సూపర్‌ జడ్డూ.. ఇటు రనౌట్‌.. అటు స్టన్నింగ్‌ క్యాచ్‌

16 Apr, 2021 21:45 IST|Sakshi
Courtesy: IPL Twitter‌

ముంబై: రవీంద్ర జడేజా.. ఫీల్డింగ్‌లో ఉన్నాడంటే బంతి అతని చేయి దాటి వెళ్లడం అసాధ్యం. మైదానంలో పాదరసంలా కదిలే జడేజా తన ఫీల్డింగ్‌ పవర్‌ ఏంటో మరోసారి రుచి చూపించాడు. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక కళ్లు చెదిరే క్యాచ్‌.. ఒక మెరుపు రనౌట్‌తో ఆకట్టుకున్నాడు. మొదట చహర్‌ ఇన్నింగ్స్‌ 3వ ఓవర్‌ ఐదో బంతిని  గేల్‌ ఫ్లిక్‌ చేశాడు. అయితే గేల్‌ రన్‌ కోసం సిగ్నల్‌ ఇవ్వడంతో రాహుల్‌ అప్పటికే క్రీజు దాటి ముందుకు పరిగెత్తాడు. దీంతో గేల్‌ కూడా అవతలివైపుకు వచ్చేశాడు. ఈ దశలో మెరుపువేగంతో స్పందించిన జడేజా డైరెక్ట్‌ త్రో విసరడంతో రెప్పపాటులో బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో రాహుల్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు.

అలా రాహుల్‌ను అద్భుత రనౌట్‌తో పెవిలియన్‌కు చేర్చిన జడ్డూ ఆ తర్వాత గేల్‌ను ఒక స్టన్నింగ్‌ క్యాచ్‌తో వెనక్కి పంపించాడు. దీపక్‌ చహర్‌ వేసిన 5వ ఓవర్‌ రెండో బంతిని గేల్‌ బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ దిశలో ఆడాడు. అయితే అప్పటికే అక్కడ కాచుకు కూర్చున్న జడేజా పాదరసంలా కదిలి ఒకవైపుగా డైవ్‌ చేస్తూ స్టన్నింగ్‌ క్యాచ్‌ అందుకున్నాడు. అలా ఇద్దరు కీలక ఆటగాళ్లను ఔట్‌ చేయడంలో జడ్డూ కీలకపాత్ర పోషించాడు. దీనికి సంబంధించిన రెండు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. షారుఖ్‌ ఖాన్‌ బాధ్యతాయుతంగా ఆడి 47 పరుగులు చేయడంతో పంజాబ్‌ కింగ్స్‌ ఆ మాత్రం స్కోరైనా నమోదు చేయగలిగింది. ఇక సీఎస్‌కే బౌలర్లలో దీపక్‌ చహర్‌ (4-1-13-4)తో తన కెరీర్‌ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేయగా.. బ్రావో, సామ్‌ కరన్‌, మొయిన్‌ అలీ తలా ఒక వికెట్‌ తీశారు.
చదవండి: మొదట రనౌట్‌ చేసినందుకు.. తర్వాత మ్యాచ్‌ గెలిచినందుకు
సంజూ సూపర్‌ క్యాచ్‌.. బిక్కమొహం వేసిన ధావన్

మరిన్ని వార్తలు