నా ఐపీఎల్‌ కెరీర్‌లోనే లాంగెస్ట్‌ సిక్స్‌: సూర్యకుమార్

14 Apr, 2021 12:57 IST|Sakshi
Photo Courtesy: Surya Kumar Yadav Twitter

చెన్నై: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై బ్యాట్స్‌మెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ అర్ధ సెంచరీతో ఆకట్టున్నాడు. 36 బంతులు ఎదుర్కొన్న అతడు 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 56 పరుగులు చేసి ముంబై గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ముఖ్యంగా పదో ఓవర్‌లో ప్యాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో సూర్యకుమార్‌ కొట్టిన సిక్స్‌ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఈ సిక్సర్‌ సాయంతో ఫిఫ్టీ పూర్తిచేసుకున్న అతడు ముంబై టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. సూర్య తర్వాత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(43) అత్యధిక స్కోరు చేయగా, మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. ఈ క్రమంలో 152 పరుగులు చేసిన ముంబై, బౌలర్లు విజృంభించడంతో 10 పరుగుల తేడాతో కేకేఆర్‌పై విజయఢంకా మోగించి ఈ సీజన్‌లో బోణీ కొట్టింది.

ఈ నేపథ్యంలో సూర్యకుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ‘‘అనుకోకుండా ఆ షాట్‌ ఆడాను. వికెట్‌ అంత అనుకూలంగా ఏమీ లేదు. కాబట్టి ఆచితూచి ఆడుతున్నాం. ఆ సమయంలో నేను కొట్టిన షాట్‌ 99 మీటర్ల ఎత్తుకు వెళ్లిందనే మాట వినబడింది. నాకు తెలిసి నా ఐపీఎల్‌ కెరీర్‌లో ఇప్పటి వరకు ఇదే లాంగెస్ట్‌ సిక్సర్‌. అది కూడా ఇదే జట్టుకు. అది కూడా అత్యంత కీలకమైన సమయంలో, గెలవాల్సిన మ్యాచ్‌లో ఈ షాట్‌ ఆడటం ప్రత్యేకం. గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మ్యాచ్‌లో విజయం సాధించాలంటే కచ్చితంగా ఆత్మవిశ్వాసం ఉండితీరాలి. నాకు తెలిసి 152 మరీ అంత పెద్ద స్కోరేమీ కాదు. మరో 15-20 పరుగులు చేయాల్సింది. తేమ కూడా ఎక్కువగానే ఉంది. ఇలాంటి తరుణంలో మేం విజయం సాధించామంటే ఆ క్రెడిట్‌ అంతా మా బౌలర్లకే దక్కుతుంది. అద్భుతంగా రాణించారు. ఫీల్డర్లు కూడా పూర్తి సహకారం అందించారు. చాలా చాలా సంతోషంగా ఉంది’’ అని హర్షం వ్యక్తం చేశాడు. 

చదవండి: చెన్నైలో గేమ్‌ ఛేంజర్‌ అంటే స్పిన్నరే అని తెలుసు.. అందుకే‌
చెన్నైలో అదొక ట్రెండ్‌: రోహిత్‌

మరిన్ని వార్తలు