రాహుల్‌ను‌ ఊరిస్తున్న ఆ రికార్డులేంటో తెలుసా..?

12 Apr, 2021 18:19 IST|Sakshi

ముంబై: గత మూడు ఐపీఎల్‌ సీజన్లలో అద్భుతంగా రాణించిన పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. నేడు ముంబై వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగబోయే మ్యాచ్‌లో మరో 78 పరుగులు సాధిస్తే, పంజాబ్‌ తరఫున 2000 పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. గతంలో షాన్‌ మార్ష్‌ మాత్రమే పంజాబ్‌ తరఫున 2000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 2018 నుంచి 2020 వరకు జరిగిన ప్రతి సీజన్‌లో 500కుపైగా పరుగులు సాధించిన రాహుల్‌.. పంజాబ్‌ తరఫున 42 ఇన్నింగ్స్‌ల్లో 140.08 స్ట్రయిక్‌ రేట్‌తో 1922 పరుగులు సాధించాడు.

2018లో తొలిసారి పంజాబ్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రాహుల్‌.. ఆ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 158.41 స్ట్రయిక్‌ రేట్‌తో 659 పరుగులు సాధించి, టోర్నీలో మూడో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో 6 అర్ధసెంచరీలున్నాయి. అనంతరం జరిగిన 2019 సీజన్‌లో కూడా రాహుల్‌ తన హవాను కొనసాగించాడు. ఆ సీజన్‌లో 14 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించిన అతను.. సెంచరీ, 6 అర్ధసెంచరీల సాయంతో 593 పరుగులు స్కోర్‌ చేశాడు. గతేడాది దుబాయ్‌ వేదికగా జరిగిన ఐపీఎల్‌లోనూ రాహుల్‌ పరుగుల వరద పారించాడు. తాను ఆడిన 14 మ్యాచ్‌ల్లో సెంచరీ, 5 అర్ధసెంచరీల సాయంతో 670 పరుగులు సాధించాడు.

రాహుల్‌ ప్రస్తుత సీజన్‌లో కూడా అదే ఫామ్‌ను కొనసాగించి మరో 555 పరుగులు సాధిస్తే, ఐపీఎల్‌లో పంజాబ్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్రలో నిలుస్తాడు. ఓవరాల్‌ టీ20 క్రికెట్‌లో రాహుల్‌ 139 ఇన్నింగ్స్‌ల్లో 137.51 స్ట్రయిక్‌ రేట్‌తో 4842 పరుగులు సాధించాడు. ఇందులో 4 శతకాలు, 39 అర్ధశతకాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో అతను మరో 158 పరుగులు సాధిస్తే టీ20 క్రికెట్‌లో యూసఫ్‌ పఠాన్‌, యువరాజ్‌ సింగ్‌ తర్వాత 5000 పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా రికార్డు నెలకొల్పనున్నాడు.

రాహుల్‌ మరో 8 సిక్సర్లు బాదితే టీ20 ఫార్మాట్‌లో 200 సిక్సర్ల అరుదైన జాబితాలో చోటు సంపాదిస్తాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 2647 పరుగులు(72 ఇన్నింగ్స్‌) సాధించిన రాహుల్‌.. మరో 353 పరుగులు చేస్తే ఐపీఎల్‌ 3000 పరుగుల క్లబ్‌లో చేరతాడు. ఇదిలా ఉంటే ముంబైలోని వాంఖడే స్టేడియంలో కూడా రాహుల్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. ఈ మైదానంలో అతనాడిన 4 మ్యాచ్‌ల్లో 80.67 సగటుతో 242 పరుగులు సాధించాడు. ఈ వేదికపై శ్రీలంక దిగ్గజ ఆటగాడు సనత్‌ జయసూర్యకు(105.5) మాత్రమే రాహుల్‌ కంటే ఉత్తమ సగటు ఉంది. 

మరిన్ని వార్తలు