మ్యాక్స్‌వెల్‌ ఇలా జరిగిందేంటి?

1 May, 2021 17:51 IST|Sakshi

అహ‍్మదాబాద్‌:  ఐపీఎల్‌-14 వ సీజన్‌కు సంబంధించి ఫ్రిబ్రవరిలో జరిగిన మినీ వేలంలో ఆసీస్‌ ఆల్‌ రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ను రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు భారీ ధరకు సొంతం చేసుకుంది. ఆ వేలంలో మ్యాక్స్‌వెల్‌ కోసం  తీవ్ర పోటీ జరిగినా చివరకు ఆర్సీబీనే సొంతం చేసుకుంది. మ్యాక్స్‌వెల్‌కు ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి హామీ ఇవ్వడంతో పట్టుబట్టి మరీ 14 కోట్ల 25 లక్షల రూపాయలకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. గతంలో కింగ్స్‌ పంజాబ్‌ తరఫున ఆడగా అతన్ని ఈ సీజన్‌లో వదిలేసుకుంది.  గత సీజన్‌లో తీవ్రంగా నిరాశపరిచన కారణంగా మ్యాక్సీని పంజాబ్‌ విడుదల చేసింది. దాంతో వేలంలోకి వచ్చిన మ్యాక్సీ అంచనాలకు అందకుండా జాక్‌పాట్‌ కొట్టాడు. 

ప్రతీకారం చేజారింది..
పంజాబ్‌ కింగ్స్‌కు గత సీజన్‌లో ఆడిన మ్యాక్స్‌వెల్‌.. ఈ సీజన్‌లో ఆర్సీబీ తరఫున విశేషంగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకూ 7 మ్యాచ్‌లు ఆడి 144 పైగా స్టైక్‌రేట్‌తో 223 పరుగులు చేశాడు. ప్రస్తుతం టాప్‌-6లో ఉన్న మ్యాక్స్‌వెల్‌ రెండు హాఫ్‌ సెంచరీలను కూడా సాధించాడు. జట్టుకు అవసరమైన ఇన్నింగ్స్‌ ఆడుతూ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. కానీ పంజాబ్‌ కింగ్స్‌పై ఆడటానికి క్రీజ్‌లోకి వచ్చిన సమయంలో మ్యాక్స్‌వెల్‌లో ఎంతో కొంత పాత ఫ్రాంచైజీపై ఆడుతున్న విషయం కచ్చితంగా నెమరువేసుకుంటాడు.  పంజాబ్‌పై కనీసం మంచి ఇన్నింగ్స్‌ ఆడాలనే భావించి ఉంటాడు. కొద్దిగా మరో అడుగు వేస్తే పంజాబ్‌పై సత్తా చాటి ప్రతీకారం తీర్చుకోవాలనే తలంపుతో బలంగా క్రీజ్‌లోకి వచ్చి ఉంటాడు. కానీ అక్కడ జరిగింది మ్యాక్సీ గోల్డెన్‌ డకౌట్‌గా పెవిలియన్‌  చేరడం. 

కోహ్లి ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన మ్యాక్స్‌వెల్‌.. ఆడిన తొలి బంతికే  బౌల్డ్‌ అయ్యాడు. ఆఫ్‌ స్టంప్‌ను  టార్గెట్‌  చేస్తూ హర్‌ప్రీత్‌ బ్రార్‌ వేసిన అద్భుతమైన బంతికి మ్యాక్స్‌వెల్‌ క్లీన్‌బౌల్డ్‌ కావాల్సి వచ్చింది. అసలు ఎప్పుడు క్రీజ్‌లోకి వచ్చాం.. ఏం జరిగింది అనే మ్యాక్సీ చూసుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆర్సీబీ 62 పరుగుల  వద్ద మ్యాక్స్‌వెల్‌  పరుగులేమీ చేయకుండా నిష్క్రమించడంతో ఆ ఫ్రాంచైజీ అభిమానులను నిరాశకు గురిచేసింది. పంజాబ్‌పై ప్రతాపం చూపెడతాడనుకుంటే, గోల్డెన్‌ డక్‌ అయ్యాడేంటని ఆర్సీబీ ఫ్యాన్స్‌ తలలు పట్టుకున్నారు. ప్రతీకారం తీర్చుకుందామనే ఆశ ఆవిరి కావడంతో మ్యాక్సీ ఎలా వచ్చాడో అలానే పెవిలియన్‌ చేరాడు. ఇది ఈ సీజన్‌లో ఇరుజట్ల మధ్య తొలి అంచె మ్యాచ్‌. ఇక రెండో అంచె మ్యాచ్‌ గురువారం(మే6వ తేదీ)న ఇదే వేదికలో జరగనుంది. మరి అప్పుడైనా మ్యాక్సీ మెరిసి పంజాబ్‌కు షాకిస్తాడో లేదో చూడాలి. 

ఇక్కడ చదవండి: డానియల్‌కు ఆర్సీబీ వార్నింగ్‌.. ఆ వీడియో తీసేశారు!
ఎస్‌ఆర్‌హెచ్‌ కీలక నిర్ణయం.. కెప్టెన్‌గా విలియమ్సన్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు