మొయిన్ ‌అలీపై చెన్నై కోచ్‌ ప్రశంసల వర్షం

20 Apr, 2021 16:30 IST|Sakshi

ముంబై: మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తూ వేగంగా పరుగులు రాబట్టడమేకాకుండా, తన కోటా ఓవర్లను విజయవంతంగా పూర్తి చేస్తూ కీలకమైన వికెట్లు పడగొడుతున్న సీఎస్‌కే ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీపై ఆ జట్టు హెడ్‌ కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. కీలకమైన వన్‌డౌన్‌లో రాణిస్తూ, బౌలర్‌ పాత్రను సమర్ధవంతంగా నిర్వహిస్తున్న మొయిన్‌ అలీ ఈ సీజన్‌లో సీఎస్‌కే అసలుసిసలైన ఆల్‌రౌండర్‌గా అవతరించాడని ఆకాశానికెత్తాడు. ప్రస్తుత సీజన్‌లో చెన్నై ఆడిన మూడో మ్యాచ్‌ల్లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగి వరుసగా 36, 46, 26 పరుగులు స్కోర్‌ చేసిన మొయిన్‌.. సోమవారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు కీలకమైన వికెట్లు(మిల్లర్‌, రియాన్‌ పరాగ్‌, మోరిస్‌) పడగొట్టి రాజస్థాన్‌ పతనాన్ని శాశించాడని కొనియాడాడు.

మొయిన్‌ లాంటి అసలుసిసలైన ఆల్‌రౌండర్‌ లేని కారణంగానే గత సీజన్‌లో చెన్నై ఆఖరి స్థానానికి పడిపోయిందని పేర్కొన్నాడు. గత సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన మొయిన్‌ అలీని దక్కించుకోవడం సీఎస్‌కేకి కలిసొచ్చిందని, మున్ముందు జరుగబోయే మ్యాచ్‌ల్లో అతని ఆల్‌రౌండ్‌ ప్రతిభ జట్టుకు మేలుచేకూర్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుత సీజన్‌లో 3 మ్యాచ్‌ల్లో 108 విలువైన పరుగులతో పాటు 4 కీలకమైన వికెట్లు పడగొట్టిన మొయిన్‌..చెన్నై తరుపు ముక్కగా మారాడని ప్రశంసించాడు.

అలాగే ఫామ్‌లోని లేని ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ను ఫ్లెమింగ్‌ వెనకేసుకొచ్చాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమైనా రుతురాజ్‌ టెక్నిక్‌ పరంగా ఉత్తమ ప్లేయర్‌ అని కొనియాడాడు. రుతురాజ్‌కు మరిన్ని అవకాశలు కల్పిస్తామని, ఆతరువాతే ఉతప్పకు అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నాడు. జట్టులో ఎవ్వరూ భారీ స్కోర్లు సాధించకపోయినా.. ఆయా ఆటగాళ్లు తమ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించడం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశాడు. నిన్న రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 45 పరుగుల తేడాతో విజయం సాధించిన సీఎస్‌కే.. బుధవారం(ఏప్రిల్‌ 21న) జరుగబోయే తదుపరి మ్యాచ్‌లో కేకేఆర్‌తో తలపడనుంది.
చదవండి: డబ్యూటీసీ ఫైనల్‌ యధావిధిగా జరుగుతుంది: ఐసీసీ

మరిన్ని వార్తలు