భజన్‌లో ప్రస్తుతం తాను చూస్తున్న ఎనర్జీని తమ కేకేఆర్‌ క్యాంప్‌ మిగతా సభ్యులు ఎవరిలోనూ చూడలేదంటూ కొనియాడాడు.  దీనిలో భాగంగా  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో హర్భజన్‌కు తొలి ఓవర్‌ ఇవ్వడానికి  కారణాన్ని వెల్లడించాడు. డేవిడ్‌ వార్నర్‌, సాహాలను దృష్టిలో పెట్టుకునే భజ్జీకి తొలి ఓవర్‌ను వేయమని బంతిని చేతికి ఇచ్చానన్నాడు.  ప్రత్యర్థి జట్టు ఓపెనింగ్‌కు దిగిన తర్వాత భజ్జీకే మొదటి ఓవర్‌ ఇవ్వాలని భావించామన్నాడు.  ఇది  తమ ప‍్రణాళికలో భాగమనేని మోర్గాన్‌ పేర్కొన్నాడు. 

తొలి ఓవర్‌లోనే వార్నర్‌ వికెట్‌ను కేకేఆర్‌ సాధించే అవకాశం వచ్చినా దాన్ని జారవిడిచామన్నాడు.  తొలి ఓవర్‌ను హర్భజన్‌ చాలా గొప్పగా ఆరంభించాడని మ్యాచ్‌ తర్వాత కేకేఆర్‌ కెప్టెన్‌ వెల్లడించాడు.  కాగా, ఆ తర్వాత ఒకే ఒక కారణంతో భజ్జీకి బౌలింగ్‌ ఇవ్వలేదన్నాడు. ఎప్పుట్నుంచో క్రికెట్‌ ఆడటం లేని కారణంగా భజ్జీని ఆపి మిగతా వారితో బౌలింగ్‌ చేయించామన్నాడు. ఇక్కడ భజ్జీ అనుభవాన్ని మిగతా బౌలర్లకు గైడ్‌ చేయడంలో ఉపయోగించుకున్నామన్నాడు.  తాము ఆడే తదుపరి మ్యాచ్‌ల్లో హర్భజన్‌ బౌలింగ్‌ చేస్తాడని పేర్కొన్న మోర్గాన్‌.. అతను గతంలో ఏవిధంగా సత్తా చాటాడో అదే విధంగా కేకేఆర్‌ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తాడని ఆశిస్తున్నట్లు తెలిపాడు. 

సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించిన తర్వాత మొదటి ఓవర్‌  నాల్గో బంతికి వార్నర్‌ క్యాచ్‌ ఇవ్వగా దాన్ని ప్యాట్‌ కమిన్స్‌ జారవిడిచాడు. ఒకవేళ అది కమిన్స్‌ పట్టుకుని ఉంటే కేకేఆర్‌ తరఫున భజ్జీ ఖాతాలో మెయిడిన్‌ వికెట్‌ చేరేది. గత ఐపీఎల్‌ సీజస్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు హర్భజన్‌ ఆడిన సంగతి తెలిసిందే. కాగా,  ఈ సీజన్‌ ఆరంభానికి కొన్ని నెలల ముందే హర్భజన్‌ను సీఎస్‌కే వదిలేసుకుంది. దాంతో వేలంలోకి వచ్చిన  హర్భజన్‌ను కేకేఆర్‌ అతన్ని కనీస ధరకే కొనుగోలు చేసింది. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు