Jason Holder: నయా సంచలనం ఉమ్రాన్‌పై హోల్డర్‌ ప్రశంసలు

7 Oct, 2021 09:01 IST|Sakshi
ఐపీఎల్‌ 2021 సీజన్‌లో అత్యంత ఫాస్ట్‌బాల్‌(Courtesy: IPL Twitter)

Jason Holder Comments On Umran Malik: ఐపీఎల్‌-2021 రెండో అంచెలో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్‌ నటరాజన్‌ కోవిడ్‌ బారిన పడటంతో జట్టులోకి వచ్చాడు ఉమ్రాన్‌ మాలిక్‌. ఇటీవల కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో అరంగేట్ర మ్యాచ్‌ ఆడిన ఈ జమ్మూ కశ్మీర్‌ ఫాస్ట్‌ బౌలర్‌... ఈ సీజన్‌లోనే అ‍త్యంత వేగవంతంగా(సుమారు గంటకు 153 కి.మీ.) బంతిని విసిరాడు. ఐపీఎల్‌-2021లో ఇప్పటి వరకు భారత్‌ తరఫున ఫాస్టెస్ట్‌ డెలివరీ చేసిన బౌలర్‌గా నిలిచి.. క్రీడా పండితుల దృష్టిని ఆకర్షించాడు. ఇక రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో శ్రీకర్‌ భరత్‌(12)ను అవుట్‌ చేయడం ద్వారా.. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో తన తొలి వికెట్‌ నమోదు చేశాడు. 4 ఓవర్లు వేసిన ఉమ్రాన్‌.. 21 పరుగులు మాత్రమే ఇచ్చి సత్తా చాటాడు.

ఈ నేపథ్యంలో ఎస్‌ఆర్‌హెచ్‌ ఆల్‌రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌ నయా పేస్‌ సంచలనం ఉమ్రాన్‌ మాలిక్‌ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఉమ్రాన్‌ రాకతో తమ జట్టులో పేస్‌ విభాగం మరింత బలపడిందని.. నెట్స్‌లో పదునైన బంతులతో తమను బాగా ఇబ్బంది పెట్టినట్లు పేర్కొన్నాడు. ‘‘ప్రాక్టీసులో మాకు సవాలుగా నిలిచాడు. వేగంగా బంతులు విసరగలడు. ఎక్స్‌ట్రా పేస్‌ అనేది ఏ బౌలర్‌కైనా అదనపు బలం. అంతేకాదు.. ఎంత వేగంగా బంతిని విసిరినా అతడు నియంత్రణ కోల్పోడు. గత కొన్నేళ్లుగా ఎంతో మంది పేసర్లు వచ్చారు. 

కానీ... వారిలో చాలా మంది నిలకడలేమి ఆటతో ఇబ్బంది పడుతున్నారు. అయితే, ఉమ్రాన్‌ మాత్రం కాస్త భిన్నంగా కనిపిస్తున్నాడు. తను కచ్చితంగా మెరుగ్గా రాణించగలడు’’ అని సహచర ఆటగాడిపై హోల్డర్‌ ప్రశంసలు కురిపించాడు. ఇక ఆర్సీబీతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ 4 పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. రైజర్స్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక జేసన్‌ హోల్డర్‌ విషయానికొస్తే... ఈ మ్యాచ్‌లో 16 పరుగులు చేయడం సహా.. ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.

స్కోర్లు:
హైదరాబాద్‌: 141/7 (20)
బెంగళూరు: 137/6 (20)
చదవండి: IPL 2021: నిజంగా గుండె పగిలింది.. కనీసం చివరి మ్యాచ్‌ అయినా ఆడనివ్వండి!

>
మరిన్ని వార్తలు