Imran Tahir: వయస్సు ఎక్కువ.. అందుకే సీక్రెట్‌గా ప్రాక్టీస్‌ చేస్తా

26 Apr, 2021 16:54 IST|Sakshi
courtesy : IPL Twitter

ముంబై: ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే బౌలర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ తన స్టన్నింగ్‌ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాహిర్‌ స్వేర్‌లెగ్‌ నుంచి  ఆర్‌సీబీ ఆటగాడు జేమిసన్‌ను డైరెక్ట్‌ త్రో ద్వారా రనౌట్‌ చేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తాహిర్‌ చేసిన రనౌట్‌పై రకరకాల మీమ్స్‌, ట్రోల్స్‌ వచ్చాయి. ఈ వయసులోనూ ఫీల్డింగ్‌లో ఇరగదీసిన తాహిర్‌ను మీ సీక్రెట్‌ ఎంటో చెప్పాలంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నకు తాహిర్‌ మ్యాచ్‌ విజయం అనంతరం బదులిచ్చాడు. మ్యాచ్‌ అనంతరం ఆల్‌రౌండర్‌ జడేజాతో జరిగిన ఇంటర్య్వూలో తాహిర్‌ మాట్లాడాడు.  

''ఈ విషయంలో మాత్రం నేను జడేజా నుంచి ఇన్‌స్పైర్‌ అయ్యాను. తానెంత మంచి ఫీల్డరో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే మనం ఆడేది ప్రోఫెషనల్‌ క్రికెట్‌.. ఫీల్డింగ్‌ చేయకపోతే కుదరదు. అయితే నా వయసు పెద్దది కావడంతో నేను మెరుపు ఫీల్డింగ్‌లు చేయగలనా అన్న సందేహం మీకు వచ్చింది. నిజానికి నేను నెట్స్‌లో ఎవరకి తెలియకుండా ఫీల్డింగ్‌ను ప్రాక్టీస్‌ చేస్తా. మా జట్టులోనే జడేజా లాంటి మెరుపు ఫీల్డర్‌ ఉన్నాడు. అతన్ని అందుకోవాలంటే ఈ మాత్రం ప్రాక్టీస్‌ లేకపోతే కష్టం'' అంటూ నవ్వుతూ పేర్కొన్నాడు.

ఇక జడేజా కూడా తాహిర్‌ ప్రదర్శనపై స్పందించాడు. ''తాహిర్‌కు 42 ఏళ్లు అంటే నమ్మలేకపోయా.. ఈరోజు మ్యాచ్‌లో అతను ఫీల్డింగ్‌ చేస్తే ఎలా ఉంటుందో చూపించాడు. కానీ అతని వయసుకు నేను వచ్చేసరికి నా ఫీల్డింగ్‌ ఇప్పుడున్నంత స్ట్రాంగ్‌గా ఉంటుందని అనుకోను'' అంటూ తెలిపాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే 69 పరుగుల తేడాతో సీఎస్‌కే ఘన విజయాన్ని అందుకుంది.  రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో మెరిసిన సంగతి తెలిసిందే. ముందు బ్యాటింగ్‌లో ఆఖరి ఓవర్‌లో సిక్సర్ల వర్షం కురిపించి 37 పరుగులు రాబట్టిన జడ్డూ మొత్తంగా 62 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆ తర్వాత బంతితోనూ మ్యాజిక్‌ చేసి మూడు వికెట్లు తీసి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన తాహిర్‌ మెరుపు రనౌట్‌తో పాటు బౌలింగ్‌లో 4 ఓవర్లు వేసి 16 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. ఇక సీఎస్‌కే తన తర్వాతి మ్యాచ్‌ను ఢిల్లీ వేదికగా ఏప్రిల్‌ 28న ఎస్‌ఆర్‌హెచ్‌తో తలపడనుంది. 

చదవండి: తాహిర్‌ సూపర్‌ రనౌట్‌.. ఈ వయసులోనూ

మరిన్ని వార్తలు