'మేం ఓడిపోయుండొచ్చు.. కానీ మనుసులు గెలిచాం'

22 Apr, 2021 17:48 IST|Sakshi
Cortesy : IPL/BCCI

ముంబై: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 18 పరుగులతో‌ ఓడిపోయినా ఆకట్టుకుంది. చెన్నై విధించిన 221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ ఒక దశలో 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో దినేష్‌ కార్తిక్‌, ఆండ్రీ రసెల్‌లు విధ్వంసం సృష్టించారు. ముఖ్యంగా రసెల్‌ ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోగా.. కార్తిక్‌ కూడా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. రసెల్‌ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కమిన్స్‌.. సిక్సర్లతో  సీఎస్‌కే బౌలర్లను ఉతికారేస్తూ చుక్కలు చూపించాడు.

ఆఖరి 2 ఓవర్లలో 28 పరుగులు చేయాల్సిన దశలో టెయింలెండర్లు వికెట్లు సమర్పించుకోవడంతో కమిన్స్‌ పోరాటం వృథాగా మారింది. అలా మొత్తం ఓవర్లు కూడా ఆడకుండానే 19.1 ఓవరల్లో 202 పరుగులకు ఆలౌటై 18 పరుగులతో పరాజయం పాలైంది. అయితే నిన్నటి మ్యాచ్‌లో కేకేఆర్‌ ఓడిపోయినా నెటిజన్ల మనుసులు మాత్రం గెలుచుకుంది. రసెల్‌, కార్తీక్‌, కమిన్స్‌ల ప్రదర్శనపై నెటిజన్లు తమ ప్రేమను ప్రదర్శిస్తూ కామెంట్లు చేశారు. కేకేఆర్‌ సహా యజమాని షారుఖ్‌ ఖాన్‌.. ''కేకేఆర్‌ బాయ్స్‌ మీరు సూపర్‌'' అంటూ ట్వీట్‌ చేశాడు.

తాజాగా కేకేఆర్‌ మ్యాచ్‌ ఓటమిపై  ఆ ఫ్రాంచైజీ సహ యజమాని జూహి చావ్లా ట్విటర్‌ వేదికగా స్పందించారు. ' కేకేఆర్‌ టీమ్‌ను చూస్తే గర్వంగా ఉంది. మా కుర్రాళ్ల ప్రదర్శన నిజంగా అద్బుతం. ఈరోజు మ్యాచ్‌ ఓడిపోయిండొచ్చు.. కానీ మనసులు గెలవడంతో పాటు కొండంత ఆత్శవిశ్వాసాన్ని సాధించాం. థ్యాంక్యూ.. రసెల్‌, కార్తిక్‌ , కమిన్స్‌..  మీ హార్డ్‌వర్క్‌ సూపర్‌.. మీ ఆటకు ఫిదా' అంటూ కామెంట్‌ చేశారు. సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఓటమితో.. కేకేఆర్‌ వరుసగా హ్యాట్రిక్‌ పరాజయాన్ని నమోదు చేసింది. కాగా కేకేఆర్‌ తన తర్వాతి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 24న ముంబై వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌తో ఆడనుంది.
చదవండి: కేకేఆర్‌ బాయ్స్‌ మీరు సూపర్‌: షారుక్‌

రసెల్‌.. ఇది మమ్మల్ని బాధిస్తోంది..!

మరిన్ని వార్తలు