పృథ్వీ షాను ఔట్‌ చేయడానికి ఆ ప్లాన్‌ ఉపయోగించా

16 Apr, 2021 16:25 IST|Sakshi
Courtesy: IPL Twitter

ముంబై: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో గురువారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో​ రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలర్‌ జైదేవ్‌ ఉనాద్కట్‌ మూడు వికెట్లతో చెలరేగిన సంగతి తెలిసిందే. మొదటి స్పెల్‌లోలోనే మూడు ఓవర్లు వేసిన అతను ఢిల్లీ ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్‌ ధావన్‌లతో పాటు అజింక్య రహానే వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా 4 ఓవర్లు వేసి 15 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన ఉనాద్కట్‌ 15 డాట్‌ బాల్స్‌ వేయడం విశేషం. ఈ నేపథ్యంలో పృథ్వీ షాను ఔట్‌ చేసేందుకు ఒక ప్లాన్‌ అమలు చేసినట్లు ఉనాద్కట్‌ మ్యాచ్‌ అనంతరం చెప్పుకొచ్చాడు.

''సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా ఎక్కువగా గ్రౌండ్‌ షాట్లు ఆడి విజయవంతమయ్యాడు. అందునా గత మ్యాచ్‌లో షా ఆడిన ఎక్కువ షాట్లు మిడ్‌వికెట్‌ రీజియన్‌ నుంచి వచ్చాయి. ఈ మ్యాచ్‌లో అలా కాకూదనే జాగ్రత్త వహించాం. స్లో బాల్‌ వేస్తే పృథ్వీ మిడ్‌వికెట్‌ దిశగా షాట్‌ ఆడే ప్రయత్నం చేస్తాడు. అందుకే నా రెండో ఓవర్‌లో ఆఖరి బంతిని స్లో బాల్‌గా వేశాను.. పృథ్వీ దానిని మిడ్‌వికెట్‌ దిశగా ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే అది బ్యాట్‌ ఎడ్జ్‌కు తగిలి బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌లో ఉన్న మిల్లర్‌ చేతికి చిక్కడంతో నా ప్లాన్‌ ఫలించింది. అలా షాను తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు పంపడంలో సక్సెస్‌ అయ్యాం.

ఇక మొదటి మ్యాచ్‌లో నాకు అవకాశం రాలేదు.. అయినా సరే అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలని ఎదురుచూశా. అలా రెండో మ్యాచ్‌లోనే ఒక మంచి స్సెల్‌ వేయడం .. కీలక వికెట్లు తీయడం నాకు కలిసొచ్చింది. గత సీజన్‌లో పెద్దగా రాణించలేకపోయా.. కానీ ఈ సీజన్‌లో దానిని పునరావృతం చేయకుండా చూసుకుంటా'' అని చెప్పుకొచ్చాడు. కాగా గత సీజన్‌లో ఉనాద్కట్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ తరపున 7 మ్యాచ్‌లాడి కేవలం 4 వికెట్లు మాత్రమే తీసి ఘోరంగా విఫలమయ్యాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఆల్‌రౌండర్‌ మోరిస్‌ మెరుపులతో ఆఖరి ఓవర్‌ నాలుగో బంతికి విజయాన్ని అందుకుంది. కాగా రాజస్తాన్‌ తన తర్వాతి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 19న సీఎస్‌కేతో ఆడనుంది.  
చదవండి: సంజూ ఎంతో చక్కగా షాట్స్‌ ఆడాడు.. కాబట్టి
సామ్సన్‌.. నా బ్యాటింగ్‌ చూడు!

>
మరిన్ని వార్తలు