పదే పదే బౌల్డ్‌ కావడంతో ఏమీ అర్థంకాని పరిస్థితి

19 Apr, 2021 14:21 IST|Sakshi
Photo Courtesy:BCCI/IPL

ముంబై: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఇప్పటివరకూ ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆడిన మూడు మ్యాచ్‌లకు గాను రెండు మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఓపెనర్‌ అది ఆరంభాన్ని అందించాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 38 బంతుల్లో 9 ఫోర్లు,  3సిక్స్‌ల సాయంతో 72 పరుగులు చేసిన పృథ్వీ షా.. నిన్న(ఆదివారం) పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 పరుగులు చేశాడు. కాగా, విజయ్‌ హజారే ట్రోఫీలో ఎనిమిది మ్యాచ్‌ల్లో 827 పరుగులు చేసి ఈ టోర్నమెంట్‌ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రికార్డును సాధించిన పృథ్వీ షా తన పూర్వపు ఫామ్‌ను అందిపుచ్చుకున్నాడు.  

ఇలా  అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పడానికి తాను తీవ్రంగా శ్రమించడమే  కారణమన్నాడు. పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌ తర్వాత తన అనుభవాల్ని షేర్‌ చేసుకున్నాడు పృథ్వీ షా. ప్రధానంగా ఆస్ట్రేలియా సిరీస్‌లో తొలి టెస్టు తర్వాత జట్టులో చోటు దక్కపోవడం చాలా బాధించిందన్నాడు. ‘ ఆ సిరీస్‌లో తొలి టెస్టు తర్వాత నాకు జట్టులో చోటు దక్కలేదు. ఇక్కడ నా టెక్నిక్‌ గురించి విపరీతమైన కలత చెందా. నేను పదే పదే బౌల్డ్‌ అవుతున్నానంటే నా బ్యాటింగ్‌ టెక్నిక్‌లో ఏదో సమస్య ఉందని గ్రహించా. అది చిన్న సమస్య అయినా దాన్ని అధిగమించాలనుకున్నా. దానిపైనే ప్రధానంగా దృష్టి సారించి అందుకు అనుగుణంగానే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నా.

బౌలర్లు బంతులు వేసే ముందు వాటిని అంచనా వేయడంపై ఫోకస్‌ చేశా. ఆస్ట్రేలియా నుంచి వెంటనే నా యొక్క కోచ్‌ ప్రశాంత్‌ షెట్టి సర్‌, ప్రవీణ్‌ ఆమ్రే సర్‌ల పర్యవేక్షణలో దాన్ని సరిచేసుకున్నా.  విజయ్‌ హజారే ట్రోఫీకి వెళ్లేముందే నా టెక్నిక్‌ సమస్యను సరిచేసుకోవడంతో అక్కడ విశేషంగా రాణించా. తద్వారా విజయ్‌ హజారే ట్రోఫీలో నా సహజ సిద్ధమైన ఆటతో అలరించా. నేను సరిచేసుకున్నది కేవలం చిన్న టెక్నిల్‌ సమస్యే అయినా అది నాకు చాలా తలనొప్పిగా మారింది. నేను ఐపీఎల్‌ ​కోసం ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయలేకపోయాను. పాంటింగ్‌ సర్‌, ఆమ్రే సర్‌, ప్రశాంత్‌ షెట్టి సర్‌ల సూచనలతో నాకు మంచి ప్రాక్టీస్‌ సెషన్స్‌ లభిస్తున్నాయి’ అని తెలిపాడు. 

ఇక్కడ చదవండి: నీలాంటి కెప్టెన్‌ను చూడలేదు.. చాలా విచిత్రంగా ఉన్నావ్‌!
14.25 కోట్లు: క్రేజీ అనుకున్నా.. కానీ తప్పని నిరూపించాడు!

మరిన్ని వార్తలు