ఇలా ఆడితే గెలవలేం: వార్నర్‌ వార్నింగ్‌

18 Apr, 2021 01:14 IST|Sakshi
Photo Courtesy : ipl website

చెన్నై:  ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సైతం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓడిపోవడంతో ఆ జట్టు కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ ఓటమిని ఎలా తీసుకోవాలో తెలియడం లేదన్నాడు. ఆరంభంలో తమ ఆట బాగున్నా, చివరకు వచ్చేసరికి తేలిపోవడం గెలుపుపై ప్రభావం చూపుతుందన్నాడు. మ్యాచ్‌ తర్వాత అవార్డుల కార్యక్రమంలో వార్నర్‌ మాట్లాడుతూ.. ‘ నాకు ఏమి చెప్పాలో తెలియడం లేదు.. ఎలా తీసుకోవాలో అంతకన్నా అర్థం కావడం లేదు. మేము (బెయిర్‌ స్టో) ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని సెట్‌ చేశాం. కానీ దాన్ని కడవరకూ కొనసాగించలేకపోయాం. ప్రధానంగా చివర్లో బ్యాటింగ్‌ సరిగా లేకపోతే గెలవలేం. అదే పదే పదే రుజువువతోంది’ అంటూ వార్నర్‌ సహచర ఆటగాళ్లకు చిన్నపాటి వార్నింగ్‌ ఇచ్చాడు. 

నేను కడవరకూ క్రీజ్‌లో ఉండాలనే అనుకున్నా. అది నా గేమ్‌ ప్లాన్‌. కానీ హార్దిక్‌ పాండ్యా అద్భుతమైన త్రో కారణంగా రనౌట్‌ అయ్యా. ఇది ఛేజింగ్‌ చేసే టార్గెటే. భాగస్వామ్యాలు నమోదు చేసి కనీసం మా ఇద్దరిలో ఒకరం చివర వరకూ క్రీజులో ఉండాలనుకున్నాం. గేమ్ ప్లాన్‌‌ ఇలానే ఉంటుంది. మనం చేజింగ్‌ చేసే క్రమంలో మిడిల్‌ ఆర్డర్‌లో స్మార్ట్‌ క్రికెట్‌ ఆడాలి. ఈ స్లో వికెట్‌పై మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. గత వికెట్‌ కంటే ఈ వికెట్‌ బాగుంది. తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. చివర వరకూ బ్యాటింగ్‌ కొనసాగించే విధంగా ఉండాలి’ అని వార్నర్‌ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు