ఎస్‌ఆర్‌హెచ్‌ కీలక నిర్ణయం.. కెప్టెన్‌గా విలియమ్సన్‌

1 May, 2021 16:24 IST|Sakshi

ఢిల్లీ: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ వరుస ఓటములతో నిరాశ పరుస్తున్న సంగతి తెలిసిందే. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క విజయం నమోదు చేసి.. ఐదు పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఆఖరిస్థానంలో నిలిచింది. వరుస ఓటములతో డీలా పడడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. డేవిడ్‌ వార్నర్‌ స్థానంలో కేన్‌ విలియమ్సన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు తెలిపింది. రేపు రాజస్తాన్‌తో జరగబోయే మ్యాచ్‌తో పాటు లీగ్‌లో మిగతా మ్యాచ్‌లకు విలియమ్సన్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడని ట్విటర్‌లో తెలిపింది.

దీనికి సంబంధించిన ప్రెస్‌నోట్‌ను ట్విటర్‌లో రిలీజ్‌ చేసింది. వివరాలు.. ''ఎస్‌ఆర్‌హెచ్‌ మేనేజ్‌మెంట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎస్‌ఆర్‌హెచ్‌ను డేవిడ్‌ వార్నర్‌ స్థానంలో కేన్‌ విలియమ్సన్‌ నాయకత్వం వహించనున్నాడు. రేపు రాజస్తాన్‌ రాయల్స్‌తో జరగబోయే మ్యాచ్‌ నుంచే విలియమ్సన్‌ కెప్టెన్‌గా పనిచేయనున్నాడని... లీగ్‌లో మిగిలిఉన్న మ్యాచ్‌లకు కూడా అతనే కెప్టెన్‌గా ఉంటాడు. ఈ నిర్ణయం మేము బాగా ఆలోచించి తీసుకున్నాం. కెప్టెన్‌ మార్పుతో ఓవర్సీస్‌ కాంబినేషన్‌ కొత్తగా ఉండబోయే అవకాశాలు ఉండనున్నాయి. అయితే ఇన్నేళ్లుగా కెప్టెన్‌గా  జట్టును నడిపించిన వార్నర్‌కు మా  కృతజ్థతలు. కెప్టెన్‌ పదవి నుంచి తీసేసినంత మాత్రాన వార్నర్‌పై ఉన్న గౌరవం ఎన్నటికీ పోదు. అతను జట్టుకు టైటిల్‌ అందించిన కెప్టెన్‌.. విలియమ్సన్‌ కెప్టెన్సీలో అతను ఇంకా బాగా రాణించాలని.. ఆన్‌ఫీల్డ్‌ లేదా ఆఫ్‌ఫీల్డ్‌ ఏదైనా కావొచ్చు.. జట్టుకు ఉపయోగపడే సలహాలు ఇవ్వాలని కోరుతున్నాం. ''అంటూ సుధీర్ఘంగా రాసుకొచ్చింది. 

ఇక 2012లో డెక్కన్‌ చార్జర్స్‌ నుంచి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌గా పేరు మార్చుకొని బరిలోకి దిగిన ఆ జట్టుకు డారెన్‌ సామి, శిఖర్‌ ధావన్‌, కామెరున్‌ వైట్‌ లాంటి ఎంతో మంది ఆటగాళ్లు కెప్టెన్లుగా పనిచేశారు. అయితే 2015లో డేవిడ్‌ వార్నర్‌ ఆ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేసిన తర్వాత ఆ జట్టు తలరాత మారిపోయింది. 2016లో వార్నర్‌ కెప్టెన్సీలోనే ఐపీఎల్‌ టైటిల్‌ను కొల్లగొట్టింది. ఆ సీజన్‌లో వార్నర్‌ బ్యాటింగ్‌లో అసాధారణ ఆటతీరుతో అదరగొట్టి ఒంటిచేత్తో జట్టుకు టైటిల్‌ను అందించాడు.

అప్పటినుంచి 2018 సీజన్‌ మినహా మిగతా అన్ని సీజన్లకు కెప్టెన్‌గా పనిచేసిన వార్నర్‌ ప్రతీసారి ఫ్లేఆఫ్‌కు తీసుకురావడం విశేషం. ఇక బాల్‌ టాంపరింగ్‌ వివాదంతో ఏడాది నిషేదం ఎదుర్కొన్న వార్నర్‌ 2018 ఐపీఎల్‌ సీజన్‌కు దూరం కావడంతో అతని స్థానంలో విలియమ్సన్‌ కెప్టెన్‌గా పనిచేశాడు. అయితే ఆ ఏడాది విలియమ్సన్‌ అద్బుత కెప్టెన్సీకి తోడూ ఆటగాళ్లు కూడా విశేషంగా రాణించడంతో ఫైనల్‌కు వచ్చింది. అయితే ఫైనల్లో సీఎస్‌కే చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. అయితే ఈ సీజన్‌ ఆరంభంలో విలియమ్సన్‌ నాలుగు మ్యాచ్‌లకు దూరంగా ఉండడం.. వార్నర్‌ కెప్టెన్సీలో విఫలమవడంతో పాటు బ్యాటింగ్‌లోనూ అంతంత ప్రదర్శన నమోదు చేయడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్సీ మార్పును పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంది. మరి విలియమ్సన్‌ కెప్టెన్సీలో ఎస్‌ఆర్‌హెచ్‌ తలరాత మారుతుందేమో చూడాలి.
చదవండి: నాకు విసుగు తెప్పించారు: వార్నర్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు