లక్కీగా అర్జున్‌ బౌలర్‌ అయ్యాడు: జయవర్ధనే

19 Feb, 2021 13:23 IST|Sakshi

అర్జున్ టెండుల్కర్‌ ఐపీఎల్‌ ఎంట్రీ‌పై జయవర్ధనే వ్యాఖ్యలు

ముంబై: అర్జున్‌ టెండుల్కర్‌లో దాగున్న క్రీడా నైపుణ్యాల ఆధారంగానే అతడిని కొనుగోలు చేశామని ముంబై ఇండియన్స్‌ హెడ్‌ కోచ్‌ మహేలా జయవర్ధనే అన్నాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఆడటం ద్వారా ఎంతోమంది యువ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారని, తను కూడా ఈ లీగ్‌ ద్వారా తన సత్తా ఏమిటో నిరూపించుకునే అవకాశం ఉందన్నాడు. కాగా గురువారం జరిగిన ఐపీఎల్‌ మినీ వేలంలో భాగంగా, అంబానీ కుటుంబానికి చెందిన ముంబై ఇండియన్స్‌ ఫ్రాంఛైజీ అర్జున్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. రూ. 20 లక్షల బేస్‌ప్రైస్‌కు వేలంలోకి రాగా, అదే ధరకు అతడిని సొంతం చేసుకుంది. కాగా ఈ జట్టుకు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండుల్కర్‌ మెంటార్‌గా వ్యవహరిన్నాడు.

దీంతో అతడి కుమారుడిని జట్టులోకి తీసుకోవడంపై సహజంగానే విమర్శలు వినిపించాయి. ఇందుకుతోడు రైతు ఆందోళనల విషయంలో అంతర్జాతీయ సెలబ్రిటీలు చేసిన ట్వీట్లపై సచిన్‌ స్పందించిన తీరు, అర్జున్‌ ఐపీఎల్‌ అరంగేట్రాన్ని ముడిపెడుతూ కొంత మంది నెటిజన్లు ట్రోల్‌ చేశారు. ఈ నేపథ్యంలో జయవర్ధనే మాట్లాడుతూ.. ‘‘అర్జున్‌ తలపై సచిన్‌ కుమారుడు అనే అతిపెద్ద ట్యాగ్‌ ఉండటం సహజం. అయితే అదృష్టవశాత్తూ అతడు బ్యాట్స్‌మెన్‌ కాకుండా, బౌలర్‌ అయ్యాడు. నిజానికి అర్జున్‌ బౌలింగ్‌ తీరు పట్ల సచిన్‌ ఎంతో గర్వపడతారు. అయితే మేం కేవలం బౌలింగ్‌ నైపుణ్యాల ఆధారంగానే అతడిని ఎంపిక చేసుకున్నాం.

ఇంతవరకు ముంబై తరఫున ఆడిన అర్జున్‌, ఇప్పుడు ఎంఐకి ఆడబోతున్నాడు. ఆట పట్ల తనకున్న శ్రద్ధ అమోఘం. తనపై ఒత్తిడి పడకుండా చూసుకోవడమే మా బాధ్యత. మిగతాది తనే చూసుకుంటాడు’’ అని పేర్కొన్నాడు. ఇక ఆ జట్టు క్రికెట్‌ ఆపరేషన్స్‌ హెడ్‌ జహీర్‌ఖాన్‌ సైతం అర్జున్‌ నెట్స్‌లో కఠినంగా శ్రమిస్తాడని, తనొక అంకిత భావం గల యువ ఆటగాడు అని కితాబిచ్చాడు. ఇదిలా ఉండగా.. తనకు ఐపీఎల్‌ ఆడే అవకాశం కల్పించినందుకు తమకు ధన్యవాదాలు చెబుతూ అర్జున్‌ మాట్లాడిన వీడియోను ముంబై షేర్‌ చేసింది.

చదవండిఒక్క హైదరాబాద్‌ ప్లేయర్‌కీ చోటులేదు: అజారుద్దీన్
వీళ్లిద్దరు చూడముచ్చటగా ఉన్నారు!    

మరిన్ని వార్తలు