రనౌట్‌: ఏమో.. ఇదే నాకు చివరి మ్యాచ్‌ కావొచ్చు!

10 Apr, 2021 13:14 IST|Sakshi
రోహిత్‌ శర్మ రనౌట్‌(ఫొటో కర్టెసీ: ఐపీఎల్‌/బీసీసీఐ)

చెన్నై: గత ఐపీఎల్‌ సీజన్‌లో జట్టుతోనే ఉన్నా ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం పొందలేకపోయాడు ముంబై ఇండియన్స్‌ ఆటగాడు క్రిస్‌ లిన్‌. అయితే, ఈ సీజన్‌లో ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లోనే కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించాడు. అయితే, ఇద్దరి జోడీ బాగానే ఆడుతుందనకుంటున్న సమయంలో సమన్వయ లోపం కారణంగా రోహిత్‌ రనౌట్‌ అయిన సంగతి తెలిసిందే. ఆర్సీబీ బౌలర్‌ యజువేంద్ర చహల్‌ వేసిన 4వ ఓవర్‌ చివరి బంతిని క్రిస్‌ లిన్‌ కవర్స్‌ ఫ్లిక్‌ చేయగా, నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న రోహిత్‌ క్రీజు దాటి ముందుకు వచ్చాడు. ఈ క్రమంలో చురుగ్గా కదిలిని ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి బంతిని చహల్‌కు త్రో వేయగా, వెనువెంటనే వికెట్లకు గిరాటేయడంతో హిట్‌మ్యాన్‌ రనౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. 

ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం క్రిస్‌ లిన్‌ మాట్లాడుతూ.. ‘‘మొదటి మ్యాచ్‌ అది కూడా రోహిత్‌తో కలిసి ఆడనుండటంతో తొలుత కాస్త నర్వస్‌గా ఫీలయ్యాను. నిజానికి నేను పరుగు తీయొచ్చని అనుకున్నా. కానీ దురదృష్టవశాత్తూ రనౌట్‌కు ఆస్కారం ఏర్పడింది. ఒకవేళ అవకాశం ఉంటే కెప్టెన్‌ కోసం నా వికెట్‌ను సమర్పించుకునేవాడిని. ఏదేమైనా ఇలా జరగకుండా ఉండాల్సింది. తప్పిదం జరిగిపోయింది. ఒకవేళ రోహిత్‌ క్రీజులో ఉంటే ఇంకొన్ని పరుగులు చేసేవాడేమో. మ్యాచ్‌ ఫలితం కూడా వేరేలా ఉండేది కావొచ్చు. ఏమో ఎవరికి తెలుసు.. మొదటి మ్యాచే నాకు చివరి మ్యాచ్‌ అవుతుందేమో!’’ అని వ్యాఖ్యానించాడు. కాగా, శుక్రవారం నాటి మ్యాచ్‌లో క్రిస్‌లిన్‌ 35 బంతుల్లో 49 పరుగులతో రాణించాడు. ఇక ఈ మ్యాచ్‌లో ముంబై 2 వికెట్ల తేడాతో ఆర్సీబీ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

చదవండి: మాక్సీ మెరుపులు: గట్టిగా హగ్‌ ఇచ్చేవాళ్లం.. కౌంటర్‌ పడిందిగా!  
ఒక కెప్టెన్‌గా ఏం ఆశించానో.. అదే చేశాడు ‌: కోహ్లి

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు