Chris Gayle: వయసు మీద పడుతున్న సింహం లాంటివాడే.. కానీ

29 Sep, 2021 12:43 IST|Sakshi
Photo: Irfan Pathan

Irfan Pathan Comments On Chris Gayle: పంజాబ్‌ కింగ్స్‌ మెరుగ్గా రాణించాలంటే స్టార్‌ బ్యాటర్‌ క్రిస్‌ గేల్‌ బ్యాట్‌ ఝులిపించాల్సిందేనని టీమిండియా మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అన్నాడు. అదే విధంగా.. కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో రాణించిన నికోలస్‌ పూరన్‌.. ఐపీఎల్‌లోనూ అదే స్థాయి ప్రదర్శన కనబరిస్తే జట్టుకు ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌-2021 రెండో అంచెలో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 

పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో మార్క్‌రమ్‌(42) టాప్‌ స్కోరర్‌గా నిలవగా... కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(21), దీపక్‌ హుడా(28) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. సిక్సర్ల వీరుడిగా పేరొందిన క్రిస్‌ గేల్‌ మాత్రం ఒక్క పరుగుకే నిష్క్రమించాడు. పొలార్డ్‌ బౌలింగ్‌లో హార్దిక్‌ పాండ్యాకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌చేరాడు. ఇక నికోలస్‌ పూరన్‌ సైతం రెండు పరుగులు చేసి.. బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 


Photo: PBKS Twitter

వేరే ఆప్షన్లు లేవు
ఈ నేపథ్యంలో పంజాబ్‌ ఆట తీరును విశ్లేషిస్తూ స్టార్‌ స్పోర్ట్స్‌తో మాట్లాడిన ఇర్ఫాన్‌ పఠాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘క్రిస్‌ గేల్‌ నుంచి పంజాబ్‌ మెరుగైన ప్రదర్శన కోరుకోవడం సహజం. అతడు వృద్ధాప్యం మీద పడుతున్న సింహం లాంటివాడే(గేల్‌ వయస్సు(42)ను దృష్టిలో పెట్టుకుని). కానీ, గేల్‌ పరుగులు చేయాల్సిందే. జట్టు అతడి నుంచి ఈమాత్రం ఆశించడం సహజం. ఎందుకంటే.. వారికి ప్రత్యామ్నాయం లేదు. ఆప్షన్లు కూడా ఎక్కువగా లేవు. 

మయాంక్‌ వస్తేనే
ఇక నికోలస్‌ పూరన్‌ విషయానికొస్తే... సీపీఎల్‌లో రాణించిన అతడు ఆ ఫాంను ఐపీఎల్‌లో కొనసాగించాల్సి ఉంది. మరో ఆటగాడు.. మార్క్‌రమ్‌.. ఈ మ్యాచ్‌లో చాలా బాగా ఆడాడు. హుడా కూడా పర్వాలేదు. కానీ.. ఈ స్కోరు సరిపోదు. మిగతా జట్లన్నీ వరుస విజయాలతో ముందుకు సాగుతూ ఉంటే... మీరు కూడా మీదైన ముద్ర వేసి.. పంచ్‌తో అదరగొట్టాలి. పంజాబ్‌ కింగ్స్‌, ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌ కచ్చితంగా ఇంకా మెరుగ్గా ఆడాల్సిందే’’ అని అభిప్రాయపడ్డాడు. ఇక గత మ్యాచ్‌లో మయాంక్‌ అగర్వాల్‌ లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపించిందని ఇర్ఫాన్‌ పఠాన్‌ అన్నాడు. అతడి మెడకు అయిన గాయం.. జట్టు వెన్నెముకనే విరిచేసిందని, మయాంక్‌ ఎంత త్వరగా జట్టుతో చేరితో అంత మంచిదని చెప్పుకొచ్చాడు.

స్కోర్లు: పంజాబ్‌- 135/6 (20)
ముంబై- 137/4 (19)
చదవండి: Ashwin Vs Morgan: అందుకే ఆ గొడవ జరిగింది: దినేశ్‌ కార్తిక్‌

మరిన్ని వార్తలు